2021 ప్రథమార్థంలో ఐటీ సేవల 7.3 శాతం వృద్ధి

by  |
2021 ప్రథమార్థంలో ఐటీ సేవల 7.3 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ విభాగంలో పెట్టుబడులు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ సేవల మార్కెట్ మంచి వృద్ధి సాధించింది. ఈ మేరకు విషయాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) తన సెమీ-వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గతేడాదితో పొలిస్తే ఐటీ సేవల మార్కెట్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 7.3 శాతం వృద్ధి సాధించింది. 2020 ప్రథమార్థంలో 5.7 శాతం నమోదైనట్టు తెలిపింది.

మొత్తంగా భారత ఐటీ, ఐటీ వ్యాపార సేవల మార్కెట్ విలువ ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య 6.4 శాతం వృద్ధితో 6.96 బిలియన్ డాలర్లు(రూ.51.7 వేల కోట్లు)గా ఉందని, గతేడాది ఇదే కాలంలో 5.1 శాతం వృద్ధి నమోదైందని ప్రముఖ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) తన సెమీ-వార్షిక నివేదికలో పేర్కొంది. ‘2020లో ప్రభుత్వం, తయారీ పరిశ్రమలు ఐటీ పెట్టుబడులను తగ్గించినప్పటికీ ఈ ఏడాది ప్రథమార్థంలో ఐటీ వ్యయాలను గణనీయంగా పెంచాయి.

దేశవ్యాప్తంగా సంస్థలు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, అనలిటిక్స్ లాంటి పరిష్కారాలపై ఆధార పడటం పెరిగిందని’ ఐడీసీ ఇండియా, ఐటీ సర్వీసెస్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ హరీష్ కృష్ణ కుమారు తెలిపారు. అలాగే ఐటీ, ఐటీ వ్యాపార సేవల మార్కెట్ 2025 చివరి నాటికి 19.93 బిలియన్ల(రూ.1.48 లక్షల కోట్ల)కు చేరుతుందని ఐడీసీ నివేదిక అంచనా వేసింది. 2020-2025 మధ్య ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది.


Next Story

Most Viewed