తెరుచుకున్న కేదార్‌నాథ్ గేట్లు.. చార్ ధామ్ యాత్ర ప్రారంభం

by Disha Web Desk 17 |
తెరుచుకున్న కేదార్‌నాథ్ గేట్లు.. చార్ ధామ్ యాత్ర ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎట్టకేలకు భక్తుల నిరీక్షణ ఫలించింది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం అంతా కూడా 'జై కేదార్‌' నినాదాలతో మారుమోగింది. అక్షయ తృతీయ సందర్భంగా కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్న సమయంలో హెలికాప్టర్‌పై నుంచి పూల వర్షం కురిపించారు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వేలాది మంది భక్తులతో పాటు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఆయన సతీమణి కూడా దర్శనానికి వచ్చారు.

కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర మొదలైంది. ఆరు నెలల పాటు మూసి ఉన్న ఆలయం శుక్రవారం తెరుచుకుంటుండటంతో దాదాపు 16 వేల మంది వరకు భక్తులు మొదటి రోజు కేదారీశ్వరుని దర్శనానికి వచ్చారు. గత ఏడాది భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు ఈ సారి కూడా ఎక్కువ సంఖ్యలో దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. కేదార్‌నాథ్ ధామ్‌కు 16 కిలోమీటర్ల ముందే గౌరీకుండకు సుమారు 10 వేల మంది భక్తులు చేరుకున్నారు. గతేడాది ఈ సంఖ్య 7 నుంచి 8 వేల మధ్య ఉంది. చార్ ధామ్ యాత్రకు గతేడాది రికార్డు స్థాయిలో 55 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఈ సారి యాత్ర ప్రారంభం నాటికే 22.15 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాను రాను ఈ సంఖ్య మరింత పెరగనుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం గంగోత్రి తలుపులు ఉదయం 10.29 గంటలకు, యమునోత్రి తలుపులు మధ్యాహ్నం 12.25 గంటలకు భక్తులకు దర్శనం కోసం తెరుస్తారు. మే 12 ఉదయం 6 గంటల నుండి బద్రీనాథ్ తలుపులు తెరుస్తారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed