నీటిలోనే బస్తీ వాసుల జీవనం..

by  |
నీటిలోనే బస్తీ వాసుల జీవనం..
X

దిశ, తెలంగాణ బ్యూరో :

వరదలు తగ్గి నాలుగు రోజులైనా ఇప్పటికీ నగరంలోని అనేక కాలనీల్లో నీటిని తొలగించే పనులు మొదలే కాలేదు. దీనికి తోడు శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో మరికొన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. వరద నీటిలోనే మగ్గిపోతున్న బస్తీల్లోని ప్రజల అవస్థలు వర్ణనాతీతం. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లమీద మాన్‌హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల మూతలు కొట్టుకుపోయాయి. నీటితో నిండిపోయిన రోడ్డులో ఎక్కడ అడుగు వేస్తే ఏమవుతుందో తెలియని అయోమయం కొనసాగుతోంది. ప్రతిరోజూ మంత్రులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. వరుసగా మూడో రోజు కూడా మంత్రి కేటీఆర్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.

ఇంకెన్నాళ్లు మురుగుతో సావాసం?

కాలనీల్లో ఇండ్ల మధ్య నిలిచిపోయిన నీటిని తొలగించే పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదు. నాలుగు రోజులు దాటినా ఇంకా 136 ప్రాంతాల్లో నీరు నిలిచే ఉన్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో కాలనీల్లోని వరద నీటిని బయటకు పంపడంలో చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతకాలం డ్రైనేజీ, మాన్‌హోల్స్ పర్యవేక్షణ తదితరాలన్నీ జలమండలి పరిధిలో ఉండగా ఈ నెల మొదటి వారం నుంచి శివారు ప్రాంతాలతో సహా మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చాయి. నగర జనాభా పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు జలమండలి అధికారులు గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల కూడా ఈ అంశం చర్చకు రావడంతో మంత్రి కేటీఆర్ డ్రైనేజీ వ్యవస్థను కూడా జీహెచ్ఎంసీకి అప్పజెప్పారు.

శివారు ప్రాంతాల్లో ప్లాన్ లేని అభివృద్ధి..

హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వం పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న నగరం శివారు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలతో విస్తరిస్తూ ఉంది. అయితే ఈ అభివృద్ధికి అనుగుణంగా పక్కా ప్రణాళిక లేకపోవడంతో వరద నీరు, డ్రైనేజీ మార్గాలకు సరైన వ్యవస్థ రూపుదిద్దుకోలేకపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మంత్రి కేటీఆర్ ఇటీవల జీహెచ్ఎంసీ సమావేశంలో డ్రైనేజీ వ్యవస్థను జలమండలి పరిధి నుంచి జీహెచ్ఎంసీకి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో 66 శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ పైప్ లైన్ సుమారు 3,600 కి.మీ. మేర ఉందని, 3.26 లక్షల మాన్‌హోల్స్ ఇక్కడే ఉన్నాయని, అదనంగా సుమారు 700 మంది సిబ్బంది అవసరమవుతాయరని పేర్కొన్నారు. నెలకు అదనంగా జీహెచ్ఎంసీకి సుమారు రూ. 8.30 కోట్ల మేర ఖర్చవుతుందని తెలిపారు. సమీక్షా సమావేశాల్లో నిర్ణయాలు ఎలా ఉన్నా ఆచరణలో మాత్రం అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. నాలుగు రోజులుగా పేరుకుపోయిన వరద నీటిని బయటకు పంపే పనులు మొదలేకాలేదు. సుమారు 1800 మంది సిబ్బంది ఉన్నా ఇప్పటికీ కాలనీల్లోని నీటిని క్లియర్ చేయలేకపోయారు.

ఒక్క రోజులో 658 ఫిర్యాదులు..

వరద నీటిలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్న వారికి ఆహార పొట్లాలు, తాగునీటిని అందించే పనులు జరుగుతున్నాయి. కానీ అవి ప్రజల అవసరాలకు సరిపోయేంత స్థాయిలో లేవు. ఒక్క రోజులో 658 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని అపార్టుమెంట్లలో సంప్‌లో మంచినీటిని నిల్వ చేసుకోడానికి జలమండలికి ఫోన్ ద్వారా తెలియజేస్తే గంటల్లో రావాల్సిన టాంకర్లు మూడు రోజులైనా రావడంలేదు. ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించడమే తప్ప వాటికి పరిష్కారం లభించడం మాత్రం ఆశించినస్థాయిలో జరగడంలేదు.


Next Story

Most Viewed