అదే నిజమైతే.. దేశంలోనే అరుదైన రికార్డు ‘హుజురాబాద్’ సొంతం

by  |
Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికలు మరో రికార్డును సొంతం చేసుకోబోతున్నాయి. బరిలో నిలిచేందుకు వివిధ వర్గాలు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఈ రికార్డు చోటు చేసుకునే అవకాశం ఉంది. తమ డిమాండ్లు సాధించుకునేందుకు ప్రభుత్వంపై తమ అస్త్రాన్ని ప్రయోగిస్తామని బాహాటంగా చెప్తున్న వీరంతా బై పోల్స్ బరిలో నిలిస్తే దేశంలోనే అతి ఎక్కువ మంది పోటీ చేసిన రికార్డునే కాదు.. ప్రతిపాదనలు చేసే వారితో కూడా రికార్డు బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటి అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని శాసిస్తామని ప్రకటిస్తున్నారు. ఇందులో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంపీటీసీలు, ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు, మిడ్ మానేరు బాధిత రైతులు, ఆర్య వైశ్యులు ఇప్పటికే హుజురాబాద్‌లో పోటీ చేస్తామని ప్రకటించారు.

వీరంతా కలిసి 2200లకు పైగా అభ్యర్థులను పోటీ చేయిస్తామని స్పష్టం చేశారు. వీరంతా ఇండిపెండెంట్ గానే పోటీ చేసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థికి 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారు అయినా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ పోటీలో నిలిచే అభ్యర్థులకు మాత్రం హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లే ప్రతిపాదకులుగా ఉండాలి. నామినేషన్ పత్రంలో స్పష్టంగా ప్రపోజల్ చేసే ఓటర్ల వివరాలను సమగ్రంగా పొందుపర్చాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రకటించిన ఆయా వర్గాల ద్వారా 2200 మంది అభ్యర్థులు పోటీ చేస్తే 22 వేల మంది ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది.

ప్రతిపాదకులు కూడా ఒక్క అభ్యర్థికి మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీంతో ఖచ్చితంగా ఒక్క అభ్యర్థికి 10 మంది ఓటర్లు కావాల్సిందే. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 22 వేల మంది ఓటర్లు ప్రతిపాదన చేస్తే అక్కడి ఓటర్లలో 10 శాతం మంది ప్రపోజల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అధికారులు అందించిన గణాంకాల ప్రకారం హుజురాబాద్ నియోజకవర్గంలో 2 లక్షల 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 22 వేల మంది ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆయా వర్గాలు ముందుగా ప్రకటించినట్టుగానే క్యాండెట్లను బరిలో నిలిపితే మాత్రం పది శాతం మంది ఓటర్లు ప్రతిపాదకులుగా మారడం కూడా రికార్డు కానుంది.

జంబో బ్యాలెట్..

2,200 మంది అభ్యర్థులు హుజురాబాద్ బరిలో నిలిస్తే జంబో బ్యాలెట్ ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నది వాస్తవం. ఇందు కోసం ఎన్నికల కమిషన్ బ్యాలెట్ విధానంతో ముందుకు సాగుతుందా..? లేక ఈవీఎంలనే వినియోగిస్తుందా అన్నది తేలాల్సి ఉంటుంది. 2019 లోకసభ ఎన్నికల సమయంలో 178 మందిపైగా పసుపు రైతులు బరిలో నిలిచినప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులందరితో కలిపి 194 మంది మంది పోటీ చేశారు. దీంతో అప్పుడు బ్యాలెట్ పేపర్ వాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించారంతా. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంల ద్వారానే ఓటింగ్ ప్రక్రియను కొనసాగించింది. దీంతో ఒక్కో బూతులో 13 వరకు ఈవీఎంలను కలిపి అభ్యర్థులను డిసేప్లే చేయించారు. హుజురాబాద్‌లో అయితే 2,200 మంది పోటీ చేస్తామని అంటుండటంతో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Next Story