హుజూరాబాద్‌లో చివరి అంకం.. క్లైమాక్స్ పరిస్థితేంటి?

by  |
Huzurabad by-election
X

– మరోకోణం: నోటుదే విజయం!

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రధాన పార్టీలు తమ యుద్ధ మోహరింపులను పూర్తి చేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరపున రంగంలో దిగగా, అధికార పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. మరో 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా.. అందరి దృష్టీ రెండు పార్టీల పైనే ఉంది. కాంగ్రెస్ బరిలో ఉన్నా గెలువడం కంటే ఎవరి ఓట్లను ఎక్కువ చీల్చుతుందనే వాదనకే పరిమితమైంది. సుదీర్ఘకాలం టీఆర్ఎస్‌లో కీలకస్థానంలో ఉండి భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన ఈటలకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. గెలిస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇక, ఉద్యమ కుడిభుజాన్ని అకారణంగా వెళ్లగొట్టారనే అపవాదును మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం ఈ పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ఓడిన పక్షంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ వచ్చిన నుంచీ రాష్ట్రాన్ని ఎదురే లేకుండా, ప్రతిపక్షమనే మాటే లేకుండా పాలిస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి ఇటు ఈటల, అటు రేవంత్‌రెడ్డి కొరకరాని కొయ్యలా తయారవుతారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం కష్టమవుతుంది. గెలిస్తే మాత్రం కేసీఆర్‌కు ఇక ప్రత్యామ్నాయం లేదనే వాతావరణం ఏర్పడుతుంది.

అందుకే ఈటల, కేసీఆర్.. ఇద్దరూ ఈ ఉపఎన్నిక పోరును తెలంగాణలో ఇదివరకు ఎప్పుడూ చూడని స్థాయికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన రోజు నుంచే ప్రచారపర్వం మొదలుపెట్టారు. పెద్దఎత్తున అంగ, అర్థబలాన్ని కేంద్రీకరించారు. పల్లె పల్లెనా, వాడవాడనా, ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నో రకాల ఎత్తులు, జిత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థులిద్దరూ గతంలో ఒకే పార్టీకి చెందినవారు కావడంతో స్థానిక నేతలకు, గల్లీ లీడర్లకు, కుల సంఘాల పెద్దమనుషులకు గిరాకీ బాగా పెరిగింది. వాళ్లు ఈటల వైపు ఉంటారా? లేక అధికార పార్టీకే మద్దతిస్తారా? అన్న విషయం కీలకంగా మారింది. వారిని లోబర్చుకోవడానికి ఇరుపక్షాలూ ప్రలోభాల ఆశలు చూపాయి. ఇన్నోవా కార్లు నజరానాగా ఒకరిస్తే.. డబ్బుల మూటలు మరొకరన్నట్లుగా పరిస్థితి తయారైంది. పదవులను ఒకరు ఎర వేస్తే భవిష్యత్తు ఆకాంక్షలకు మరొకరు హామీనిచ్చారు. రాజకీయాలు.. సిద్ధాంతాలు.. విలువలు.. పక్కకు పోయాయి. ఎవరి నుంచి ఎంత వస్తున్నది? ఎవరు ఏం కమిటయ్యారు? అన్న చర్చే నడిచింది. పొద్దున ఈటల క్యాంపులో ఉన్న మనిషి సాయంత్రం కల్లా టీఆర్ఎస్ సభలో కనిపించారు. రాత్రిపూట కమలం గుర్తుకు ఓటేయమని చెప్పిన ఆసామి తెల్లారేసరికి హరీశ్‌రావు సభలో పాల్గొన్నారు. ఈ రోజు కాషాయ కండువా కప్పుకుని తిరిగిన వాళ్లు మరునాడు గులాబీ కండువాకు ఫిరాయించారు. ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారో, ఎవరు ఎవరికి ఓటేయమంటున్నారో అర్థం కాని గందరగోళం ప్రజల్లో ఏర్పడింది.

ప్రజలను ప్రలోభ పెట్టడానికి కూడా పార్టీలు వెనుకాడడం లేదు. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ చాలా ముందుందని చెప్పవచ్చు. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఈటల రాజీనామా చేశారో లేదో ఈ పార్టీ పల్లెపల్లెనా సభలు నిర్వహించడం ప్రారంభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఈ సభలకు వెళ్లిన ప్రతి వ్యక్తికీ ఓ ఐదువందల నోటును ఇవ్వడం అప్పటి నుంచీ కొనసాగింది. నాకు తెలిసిన గ్రామాల వాళ్లు తమ ఊళ్లోనే కాకుండా పక్కూళ్లో జరిగిన మీటింగులకు కూడా హాజరై ఒకే రోజు రూ.1000-1500 సంపాదించుకున్న దాఖలాలున్నాయి. ఇక గ్రామస్థాయి కార్యకర్తలకు ప్రతిరోజూ, ఊరందరికీ అప్పుడప్పుడు మందు, విందూ సాధారణమైంది. ఇంటింటికీ గోడగడియారాలు, రైస్ కుక్కర్లు, మిక్సీలు, కుట్టు మిషన్ల వంటి బహుమతుల పంపిణీ కూడా దండిగానే జరిగిందని సమాచారం. ఇవన్నీ కాకుండా ప్రభుత్వం నడిపిస్తున్న పార్టీగా ఏ గ్రామంలో ఏ పని పెండింగ్‌లో ఉన్నా, పూర్తైన పనులకు బిల్లులు మంజూరు కాకున్నా వెంటనే జరిగిపోయాయి. ఊళ్లల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఊరిబయట తారు రోడ్లు తళతళా మెరిసిపోతున్నాయి. పింఛన్లు నెలనెలా ఠంఛన్‌గా పడిపోతున్నాయి. ఈసీ బ్రేకుల మూలంగా దళితబంధు ఆగిపోయినా, అప్పటికే లబ్ధిదారుల డబ్బులు కలెక్టర్ అకౌంట్లో పడిపోయాయి. కొందరు కార్ల ఓనర్లయ్యారు కూడా.

మరోవైపు, బీజేపీ క్యాంపు కూడా వెనుకపడలేదంటున్నారు. స్థానిక టీఆర్ఎస్ లీడర్లతో, కులసంఘాల నేతలతో రహస్యమంతనాలు జరిపి పెద్దమొత్తంలో నగదు, నజరానాలు ముట్టజెప్పారనే టాక్ వినవస్తోంది. పైకి టీఆర్ఎస్ కార్యకర్తల్లాగే ఉండాలని, లోపల మాత్రం తమకు ఓట్లు పడేలా ఆర్గనైజ్ చేయమనీ రిక్వెస్ట్ చేస్తున్నారని తెలిసింది. మొన్నటి దసరాకు ప్రతి పల్లెలోనూ మూడిళ్లకో మేకను, విచ్ఛలవిడిగా క్వార్టర్ సీసాలను సరఫరా చేశారంటున్నారు. ఇక సభలు, సమావేశాల కోసం జనాలను సమీకరించడానికి టీఆర్ఎస్‌లాగే తాము కూడా నోట్లు ఇవ్వాల్సివస్తోందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. గిఫ్టులు సైతం అందించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. కుట్టుమిషన్లే కాకుండా కమలం గుర్తున్న గడియారాలు, కీ చెయిన్లు పెద్దయెత్తున పంచారనే గుసగుసలు వినవస్తున్నాయి.

ఏ ఎన్నిక ముగింపులో అయినా క్లైమాక్స్ పోల్ మేనేజ్‌మెంట్. అప్పటిదాకా ప్రచారం చేసిన విషయాలను, ఇచ్చిన హామీలను ఓటర్లు నమ్మినా, నమ్మకపోయినా తుది నిమిషంలో వారి మైండ్‌ను ప్రభావితం చేసే ప్రక్రియే ఈ పోల్ మేనేజ్‌మెంటు. హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారనేది ఈ ప్రక్రియను ఎంత ప్రభావవంతంగా అమలుచేస్తారనే అంశంపైనే ఆధారపడివుంటుంది. ఇండియాలో పోల్ మేనేజ్‌మెంటుకు పెద్ద చరిత్రే ఉంది. పోలింగ్ బూత్‌కు వెళ్లే ఓటరుకు వాహనాలను, పోల్ చిట్టీలను సమకూర్చడం రూపంలో మొదలై ప్రస్తుతం ఓటు కోసం నోటు రూపంలో కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసినవాళ్లు పోలింగుకు ముందు కలర్ టీవీలు పంచిన ఘటనలున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటుకు వంద, రెండు వందలు ఇవ్వడం అనేది చాలా కామన్. అయితే, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి సంప్రదాయం 2010 తర్వాతనే ప్రారంభమైందని చెబుతారు.

2010లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉపఎన్నికలో, కడప ఎంపీ స్థానానికి 2011లో జరిగిన ఉపఎన్నికలో వందలాది కోట్లు ఖర్చు పెట్టారని మీడియా వార్తలు రాసింది. 2014, 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఇలా ఓటుకు నోట్లిచ్చారనే సమాచారం ఉంది. ఇదే హుజూరాబాద్‌లో 2018 ఎన్నికల్లో ఓటుకు ఒక పార్టీ రెండు వేలిస్తే, మరో పార్టీ పదిహేను వందలిచ్చిందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటుకు కనీసం ఐదు వేల రేటు పలుకుతోందని, పది వేలిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నా మిత్రుడు ఒకరు చెప్పారు. ఎలాగూ తమ పార్టీకే ఓటు వేస్తారనుకున్న చోట కొంత తక్కువ ఇస్తారని, పోటాపోటీ ఉన్నచోట ఎంత పెద్దమొత్తంలో అయినా ఇస్తారని ఆయన అన్నారు. ఊళ్లల్లో వీధివీధిన రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చగలిగితే బోలెడు సాక్ష్యాలు దొరకడం ఖాయమన్నారు. రెండు పార్టీల దగ్గరా డబ్బులు తీసుకున్నవాళ్లు చివరకు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే తన వద్ద సమాధానం లేదని దాటవేశారు.

ఒకటి మాత్రం చాలా స్పష్టం. హుజూరాబాద్ ఉపఎన్నికలో ముమ్మాటికీ నోటుదే విజయం. బరిలో ఉన్న ప్రధాన పార్టీలు రెండూ కూడా తమతమ స్థాయిలో నోట్లను, బహుమతులను, ఇతర ప్రలోభాలను ఆశ చూపినప్పుడు ఇక ఫలానా అభ్యర్థిదే గెలుపని చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. ఇరుపార్టీల వద్దా డబ్బులు తీసుకున్న ఓటరు ఈ నెల 30న పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు ఏం ఆలోచిస్తాడో.. ఎవరి వైపు మొగ్గు చూపుతాడో.. చివరకు ఏ అభ్యర్థి గుర్తుపై మీట నొక్కుతాడో ఆ అభ్యర్థే విజేతగా నిలువడం మాత్రం ఖాయం. – డి మార్కండేయ


Next Story

Most Viewed