బడ్జెట్‌లో దిగుమతి సుంకం పెంచే అవకాశం!

by  |
బడ్జెట్‌లో దిగుమతి సుంకం పెంచే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, పరికరాలతో సహా 50కి పైగా వస్తువులపై దిగుమతి సుంకాలను 5 శాతం నుంచి 10 శాతం పెంచే అంశంపై కేంద్రం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం వర్గాలు సోమవారం తెలిపాయి. దేశీయ తయారీని ప్రోత్సహించడం, మద్దతివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలోనే దిగుమతి సుంకాలను పెంచే చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికారిక వివరాలు వెలువడే వరకు బయటపెట్టకూడదని సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కోన్నాయి. ఈ దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా సుమరు రూ. 19 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని సాధించడం ప్రభుత్వ లక్ష్యమని తెలుస్తోంది.

ఈ సుంకాల పెంపు ద్వారా ఫర్నీచర్, ఎలక్ట్రిక్ వాహనాలపై అధిక ప్రభావం ఉండొచ్చని, ముఖ్యంగా భారత్‌లో వ్యాపారాలను విస్తరించాలని భావిస్తున్న ఐకియా, టెస్లా వంటి కంపెనీలకు ఇబ్బందికరమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఫర్నీచర్, ఎలక్ట్రిక్ వాహనాలపై ఎంతమేరకు పెంపు ఉంటుందనే విషయంపై స్పష్టత లేదని వారు పేర్కొన్నారు. కాగా, గతేడాది చెప్పులు, ఫర్నీచర్, బొమ్మలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి పలు ఉత్పత్తులపై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే.


Next Story