చరిత్రలో ఈ రోజు.. భారత్‌కు రెండో వరల్డ్ కప్

by  |
చరిత్రలో ఈ రోజు.. భారత్‌కు రెండో వరల్డ్ కప్
X

సరిగ్గా.. తొమ్మిది సంవత్సరాల కిందట ఇదే రోజున.. ముంబయి, వాంఖడే స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు నిలబడి చూస్తున్నారు. అంతకన్నా మించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీల ముందు ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు. భారత్ వరల్డ్ కప్ ముద్దాడేందుకు మరో నాలుగు పరుగులు చేస్తే చాలు ! క్రీజ్‌లో కెప్టెన్ కూల్ ధోనీ.. అవతల శ్రీలంక బౌలర్ కులశేఖర బంతితో రెడీ అయ్యాడు. వేగంగా దూసుకొచ్చిన బంతిని ధోనీ క్రీజ్‌లోనే నిలబడి బలంగా బాదాడు. అంతే.. బంతి నేరుగా వెళ్లి గ్యాలరీలో పడింది. ఒక్కసారిగా స్టేడియం అంతా కేరింతలతో మారుమోగింది. 28 ఏళ్ల తర్వాత భారత జట్టు క్రికెట్ వరల్డ్ కప్‌ను ముద్దాడిన క్షణమది. కెరీర్ ముగిసేలోపు ఒక్కసారైనా ప్రపంచ కప్‌ను ముద్దాడాలనుకున్న సచిన్‌ కల నెరవేరిన రోజది. ఎంతో మంది భారత సీనియర్ కెప్టెన్లకు సాధ్యం కానిదాన్ని ధోని సుసాధ్యం చేసిన రోజది. భారత్ క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపిన క్షణాలవి.

ఐసీసీ వరల్డ్ కప్ 2011కు ఫైనల్‌కు చేరుకున్న భారత్, శ్రీలంక రెండు జట్లు కూడా వారి వారి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్లే. గ్రూప్ బీలో భారత్‌తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. భారత జట్టు సౌతాఫ్రికాపై ఓడిపోగా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు చేరింది. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీసే ఒక ఫైనల్‌ను తలపించింది. మొహలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. జయవర్దనే(103) అజేయ శతకం బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోరు కట్టబెట్టాడు. అతనికి తోడుగా కెప్టెన్ సంగక్కర (48), దిల్షాన్ (33) బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక జట్టు 274 పరుగులు చేసింది.

ప్రపంచ కప్ గెలవాలంటే 275 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును యార్కర్ కింగ్ మలింగ ఆదిలోనే దెబ్బతీశాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ సెహ్వాగ్‌ను డకౌట్‌ చేసి శ్రీలంక శిబిరంలో ఆనందం నింపాడు. ఇక తన జీవితంలో ఆఖరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న సచిన్ కూడా అంచనాల మేర రాణించలేక 18 పరుగులకే వెనుదిరిగాడు. ఆ సమయంలో గంభీర్ (97), విరాట్ కోహ్లీ (35)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ కలసి 83 పరుగులు జోడించిన తర్వాత కోహ్లీ దిల్షాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో యువరాజ్ రావాల్సి ఉండగా.. కెప్టెన్ ధోనీ రంగంలోకి దిగాడు. 79 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. మధ్యలో గంభీర్ అవుటైనా.. యువరాజ్ (21) సహకారంతో భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.


Next Story