తెరపైకి తుమ్మ‌ల, పొంగులేటి.. భారీగా చర్చ

by  |
తెరపైకి తుమ్మ‌ల, పొంగులేటి.. భారీగా చర్చ
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్ల‌తో పాటు మ‌రోక‌టి కూడా ఖాళీ అయింది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు అనేక మంది నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. సామాజిక వ‌ర్గాలు, జిల్లాల‌కు కేటాయించిన ప‌ద‌వ‌లు, సీనియారిటీ, ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న నాయ‌కులు ఇలా అనేక కోణాల్లోంచి ఎమ్మెల్సీ ప‌ద‌వీ క‌ట్ట‌బెట్టేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు టీఆర్‌ఎస్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఖ‌మ్మం జిల్లా నుంచి సీనియ‌ర్ నేత‌లుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు ఖ‌మ్మం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి బ‌దులుగా పార్టీలో చేరిన నామ‌నాగేశ్వ‌ర్‌రావుకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి రాజ‌కీయ భ‌విష్య‌త్ సందిగ్ధంలో ప‌డింది. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ టికెట్ ద‌క్కుతుంద‌ని ఆశించినా నిజం కాలేదు.

అయితే ఈ సారి కేసీఆర్ పొంగులేటికి ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పిస్తార‌నే న‌మ్మకాన్ని ఆయ‌న అభిమానులు, టీఆర్ ఎస్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇటీవ‌ల రాజ్య‌స‌భ టికెట్ విష‌యంలోనే ఆయ‌న పేరు దాదాపుగా ఖ‌రారు కాగా చివ‌రి నిముషంలో స‌మీక‌ర‌ణాలు మారిపోవ‌డంతో కేసీఆర్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ సురేశ్‌రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు. ఆ స‌మ‌యంలో పొంగులేటి అభిమానులు తీవ్రంగా నొచ్చుకున్నారు. ఒక ద‌శ‌లో ఆయ‌న పార్టీ మారుతార‌న్న ప్ర‌చారమూ జోరుగా జ‌రిగింది. అయితే త‌న‌కు న్యాయం చేస్తాన‌ని కేసీఆర్ మాటిచ్చార‌ని పొంగులేటి తన అనుచ‌రుల‌కు సూచించ‌డంతో వారు శాంతించారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కోటాలోని ఎమ్మెల్సీని పొంగులేటికే ఇవ్వాల‌ని ఆయ‌న అనుచ‌రులు కోరుతున్నారు.

జిల్లాకు చెందిన మ‌రో ముఖ్య‌నేత మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిట్టింగ్ స్థానం పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన కందాల ఉపేంద‌ర్‌రెడ్డి ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాల్లో టీఆర్ఎస్ గూటికే చేరారు. ఇప్పుడు తాజా, మాజీ ఎమ్మెల్యేలిద్ద‌రూ ఒకే పార్టీలో ఉండ‌టంతో త‌రుచూ వ‌ర్గ విబేధాలు తలెత్తుతున్న‌ట్లు సమాచారం. తుమ్మ‌ల వ‌ర్గాన్ని ఉపేంద‌ర్‌రెడ్డి ప‌క్క‌కు పెట్టేయ‌డంతో మాజీ మంత్రి అనుచ‌ర వ‌ర్గానికి కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్న‌ట్లు తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వంలో త‌న ప‌నితీరుతో ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన తుమ్మ‌ల అడ‌పాద‌డ‌పా నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నా.. ఎక్కువ‌గా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కేసీఆర్‌కు తుమ్మ‌ల‌ అత్యంత ఆప్తుడ‌ని ఖ‌మ్మం రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌మ్మ‌కం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా తుమ్మ‌ల‌ను ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేసే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ మొద‌ల‌వుతోంది. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ నుంచి తుమ్మలకు ఫోన్ రావడంతో ఆయన హుటాహుటినా హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మొత్తానికి ఖాళీ అయిన స్థానాలలో ఒకటి ఖ‌చ్చితంగా ఖ‌మ్మం నుంచి ఎంపిక ఉండ‌బోతోంద‌ని టీఆర్‌ఎస్ వ‌ర్గాలు బ‌లంగా నమ్ముతున్నాయి.


Next Story

Most Viewed