కంచె చేను మేసింది.. ఎక్కడా ?

by  |
కంచె చేను మేసింది.. ఎక్కడా ?
X

దిశ, ఎల్బీనగర్: కంచె చేనును మేసింది. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులే బిల్డర్లతో కుమ్మక్కయ్యారు. ప్రభుత్వం నుంచి కొంత మేరకే అనుమతులు తీసుకుని యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బిల్డర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తూ రూల్స్ అతిక్రమిస్తున్నా చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. నోటీసులు జారీ చేస్తున్నా, ఏకంగా డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా నిర్మాణాలు ఆగకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై దిశ కథనం..

ఎల్బీనగర్ మున్సిపాలిటీ, హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని హయత్‌నగర్, మన్సురాబాద్, నాగోల్ డివిజన్‌లల్లో రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అలసత్వం వెరసి అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం నుంచి కొంత మేరకే అనుమతులు తీసుకున్నా దానికి విరుద్ధంగా నిర్మాణాలను సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. ఇదే విషయమై పలుమార్లు వార్త కథనాలు వెలువడడంతో ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు మొక్కుబడిగా అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సదరు సిబ్బంది కుమ్మక్కై నిర్మాణాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు.

నోటీసుల జారీలో అలసత్వం..

ఆయా డివిజన్లలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అన్నింటినీ గుర్తించాల్సిన మున్సిపల్ అధికారులు పట్టీపట్టన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. చాలా వరకు బిల్డింగ్‌లు రూల్స్ వ్యతిరేకంగా నిర్మాణాలు జరుగుతున్నావాటిని గుర్తించి అడ్డుకోవడం లేదు. బిల్డర్ల వెనక అధికారులు హస్తం ఉందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి నోటీసులు వచ్చినా అవేవీ పట్టించుకోకుండా యథేచ్చగా భవనాలు నిర్మించడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

టౌన్‌ప్లానింగ్ మామూళ్ల పర్వం..

ప్రభుత్వం నుంచి అనుమతిలేని, రూల్స్ పాటించని కొన్ని బిల్డింగ్‌లకు మున్సిపల్ అధికారుల నుంచి నోటీసులు ఇస్తుంటారు. ఇదే అదునుగా టౌన్‌ప్లానింగ్ అధికారులు చక్రం తిప్పుతుంటారు. సెల్లార్ నుంచి స్లాబుల వరకు కొంత మేర రేట్లు మాట్లాడుకుని వారికి అడ్డులేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ మాట వినని కొందరు బిల్డర్లతో కోర్టుకు వెళ్లండని, చివరికి తమ దగ్గరకే రావాలంటూ వారు బెదిరింపులకు పాల్పడుతూ ముడుపులు తీసుకుంటున్నారని సమాచారం. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం టౌన్ ప్లానింగ్ సిబ్బంది రూపంలో భారీగా గండిపడుతున్నది. లంచం ఇవ్వకపోవడంతో కొందరి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని సమాచారం.

సిబ్బందితో కుమ్మక్కు..

మున్సిపల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే అనుమతి తప్పనిసరి. అనుమతి తీసుకున్న పరిధిలోనే నిర్మాణాలు చేపట్టాలి. ఒకవేళ భవంతులకు సెల్లార్లు తవ్వాలంటే 850 గజాల విస్తీర్ణం తప్పనిసరి అనే రూల్ ఉంది. అవేమి పట్టించుకోకుండా 150 నుంచి మొదలుకుని 850 గజాలలోపు నిర్మాణాలు చేపడుతున్నారు. బిల్డర్లు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అక్రమంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌శాఖ మంత్రి, మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలను నిలిపేస్తాం: మారుతి దివాకర్, డిప్యూటీ కమిషనర్

హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి పనులను నిలిపివేస్తాం. టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం.



Next Story

Most Viewed