సుదిర్‌మన్ కప్ నుంచి ఇండియా ఔట్

by  |
Badminton
X

దిశ, స్పోర్ట్స్: సుదిర్‌మన్ కప్ నుంచి భారత బ్యాడ్మింటన్ బృందం నిష్క్రమించింది. సోమవారం చైనాతో జరిగిన పోరులో భారత జట్టు 0-5 తేడాతో ఓడిపోవడంతో ఈ టోర్నీ నుంచి వెళ్లిపోవడం ఖాయమైంది. బుధవారం భారత జట్టు ఫిన్లాండ్‌తో తలపడాల్సి ఉన్నది. కానీ అది నామమాత్రపు పోరుగానే మిగిలిపోతుంది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌తో పాటు డబుల్స్ జోడి చిరాగ్ షెట్టి – సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. అనుభవం లేని యువ జట్టును బాయ్ సుదిర్‌మన్ కప్ కోసం చైనాకు పంపింది.

ఈ జట్టులో బి. సాయి ప్రణీత్ మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం కలిగిన బ్యాడ్మింటన్ ప్లేయర్. కానీ అతడు చైనాకు చెందిన షి యూకీపై పురుషుల సింగిల్స్‌లో 10-21, 10-21 తేడాతో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో అదితి భట్ 9-21, 8-21 తేడాతో చెన్ యూ ఫీపై ఓడిపోయింది. ఇక పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధృవ్ జోడీ 20-22, 17-21 తేడాతో చైనా డబుల్స్ జోడీపై ఓడిపోయారు. మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా ఓడిపోవడంతో భారత జట్టు 0-5తో టోర్నీ నుంచి నిష్క్రమించింది.


Next Story