భారత్ – చైనా బార్డర్‌లో ఉద్రిక్తతలు

by  |

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు ఎల్ఏసీ గుండా పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తూర్పు లడాఖ్‌ సమీపంలో పొరుగుదేశ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. లడాఖ్ సమీపంగా చైనా భూభాగంలో ఆ దేశం తాత్కాలికంగా కొన్ని నిర్మాణాలు చేపడుతున్నదని, తర్వాత మనదేశానికి చెందిన కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నదని ఆరోపించాయి. అయితే, మనదేశ సైన్యం ఈ దుందుడుకు చర్యలను దీటుగా తిప్పికొట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇరువైపులా సైనికులు ట్రూపులుగా వచ్చి చేరారని, ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తతలున్నట్టు వివరించాయి. ఇరుదేశాల మధ్య ఒప్పందం మేరకు ఇప్పటివరకూ ఒక్క ఫైరింగ్ కూడా జరగలేదని తెలిపాయి. అయితే, గతంలో నేరుగా ఎదురుబడి కొట్టుకునేవారని, ఈ సారి కట్టెలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసుకున్నట్టు తెలిసింది. సరిహద్దులో నెలకొన్న ఈ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇరుదేశాల సీనియర్ మిలిటరీ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితులపై అధికారికంగా ఒక్క ప్రకటనా వెలువడలేదు. ఈ సమస్యను గుట్టుగానే పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్టు కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story