‘రివర్స్ ఆఫ్ ఇండియా’@ జీవనదులపై ఐఐటీ గళం

by Shyam |
‘రివర్స్ ఆఫ్ ఇండియా’@ జీవనదులపై ఐఐటీ గళం
X

దిశ, ఫీచర్స్ : నాగరికతకు పుట్టినిళ్లు నదులు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతితో పాటు మానవ వికాసం అంతా నదులు చుట్టే సాగింది. గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్రలు ఉత్తరభారతానికి సిరులుగా వర్ధిల్లుతుంటే.. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, తుంగభద్రలు దక్షిణ భారత ధాన్యరాశులుగా కీర్తిపొందాయి. అఖండ భారతావని జీవనాడులుగా విలసిల్లే ఈ జీవనదులు.. దేశ ఆహార, ఆర్థిక పరిపుష్టికి మూలనిధులుగా నిలిచాయి.

అయితే కోట్లాది మంది భారతీయులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి అందిస్తున్న ఆ జలరాశులను మనకు మనమే కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నాం. ఇప్పటికే వందల సంఖ్యలో నదులను నామరూపాల్లేకుండా చేసేశాం. మరెన్నో నదులను చెత్తకుప్పలుగా మలిచాం. ఇప్పుడు మిగిలున్న నదులను అయినా కాలగర్భంలో కలిసిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ క్రమంలో భారతావనిలో స్వేచ్ఛగా పరుగులుతీస్తున్న 51 నదుల పరిస్థితిని వివరిస్తూ.. ఐఐటీ మద్రాస్ ‘రివర్స్ ఆఫ్ ఇండియా’ పాటను విడుదల చేసింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్.. ‘రివర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో రిలీజ్ చేసిన మ్యూజిక్ వీడియోలో భారత్‌లోని విలువైన నీటి వనరుల ఆవశ్యకతను వివరించారు. ఐఐటీ మద్రాస్ మాజీ విద్యార్థి కన్నిక్స్ కన్నికేశ్వరన్ ఈ పాటకు సాహిత్యమందించగా, దేశంలో ప్రవహిస్తున్న 51 నదుల పేర్లతో ప్రేరణ పొంది ఈ గీతాన్ని రాసినట్టు ఆయన తెలిపాడు. బొంబాయి జయశ్రీ, కౌశికి చక్రవర్తి, రిషిత్ దేశికన్, అమిర్థ రామ్‌నాథ్ పాడిన ఈ వీడియోను మద్రాసులోని ఐఐటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లీన్ వాటర్ (ఐసీసీడబ్ల్యూ) ప్రొడ్యూస్ చేసింది.

భారతదేశంలోని నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని, నీటి వనరులు కాపాడుకోకపోతే భవిష్యత్తులో నీటి కోసం దేశాల మధ్య పోరాటాలు తప్పవని, జలం లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమనే వాస్తవాన్ని గ్రహించి జలానికి మూలమైన జీవనదులను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని ఈ పాట ద్వారా అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు.

Advertisement

Next Story