ఇండియా కంటే బ్రిటన్‌లో బలైన భారతీయులే ఎక్కువ!

by  |
ఇండియా కంటే బ్రిటన్‌లో బలైన భారతీయులే ఎక్కువ!
X

లండన్: ఇండియాలో జనవరి చివరి వారంలో ప్రవేశించిన కరోనా ఏప్రిల్ నాలుగో వారానికల్లా 27,892 మందికి సోకింది. అదే సమయంలో 872 మంది మృతి చెందారు. ఇంగ్లాండ్‌లో 1.53 లక్షల మంది కరోనా బాధితులు ఉండగా.. 20,732 మంది మృత్యువాతపడ్డారు. బ్రిటన్ ప్రధాని బోరీస్ కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నారంటే కరోనా ఎంత తీవ్రంగా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లో కోవిడ్-19 కారణంగా మరణించిన వాళ్లలో వెయ్యి మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియాలో మొత్తం మృతులు 872 ఉంటే.. ఇంగ్లాండ్‌లో కేవలం భారతీయులే 1000 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం.

ఇంగ్లాండ్‌లో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ ఆసుపత్రులు, తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రుల్లో మరణించిన వారినే లెక్కలోకి తీసుకున్నారు. కానీ ఇండ్లలో, కేర్ హోమ్‌లలో మరణించిన వారిని లెక్కలోనికి తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపితే ప్రస్తుతం వెలువరిస్తున్న మరణాల కంటే దాదాపు 50 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.

విస్మయకర విషయాలు..

మరోవైపు బ్రిటన్‌లోని ప్రముఖ పత్రిక విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. బ్రిటన్‌లో కరోనాతో మరణిస్తున్న ప్రతీ 10 మందిలో ఒకరు భారతీయులని తేల్చి చెప్పింది. బ్రిటన్‌లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 40 శాతం మంది ఆసియాకు చెందినవారు ఉన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. బ్రిటన్‌లో భారతీయుల అంత్యక్రియలు నిర్వహించేందుకు డిమాండ్ పెరిగిందని.. అక్కడి మత గురువులకు ఖాళీ లేకుండా పోయిందని.. దీన్ని బట్టే భారతీయుల మరణాలు ఏ సంఖ్యలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని సదరు పత్రిక తెలియజేసింది. 120 కోట్ల పైగా జనాభా ఉన్న ఇండియాలో 1000కి లోపే మరణాలు ఉంటే.. 15 లక్షల మంది భారతీయులు ఉన్న బ్రిటన్‌లో మృతుల సంఖ్య వెయ్యి దాటిపోవడం గమనార్హం.

Tags: Coronavirus, Covid 19, England, India, Deaths, Minority Groups



Next Story