కరోనా టైంలోనూ 24శాతం పెరిగిన అంబానీ ఆస్తులు..

by  |
కరోనా టైంలోనూ 24శాతం పెరిగిన అంబానీ ఆస్తులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితా ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2021’లో భారత దిగ్గజ ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ(ఆర్ఐఎల్) అధినేత ముఖేశ్ అంబానీ 8వ స్థానంలో నిలిచారు. గడిచిన ఏడాది కాలంలో ముఖేశ్ వార్షిక సంపద 24 శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 6.09 లక్షల కోట్లకు చేరుకుంది. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వివరాల ప్రకారం..గత సంవత్సర కాలంలో అమెరికాతో పోటీ పడి మరీ కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. అమెరికాలో కొత్త బిలియనీర్ల సంఖ్య 69 ఉండగా, భారత్‌లో 40 మంది కొత్తగా జాబితాలోకి వచ్చారు. మంగళవారం విడుదలైన ఈ జాబితాలో ముఖేశ్ తర్వాత రూ. 2.34 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ 48వ ర్యాంకును అందుకోగా, రూ. 1.94 లక్షల కోట్లతో శివ్ నాడార్, అతని కుటుంబం 58వ ర్యాంకును, రూ. 1.40 లక్షల కోట్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్ 104వ ర్యాంకు, రూ. 1.35 లక్షల కోట్లతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ సైరస్ పూనావాలా 113వ ర్యాంకులలో కొనసాగుతున్నారు. ఐటీ సేవల సంస్థ స్కెలర్ సీఈఓ జయ్ చౌదరీ ఈ జాబితాలో 185వ స్థానం, భారత్‌లో 9వ స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద 271 శాతం ఎగసి రూ. 95.3 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం.

ఎక్కువమంది ముంబైలోనే…

దేశంలో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారని, వీరిలో 177 మంది భారత్‌లోనే నివసిస్తున్నారని తెలిపింది. నగరాల వారీగా చూస్తే.. ముంబైలో అత్యధికంగా 60 మంది, న్యూఢిల్లీలో 40 మంది, బెంగళూరులో 22 మంది బిలియనీర్లు ఉన్నారు.

ప్రపంచ కుబేరులు వీరే..

అంతర్జాతీయంగా హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్…అత్యంత ధనవంతుడిగా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ అగ్రస్థానాన్ని సాధించారు. ఏడాది కాలంలో ఆయన సంపద ఏకంగా 328 శాతం ఎగసి 197 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవల ఏడాదిలో ఆయన సంపద 151 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే, రెండో స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 35 శాతం వార్షిక వృద్ధితో తన సంపదను 189 బిలియన్ డాలర్లకు పెంచుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ ఈల్‌వీఎంహెచ్ ఛైర్మ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 7 శాతం పెరిగి 114 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ సంపద 4 శాతం పెరిగి 110 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంపద 20 శాతం పెరిగి 101 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు బిలియనీర్ల సంపద గత ఏడాది కాలంలో 32 శాతం పెరిగి 14.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని హరున్ రిచ్ లిస్ట్ నివేదిక తెలిపింది.


Next Story

Most Viewed