గ్రానైట్ వ్యాపారులకు బిగ్ షాక్ .. భారీ మూల్యం తప్పదా.?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-05 23:25:15  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : గ్రానైట్ పరిశ్రమలకు చుట్టుకున్న ఉచ్చును వారికి వారే బిగించుకున్నారా..? తప్పు చేశామని ఒప్పుకుంటూ ప్రభుత్వం ముందు తలొగ్గి ఇప్పుడు తమకే పాపం తెలియదనంటున్నారా.? అంటే అవుననే అంటున్నాయి ఈ పరిణామాలు. గ్రానైట్ యజమానులు తప్పు ఒప్పుకుని మరీ తప్పించుకోవడం వెనక ఆంతర్యం ఏమిటో.. అంతు చిక్కకుండా పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు తమ తప్పేమి లేదని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన [&hellip;]</p>

Mining
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గ్రానైట్ పరిశ్రమలకు చుట్టుకున్న ఉచ్చును వారికి వారే బిగించుకున్నారా..? తప్పు చేశామని ఒప్పుకుంటూ ప్రభుత్వం ముందు తలొగ్గి ఇప్పుడు తమకే పాపం తెలియదనంటున్నారా.? అంటే అవుననే అంటున్నాయి ఈ పరిణామాలు. గ్రానైట్ యజమానులు తప్పు ఒప్పుకుని మరీ తప్పించుకోవడం వెనక ఆంతర్యం ఏమిటో.. అంతు చిక్కకుండా పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు తమ తప్పేమి లేదని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ ఫీ విషయంలో తమకు ఏ పాపం తెలియదని అంటున్నారు.

కానీ, ఐదు రెట్ల పెనాల్టీతో సహా సీనరేజ్ ఫీజును వసూలు చేయాలని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆయా ఏజెన్సీలు పెనాల్టీతో సహా సీనరేజ్ ఫీ చెల్లించాలని అధికారులకు నోటీసులు జారీ చేశారు. భారీ మొత్తంలో ఉన్న ఈ పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో టీఎస్ఎంఎంసీ, 1966 రూల్ 35ఏ కింద తమపై విధించిన పెనాల్టీలో మినహాయింపు ఇవ్వాలని మాత్రమే కోరాయి. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం మెమో విడుదల చేసి సీనరేజ్ ఫీజుకు అదనంగా వన్ టైం పెనాల్టీ చెల్లించాలని నిర్దేశించింది.

అయితే, ఈ లెక్కన ఏడు గ్రానైట్ ఏజెన్సీలు రూ. 124,94,46,147 కోట్ల సీనరేజ్ ఫీజు చెల్లించకుండా బ్లాకులను తరలించుకుపోయినందును అదనంగా అంతే మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంది. గ్రానైట్ ఏజెన్సీలు తమ తప్పిదాన్ని ఒప్పుకున్నారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. విజిలిన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలు తప్పని మరోసారి విచారణ చేపట్టాలని దరఖాస్తు చేయకుండా పెనాల్టీలో మినహాయింపు కోరారంటే వారు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేనని తేలింది.

దీంతో వీరు ఇప్పుడు కోర్టును ఆశ్రయించినా కోర్టులో ప్రభుత్వం కూడా ఏజెన్సీలు పెట్టుకున్న రివిజన్ పిటిషన్‌ను ఆధారంగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వచ్ఛందంగా ఏజెన్సీలే ఒప్పుకున్న విషయాన్ని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లక తప్పదు. దీంతో ఆయా ఏజెన్సీలు పెనాల్టీతో సహా సీనరేజ్ ఫీజును చెల్లించక తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీంతో, ఇప్పుడు వారు ఒప్పుకున్నందుకు పెనాల్టీతో సహా సీనరేజ్ ఫీ చెల్లించాల్సిందేనని అంటున్నారు. అయితే, మైనింగ్ యాక్టు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుపై కూడా కోర్టును ఆశ్రయించేందుకు కొంతమంది సమాయాత్తం అవుతున్నారు.

తప్పెవరిది..?

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రకారం వన్ ప్లస్ వన్ పెనాల్టీతో డబ్బులు చెల్లించే విషయంలో సదరు ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు మైనింగ్ అధికారులు ఇచ్చిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రూ. 124,94,46,147 సీనరేజీ ఫీజుకు అంతే మొత్తంలో పెనాల్టీ వేసి వసూలు చేయాలని మెమోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఐదేళ్లయినా వీటిని వసూలు చేయకపోవడం వెనక ఆంతర్యం ఏంటో అధికారులకే తెలియాలి. ఇప్పటి వరకు సదరు ఏజెన్సీల ద్వారా రూ. 11,08,55,936 రూపాయలు మాత్రమే వసూలు అయ్యాయని కరీంనగర్ మైనింగ్ అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2, 2016న మెమో విడుదల చేస్తే.. మరో నెల గడిస్తే ఐదేళ్లు పూర్తవుతోంది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి పెనాల్టీ కన్నా సీనరేజ్ ఫీజును కూడా వసూలు చేయకపోవడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కడం లేదు.

ఉమ్మడి సర్కార్ నిర్లక్ష్యం..

2013లోనే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని వెంటనే చర్యలు చేపట్టకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 749 కోట్లకు సంబంధించిన విషయంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారన్నదే పజిల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తరువాత రెండేళ్ల వరకూ ఈ విషయాన్ని మరుగున పడేయడానికి కారణాలేంటో అంతు చిక్కడం లేదు. ఏజెన్సీలు రివిజన్ పిటిషన్ వేసిన తరువాత పెనాల్టీలో మినహాయింపు ఇచ్చిన తరువాత కూడా వసూలు కాకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారం వెనక బడా బాబులు చక్రం తిప్పడం వల్లే ఈ డబ్బు సర్కారు ఖజానాకు చేరలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫెమా వర్తించదా..?

మరో వైపున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇచ్చిన నోటీసుల్లో ఫెమా యాక్టు వర్తించదని గ్రానైట్ ఏజెన్సీలు వాదిస్తున్నాయి. ఫెమా లైసెన్స్ ఉన్న వారికే వర్తిస్తుందని ఈ నోటీసులతో తమకు ఏ మాత్రం సంబంధంలేదని అంటున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందన్న విషయాన్ని విస్మరించరాదని గుర్తు పెట్టుకోవాలి. ఈడీ చెన్నైకి చెందిన ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీస్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అడ్రస్ చేస్తూ నోటీసులు జారీ చేసింది.

ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 9 ఏజెన్సీల ద్వారా ఎగుమతి అయిన గ్రానైట్ బ్లాకుల వివరాలను, ఆయా ఏజెన్సీల అడ్రస్‌లు, కాంటాక్ట్ నెంబర్లు, ప్రొప్రైటర్ లేదా పార్టనర్స్ ఈ మెయిల్ ఐడీలు, అలాగే వాటికి సంబంధించిన ఇతరాత్ర సమాచారం, డాక్యుమెంట్లు అందించాలని ఈడీ ఆదేశించింది. సదరు షిప్పింగ్ ఏజెన్సీ ద్వారా సేకరించిన సమాచారం, మైనింగ్ డిపార్ట్‌మెంట్, పోర్టుల ద్వారా కూడా ఈడీ సమాచారం సేకరించే అవకాశం లేకపోలేదు. ఈడీ ఆయా వింగ్‌ల నుంచి తెప్పించుకున్న సమాచారంతో లెక్కలు సరి చూసి తప్పని తేలితే చెన్నై షిప్పింగ్ కంపెనీతో పాటు 9 ఏజెన్సీలపై కూడా చట్టాలను ఉపయోగించే అవకాశం లేకపోలేదు. ఈడీ ఇచ్చిన నోటీసులో కరీంనగర్ జిల్లాకు చెందిన 9 గ్రానైట్ ఏజెన్సీల వివరాలను మాత్రమే అడిగిన విషయం ప్రస్తావనార్హం.

సీఎస్ ఆదేశాలు..

గ్రానైట్ ఏజెన్సీలు సీనరేజ్ ఫీజుతో పాటు పెనాల్టీ రూపంలో చెల్లించాల్సిన రూ. 749 కోట్లపై చిలుకు డబ్బు విషయంలో విచారణ జరిపి, తీసుకున్న చర్యల వివరాలను తనకు పంపించాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన లేఖ మేరకు చర్యలు తీసుకోవాలని గత మే 21న సీఎస్ మైనింగ్ ఉన్నతాధికారులను ఆదేశించినా.. నేటికీ విచారణ కొలిక్కి రాకపోవడం విడ్డూరం. తెరిచిన పుస్తకంలా ఉన్న గ్రానైట్ ఏజెన్సీలకు సంబంధించిన ఈ వ్యవహారంపై రెండు నెలలు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఈడీ వేరు.. పెనాల్టీ వేరు..

ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం తప్పని తెలితే కేంద్ర చట్టాలకు పనిచెప్పే అవకాశం ఉంటుందన్నది వాస్తవం. ఇదే సమయంలో ఇప్పటికే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీనరేజ్ ఫీజు పెనాల్టీతో సహా చెల్లించాల్సిన విషయానికి సంబంధంలేదని స్పష్టం అవుతోంది. ఈడీ.. అంతర్జాతీయ మార్కెట్లోకి తరలి వెళ్లిన గ్రానైట్ బ్లాకుల వివరాలను సమగ్రంగా తీసుకున్న తరువాత చట్టపరమైన చర్యలకు పూనుకునే అవకాశం ఉండగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సీనరేజ్ ఫీజు ఎగవేత వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ వినిపించడం విశేషం.

Granite

Next Story