ఊపందుకున్న తయారీ రంగం.. పెరిగిన పీఎంఐ

by  |
ఊపందుకున్న తయారీ రంగం.. పెరిగిన పీఎంఐ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు అక్టోబర్‌లో ఊపందుకున్నాయి. వరుసగా నాలుగో నెలలో మరింత పుంజుకుంటున్నాయి. అక్టోబర్‌లో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 55.9 శాతంగా నమోదైంది. అంతకుముందు ఇది 53.7 శాతంగా ఉంది. పరిశ్రమల ఉత్పత్తితో పాటు ముడిసరుకుల కొనుగోళ్లు పెరిగాయని, రాబోయే రోజుల్లో డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా అంచనా వేసింది.

కొత్త ఆర్డర్లలో వృద్ధి అత్యధికంగా ఉండటంతో సమీక్షించిన నెలలో తయారీ కార్యకలాపాలు 7 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ వివరించింది. సాధారణంగా పీఎంఐ సూచీ 50 కంటే ఎక్కువ ఉంటే వృద్ధిగానూ, 50 కంటే దిగువన ఉంటే క్షీణతగానూ భావిస్తారు. వ్యాపార కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగడం, కొత్త ఆర్డర్లు పెరగడం మూలంగానే తయారీ కార్యకలాపాలు గణనీయంగా కొనసాగుతున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రతినిధి అన్నారు.

అంతేకాకుండా ఇటీవల భారత కంపెనీల ఉత్పత్తులకు ఇతర దేశాల్లో సైతం డిమాండ్ కనిపిస్తోందని ఐహెచ్ఎస్ మార్కిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో సరుకుల కొరత వల్ల ముడి సరుకుల ధరల ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరుకుంది. కానీ భవిష్యత్తుపై ఆశతో కంపెనీలు కొత్త ఉత్పత్తులతో పాటు విస్తరణ ప్రక్రియలను చేపడుతున్నాయి. సమీక్షించిన నెలలో ఉపాధి కల్పనలో వృద్ధి కనిపించలేదని గణాంకాలు వెల్లడించాయి.


Next Story

Most Viewed