ఫోన్ల‌లో ఆర్డ‌ర్లు.. గుట్టు చప్పుడు కాకుండా… ఎగుమతి!

by  |
ఫోన్ల‌లో ఆర్డ‌ర్లు.. గుట్టు చప్పుడు కాకుండా… ఎగుమతి!
X

దిశ‌, ఖ‌మ్మం: లాక్‌డౌన్ వేళ వేట‌గాళ్లు రెచ్చిపోతున్నారు. వ‌న్య‌ప్రాణుల‌ను వేటాడేందుకు అడ‌వుల‌పై ప‌డుతున్నారు. నిత్యం వంద‌లాది జంతువుల ప్రాణాల‌ను తీస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గ‌డిచిన నెల‌రోజుల్లో వేట‌గాళ్ల క‌ద‌లిక‌లు ఎక్కువ‌య్యాయ‌ని అట‌వీశాఖ అధికారులే చెబుతున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని స‌త్తుప‌ల్లి, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, చర్ల, పినపాక, గుండాల, మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, ఇల్లెందు, చండ్రుగొండ, అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, జూలూరుపాడు మండ‌లాల్లో దాదాపు నెల‌రోజుల కాలంలో దాదాపు 10 మందికి పైగా వేట‌గాళ్ల‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పం‌పడం గ‌మ‌నార్హం.

త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం..

అడవుల్లో దాహార్తిని తీర్చుకునేందుకు వ‌న్య‌ప్రాణులు వ‌చ్చివెళ్లే చోట్ల‌లో వేటగాళ్లు కాపుకాసి దాడి చేయ‌డం లేదా, ఉచ్చులు బిగించ‌డం చేస్తున్నారు. అంతేకాక కొంతమంది అయితే ఏకంగా వేట‌కుక్క‌ల‌ను అడవిలోకి తీసుకెళ్తుండ‌టం విశేషం. అడవి పందులు, దుప్పులు, జింక‌లు, కొండ‌గొర్రు, కుందేళ్లు, నెమ‌ళ్లు వంటివాటిని సంహ‌రించి మాంసాన్ని ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు గుట్టు చ‌ప్పుడు కాకుండా ఎగుమ‌తి చేస్తున్నారు. కొంత‌మంది వేట‌గాళ్లు ముందే ఫోన్ల‌లో ఆర్డ‌ర్లు తీసుకుని మ‌రీ వేట‌కు వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న స‌మ‌యంలో కూడా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం ప‌ట్ట‌ణాల‌తో పాటు ఇత‌ర మండ‌ల‌ కేంద్రాల‌కు కూడా వ‌న్య‌ప్రాణుల మాంసాన్ని త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే గ‌తంలో దుప్పి మాంసాన్ని రూ.800 నుంచి 900 ల‌కు విక్ర‌యించిన వేట‌గాళ్లు ఇప్పుడు దాదాపు రూ.1200ల‌కు పైగా అమ్ముతున్న‌ట్లు తెలుస్తోన్నది. అలాగే కొండ‌గొర్రు మాంసం కూడా దాదాపు ఇదే రేటుకు విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మాచారం.

గిరిజ‌నులే అధికం…

వ‌న్య‌ప్రాణుల‌ను వేటాడే వారిలో ఏజెన్సీ మండ‌లాల్లోని గిరిజ‌నులే ఎక్కువ‌గా ఉంటున్నారు. వ‌న్య‌ప్రాణుల‌ను వేటాడితే క‌ఠిన శిక్ష‌లుంటాయ‌ని అట‌వీ అధికారులు హెచ్చ‌రిస్తున్నా ఈ అక్ర‌మ వ్యాపారానికి అల‌వాటు ప‌డిన కొంత‌మంది వారి హెచ్చ‌రిక‌ల‌ను లెక్కచేయడంలేదు. వేట‌గాళ్ల‌లో గిరిజ‌నేతరులు కూడా ఉంటున్న‌ట్లు తెలుస్తోన్నది. ఇక ఈ మాంసం ప‌ట్ట‌ణాల‌కు చేర్చ‌డంలో వీళ్లే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు సమాచారం. ఇదిలా ఉండ‌గా దాహార్త‌ని తీర్చుకునేందుకు స‌రైన నీటి వ‌స‌తులు అట‌వీప్రాంతంలో లేక‌పోవ‌డంతో వ‌న్య‌ప్రాణులు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. ఇలా వ‌చ్చినవాటిని స్థానికులు నిర్బంధించి మాంసంగా మార్చేస్తున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు అట‌వీ ప్ర‌దేశాల నుంచి వ‌న్య‌ప్రాణులు జ‌నావాసాల్లోకి రాకుండా నీటి వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయాల‌ని వ‌న్య‌ప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. అదే స‌మ‌యంలో వ‌న్య‌ప్రాణుల ప్రాణాల‌ను తీస్తున్న వేట‌గాళ్ల‌ను ప‌ట్టుకుని జైలుకు పంపాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Tags: forest, animals, tribes, forest officials, high rates, hunters


Next Story

Most Viewed