ఈటల ఎంట్రీ.. బీజేపీకి చుక్కెదురు

by  |
etela resignation
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్ బీజేపీ ఎంట్రీపై అధిష్టానం స్పష్టత ఇచ్చేసింది. ఆయన రాకతో పార్టీ బలం పెరుగుతుందన్న అభిప్రాయానికి జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈటల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు రాజేందర్ గెలుపులో భాగస్వాములు కావల్సిందేనంటూ రాష్ట్ర నేతలు ప్రకటించారు. దీంతో తమ భవిష్యత్ ఏమిటి, క్షేత్ర స్థాయి కేడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వాలి అన్న విషయంపై క్లారిటీ ఇవ్వాలని హుజురాబాద్ బీజేపీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం కరీంనగర్‌లో రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్, ప్రేమేందర్ రెడ్డిలు హుజురాబాద్ బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా బీజీపీతో ఆనుభందం పెనవేసుకున్న స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్ ఏమిటీ అన్నదే అంతు చిక్కకుండా తయారైందని లోకల్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా తాము ఈటల రాజేందర్ గెలుపు కోసం పని చేస్తామన్నారు. అయితే ఈటల వెంట వచ్చే సెకండ్ కేడర్ సిట్టింగ్ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ బాధ్యతల అప్పగించే విషయంలో రాజేందర్ తన వెంట తీసుకొచ్చుకున్న వారికే ప్రయారిటీ ఇస్తారు. రెండో ప్రాధాన్యత కింద ఇంతకాలం పార్టీతో మమేకం అయిన తమ పేర్లను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ భవిష్యత్ అంధకారంలో నెట్టేయబడే ప్రమాదం ఉంటుందన్నదే తమ బాధ అని హుజురాబాద్ నాయకులు తమలోని ఆక్రోదనను వెళ్లగక్కినట్టు సమాచారం. దీనివల్ల పార్టీతో అటాచ్ మెంట్ పెట్టుకున్న సీనియర్లు కూడా అంతర్మథనంలో పడి పార్టీకి అందించే సేవల విషయంలో వెనక్కి తగ్గే ప్రమాదం కూడా ఉంటుదని లోకల్ లీడర్లు వివరించారు. గ్రౌండ్ లెవల్ లీడర్లలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హుజురాబాద్ నాయకులు వెలిబుచ్చిన అంశాలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ప్రేమేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ కేడర్ నిరుత్సాహానికి గురి కావద్దని పార్టీతో ఇంతకాలం పని చేసిన వారికి సముచిత స్థానం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.



Next Story