ఆసియాలో ‘క్యాష్‌లెస్ పేమెంట్స్’ హవా

by  |
ఆసియాలో ‘క్యాష్‌లెస్ పేమెంట్స్’ హవా
X

దిశ, వెబ్‌డెస్క్ :
2016లో నోట్ల రద్దు విధించిన తర్వాత ప్రజలంతా ‘క్యాష్‌లెస్’ ఆధారిత సర్వీస్‌ల వైపు దృష్టి సారించారు. అప్పటి నుంచి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతోమంది క్యాష్‌లెస్ పేమెంట్స్‌కు అలవాటుపడ్డారు. కాగా ప్రస్తుతం కరోనా భయంతో మునుపటి కన్నా అధిక సంఖ్యలో ప్రజలు క్యాష్‌లెస్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు.

కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వార్తలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. చాలా మంది కరెన్సీ నోట్లను తాకడానికి భయపడ్డారు. రోడ్లపై కట్టలు కట్టలుగా డబ్బులు పడి ఉన్నా, ముట్టుకోకుండా పోలీసులకు ఇన్‌ఫార్మ్ చేశారంటేనే.. ప్రజలు ఎంతగా వణికిపోయారో అర్థమవుతుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. కరోనా కేసులు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్‌గా ఉండటం ఎంత ముఖ్యమో.. క్యాష్‌లెస్ పేమేంట్స్ కూడా అంతే ముఖ్యం. లాక్‌డౌన్ తర్వాత ఆర్టీసీ బస్సులు రవాణా ప్రారంభించడంతో అందులోనూ క్యాష్‌లెస్ పేమెంట్స్ సర్వీస్‌ను ప్రారంభించడం గమనార్హం. ఇక చిన్న చిన్న కిరాణా షాపులు, చాయ్ బండ్ల నుంచి సూపర్ మార్కెట్లు, మాల్స్ వరకు అన్నింటా క్యాష్‌లెస్ పేమెంట్స్ సర్వీస్ ఉండటంతో.. ప్రజలు కూడా నగదు రహిత సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఇక ఏటీఎమ్ సెంట‌ర్‌ లోపలకి వెళ్లాలంటే డోర్ హ్యాండిల్ తాకాలి. ఆ తర్వాత ఏటీఎమ్‌ నుంచి డబ్బులు డ్రా చేయాలన్నా, వేయాలన్నా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా.. పిన్ నంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదంత క్షేమం కాదని భావిస్తున్న ప్రజలు.. క్యాష్‌లెస్ పేమెంట్లకే ప్రాధాన్యతనిస్తున్నారు.

ఏటీఏస్..

ఎనీ టైమ్ మనీ(ఏటీఎం) సెంటర్లలోనైనా ఒక్కోసారి మనీ ఉండొచ్చు లేకపోవచ్చు.. కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఎనీ టైమ్ సెల్‌ఫోన్ అయితే ఉంటుంది. నెట్ ఉంటే చాలు ఈజీగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఈ క్రమంలోనే ‘కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్’ చేసే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అయితే.. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్ వంటి దేశాల్లో యాపిల్, గూగుల్‌కు సంబంధించిన పేమెంట్స్ యాప్ టాప్ ప్లేస్‌‌ను ఆక్రమించగా.. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో మాత్రం వాటి హవా అంతగా లేదు. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇతర పేమెంట్స్ యాప్స్ గట్టి పోటీనివ్వడంతో ‘జీ పే’ వెనకంజ వేసింది.

2019-2020..

నార్త్ అమెరికాలో గతేడాది మొబైల్ ద్వారా జరిగిన కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ 16శాతం ఉండగా, ఈ ఏడాది వాటిలో 0.5 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది. అదే లాటిన్ అమెరికాలో గతేడాది 31 శాతం ఉండగా, ఈ ఏడాది 34 శాతంగా నమోదైంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో 2019లో 44 శాతం ఉండగా, ఈ సారి రెండు శాతం వృద్ధితో 46 శాతంగా నమోదైంది. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ‘యాపిల్ పే, గూగుల్ పే’ తొలి స్థానంలో ఉండగా, ఇండియాలో ‘పేటీఎం’ టాప్ పొజిషన్‌ను ఆక్రమించింది. ఇక రెండో స్థానంలో ‘జీ పే’ ఉండగా, మూడో స్థానంలో ‘ఫోన్ పే’ నిలిచింది.



Next Story