టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో భారత్

by  |
టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో భారత్
X

భారత జట్టు మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం సిడ్నీలో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత జట్టు తొలిసారిగా ఈ మెగా ఈవెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌కు రిజర్వ్ డే లేకపోవడంతో గ్రూప్ దశలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు నేరుగా ఫైనల్స్ చేరుకుంది.

వర్షం తగ్గితే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాలని నిర్వాహకులు భావించారు. కానీ అసలు టాస్ వేసేందుకు కూడా వీలు లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాచ్ నిర్వహణకు రిజర్వ్ డే కావాలని ఐసీసీని కోరింది. అయితే, ఇప్పటికిప్పుడు రిజర్వ్ డే ఏర్పాటు చేయడం కుదరదని ఐసీసీ స్పష్టం చేసింది. మరోవైపు రెండో సెమీస్‌లో సౌత్ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ప్రమాదం పొంచి ఉంది.

కాగా, ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఏర్పాటు చేసి, సెమీస్‌కు లేకపోవడాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ తప్పుబట్టింది. టోర్నీలో ఇదొక బాధాకరమైన రోజని ఆమె వ్యాఖ్యానించారు.

చాలా గర్వంగా ఉంది : విరాట్ కోహ్లీ

ఐసీసీ మహిళా వరల్డ్ టీ20 ఫైనల్స్‌లోకి భారత జట్టు తొలిసారిగా అడుగుపెట్టడంపై టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మహిళలు ఈ మెగా ఈవెంట్‌లో సాధించిన విజయాలతో పాటు ఫైనల్స్‌కు చేరుకోవడం ఎంతో గర్వకారణమని అన్నాడు. మహిళా జట్టు ఫైనల్స్‌లో కూడా విజయం సాధించి చరిత్ర సృష్టించాలని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ కప్ సాధించేందుకు మహిళా జట్టుకు అన్ని అర్హతలు ఉన్నాయని ట్వీట్ చేశాడు. మరోవైపు భారత జట్టు క్రికెటర్ కేఎల్ రాహుల్ సైతం మహిళా జట్టుకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు.

tags : ICC Women T20, Ind vs England, Rain, India Final, Kohli



Next Story

Most Viewed