2021-22లో ఆర్థికవ్యవస్థ రెండంకెల వృద్ధి : ఇక్రా!

38

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 10.1 శాతంతో రెండంకెల వృద్ధిని సాధిస్తుందని ఇక్రా అభిప్రాయపడింది. అయితే, ఖచ్చితమైన అంచనాల ప్రకారం..దేశ జీడీపీ 2019-20 స్థాయిల కంటే స్వల్పంగా అధిగమిస్తుందని ఇక్రా తెలిపింది. ‘కొవిడ్-19 వ్యాక్సినేషన్‌తో పాటు ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటూ ఉండటంతో వృద్ధి సానుకూలంగా మారే అవకాశాలున్నాయని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ సోమవారం విడుదల నివేదికలో తెలిపారు.

అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ 7.8 శాతం ప్రతికూలత ఉండొచ్చని ఇక్రా అభిప్రాయపడింది. ఇదివరకు ప్రభుత్వం జీడీపీ 7.7 శాతం కుదించుకుపోతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, దిగుమతులు దేశీయ డిమాండ్‌లో ఊహించిన రికవరీకి అనుగుణంగా పుంజుకుంటాయనే అంచనాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ 2021-22లో 15-20 బిలియన్ డాలర్లు(జీడీపీలో 0.6 శాతం) లోటుగా నమోదవ్వొచ్చని అదితి నాయర్ పేర్కొన్నారు. అంతేకాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉంటుందని, ఆహార ద్రవ్యోల్బణం 6.4 శాతంగా ఇక్రా అంచనాలను వెల్లడించింది.