భారత్‌ పై పంజా విసురుతోన్న కరోనా

by  |
భారత్‌ పై పంజా విసురుతోన్న కరోనా
X

న్యూఢిల్లీ : భారత్‌లో రోజురోజుకూ కరోనా పంజా విసురుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ఈ నెల 1వ తేదీ తర్వాత ప్రతిరోజూ 2,400 కేసులకు పైగా నమోదవ్వగా..7 తర్వాత కనీసం 3వేలుగా నమోదయ్యాయి. గడిచిన వారం రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య 5,000 నుంచి 6,000లకు మధ్య నమోదవుతోంది. (ఒక్క 19వ తేదీన 4,970 కేసులు రిపోర్ట్ అయ్యాయి). గత మూడ్రోజుల్లో వరుసగా 6,705, 6,088, 6,654 చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ స్థాయిలో కొత్తగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల సరసన భారత్ నిలుస్తున్నది. అమెరికా, బ్రెజిల్, రష్యాల తర్వాత భారత్‌లోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతోపాటు కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా వృద్ధి చెందుతున్నట్టు సమాచారం.

ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. ఆ జాబితాలో భారత్ టాప్ 5లో ఉన్నట్టు అవగతమవుతున్నది. మే 18న అమెరికాలో కొత్తగా 31,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా, బ్రెజిల్‌లో 7,938, రష్యాలో 9,263 చొప్పున నమోదయ్యాయి. ఈ దేశాల తర్వాత భారత్‌లోనే అత్యధికంగా(4,970) రిపోర్ట్ అయ్యాయి. 19వ తేదీన అమెరికాలో 13,227, బ్రెజిల్‌లో 13,140, రష్యాలో 8,764 కొత్త కేసులు నమోదవ్వగా, ఇండియాలో 5,611 కేసులు వెలుగుచూశాయి. 20వ తేదీన అమెరికాలో 24,417, బ్రెజిల్‌లో 17,408, రష్యాలో 8,849, ఇండియాలో 5,609 కేసులు రిపోర్ట్ అయ్యాయి. 21న అమెరికాలో 23,310, బ్రెజిల్‌లో 19,951, రష్యాలో 8,894 కేసులు వెలుగుచూడగా, భారత్‌లో 6,088 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇండియా తర్వాత అత్యధిక కేసులు చాలా వరకు పెరూలో నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచంలో కరోనా హాట్‌స్పాట్ కంట్రీగా భారత్ అవతరిస్తున్నదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సహా పలువురు వైద్య నిపుణులు చెప్పినట్టుగా మే చివరినాటికి లాక్‌డౌన్ ఎత్తేస్తే జూలై మధ్యలో భారత్‌లో కరోనా పరాకాష్టకు చేరవచ్చుననే అంచనాలు గుర్తుకొస్తున్నాయి. కరోనాతో విలవిల్లాడుతున్న దేశాలతో పాటుగా మనదేశంలోనూ కేసులు సమాంతరంగా నమోదవుతున్న తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం విలేకరుల సమావేశాన్ని ఉన్నపళంగా నిలిపేసింది. కేసులు ఉధృతి పెరుగుతుండటంపై కేంద్రం నుంచి ఇప్పటికీ ఎటువంటి వివరణ లేదు. కానీ, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులకు అనుగుణంగా కరోనా ఉధృతి పెరుగుతుండటం గమనార్హం. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు మినహాయింపులను పెంచుతుండటంతో ప్రజలు బహిరంగంగా గుమిగూడే ప్రమాదం పెరుగుతున్నది. అలాగే, కరోనా వ్యాప్తి కూడా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. దీంతోపాటు మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. మనదేశంలో ఈ నెలలోనే కరోనా టెస్టుల సంఖ్య కూడా పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీతో పోలిస్తే ప్రస్తుతం ఎన్నో రెట్లు పెరిగింది. ఏప్రిల్ 1న 5,600 కరోనా పరీక్షలు జరపగా, గత కొన్నిరోజులుగా టెస్టుల సంఖ్య లక్షకు అటుఇటుగా జరుగుతున్నాయి. పెరుగుతున్న టెస్టులకూ సమాంతరంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశమున్న సంగతి తెలిసిందే. కట్టడి చర్యలు కట్టుదిట్టం చేయకుంటే భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed