4 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం : ఆర్థికవేత్తలు

by  |
4 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం : ఆర్థికవేత్తలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 4 నెలల గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉందని రాయటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఆహార, ఇంధన ధరలు పెరగడమే దీనికి కారణమని తెలిపారు. అయితే, ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) లక్ష్యం పరిధిలోనే ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ వారం ప్రారంభంలో రాయటర్స్ నిర్వహించిన పోల్‌లో 50 శాతం మందికి పైగా ఆర్థికవేత్తలు మార్చి నెలలో ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉండోచ్చని అంచనాలను వెల్లడించారు. ఇదివరకు ఆర్థికవేత్తలు దీన్ని 5.03 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ప్రధాన ద్రవ్యోల్బణం(ఆహారం, ఇంధనం, విద్యుత్ మినహా) సానుకూలంగా ఉండవచ్చునని, ఇటీవల భారీగా పెరిగిన ఆహార పదార్థాల ధరలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

ప్రస్తుతం రికవరీ వేగంగా ఉన్నట్టు కనిపిస్తోందని, కానీ దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ మొదలవడంతో ఇది ఎంత కాలం కొనసాగుతుందనే విషయంపై స్పష్టత లేదని, వేచి ఉండాలని వారు స్పష్టం చేశారు. ఆర్థిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన మొదటి ద్రవ్య పరపతి విధానం(ఎంపీసీ) సమీక్షలో మొదటి అర్ద సంవత్సరానికి ద్రవ్యోల్బణాన్ని 5.2 శాతం అంచనాను ప్రకటించింది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల పెరుగుదల ఆర్థిక వృద్ధికి అతిపెద్ద ప్రమాదంగా ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు దారితీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి గతేడాది కంటే 3 శాతం కుదించుకుపోవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల రంగం 4.6 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు వెల్లడించారు.


Next Story