ఆర్‌బీఎల్ బ్యాంకు పరిస్థితేంటి!?

by  |
RBL
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియలో కేంద్రం తలమునకలవుతుంటే, మరోవైపు ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంకు భవిష్యత్తుపై డిపాజిటర్లలో ఆందోళన పెరుగుతోంది. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్(ఆర్‌బీఎల్) సీఈఓ విశ్వవీర్ అహుజా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీనికి బ్యాంకు డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదించింది. అనంతరం ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా రాజీవ్ అహుజాను మధ్యంతర ఎండీ, సీఈఓగా నియమించారు. ఆ తర్వాత ఆర్‌బీఐ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్న జనరల్ మేనేజర్ యోగేస్ దయాల్ ఆర్‌బీఎల్ అదనపు డైరెక్టర్‌గా రిజర్వ్ బ్యాంక్ నియమించింది.

ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఎల్ బ్యాంకులో పరిస్థితులపై డిపాజిటర్లలో ఆందోళన మొదలైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్‌బీఎల్ బ్యాంకు రుణాలు పెరుగుతున్నాయి. 2017లో సుమారు రూ.39 వేల కోట్ల నుంచి 2020-21 నాటికి రూ. 58,623 కోట్లకు పెరిగాయి. నికర లాభాలు సైతం 2018-19లో రూ.867 కోట్ల నుంచి 2020-21లో రూ.508 కోట్లకు క్షీణించాయి. బ్యాంకు పనితీరు కొంతకాలంగా ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించడం లేదు. ఈ నేపథ్యంలోనే అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆర్‌బీఎల్‌ను ప్రభుత్వం రంగ బ్యాంకులో విలీనం చేయాలని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా సమయంలోనే ఆర్‌బీఎల్ మైక్రో ఫైనాన్స్, రిటైల్ లోన్స్, క్రెడిట్ కార్డుల విభాగంలో నష్టపోయింది.

ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేయడం మంచిదని వెంకటాచలం అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిస్థితులపై స్పందించిన ఆర్‌బీఎల్ బ్యాంకు.. బ్యాంకు పరిస్థితి మెరుగ్గా ఉందని ఆదివారం ప్రకటనలో తెలిపింది. బ్యాంకు ఆదాయం, వ్యాపార వ్యూహం గురించి ఇదివరకే పెట్టుబడిదారులతో చర్చించామని పేర్కొంది. కొవిడ్-19 వల్ల సమస్యలు ఉన్నాయని, త్వరలో సవాళ్లు పరిష్కారమవుతాయని వెల్లడించింది.


Next Story

Most Viewed