డ్రోన్‌లు, ఫైర్ ఇంజిన్‌లతో మిడతలపై యుద్ధం

by  |
డ్రోన్‌లు, ఫైర్ ఇంజిన్‌లతో మిడతలపై యుద్ధం
X

న్యూఢిల్లీ : మిడతే కదా అని తీసిపారేస్తే రేపు దేశ ప్రజలకు ఆహారమే లేకుండా చేస్తాయి.ఇప్పటికే తూర్పు ఆఫ్రికా, పాకిస్తాన్‌లలో పంటలను నాశనం చేసిన అడవి మిడతలు రాజస్తాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాయి.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మిడతల గుంపులను నేలమట్టం చేసే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్‌లు, ట్రాక్టర్లతో రసాయనాల పిచికారీ, డీజే(డిస్క్ జాకీలు)ల చప్పుళ్లతో మిడతలపై యుద్ధమే చేస్తున్నారు. మిడతల ప్రయాణాలను డ్రోన్‌లతో పసిగడుతూ ఆయా ప్రాంతాల్లోని రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 700 ట్రాక్టర్లు, 75 ఫైర్ ఇంజిన్‌లు, 50 ఇతర వాహనాలతో పురుగుల మందును పిచికారీ చేయించి మిడతలను మట్టుబెడుతున్నారు. ఇప్పుడున్న ఉధృతినైతే మేనేజ్ చేయగలుగుతాం కానీ, ఇది ఇలాగే కొనసాగితే కష్టతరమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మోహపాత్ర తెలిపారు. మనదేశంలో ఆరు రాష్ట్రాలు రాజస్తాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో పండిన పంటను ఈ మిడతలు నష్టపరిచాయి.వీటిలో మిడతలు తొలుత ప్రవేశించిన రాజస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికి మనదేశంలో 1,04,000 ఎకరాల భూమిలో వేసిన పత్తి, పప్పు ధాన్యాలు, కూరగాయలు, వరిపొలాలను నష్టపరిచాయని మోహపాత్ర వెల్లడించారు. ఒక్కో మిడత గుంపు కిలోమీటరు వైశాల్యంతో రోజుకు నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. ఒక్క గుంపులో సుమారు నాలుగు కోట్ల మిడతలుంటాయి. 30 లక్షల మంది తినే ఆహారాన్ని ఈ నాలుగు కోట్ల మిడతలు అంటే ఒక్క మిడతల గుంపు సునాయసంగా లాగించేస్తాయని నిపుణులు చెబుతున్నారు.


Next Story

Most Viewed