కదిలిస్తే కన్నీటి గాథే..!

by  |
కదిలిస్తే కన్నీటి గాథే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాజాగా కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో ఒక్కో ఇంట్లో ఎంత ఆస్తి నష్టం జరిగిందో అంచనాకు కూడా అందదు. ఒంటిమీద బట్టలతో మిగిలినపోయిన కుటుంబాలు ఇకపైన అన్నింటినీ సమకూర్చుకోడానికి పడే తిప్పలు వర్ణనాతీతం. పార్టీల నేతలు వస్తున్నారు.. పోతున్నారు.. అంతకు మించి వారికి ఒరిగిందేమీ లేదు. కోదండరామనగర్, అల్ జుబైదా కాలనీ, నదీమ్ కాలనీ, సరూర్ నగర్‌లోని కొన్ని నివాస ప్రాంతాల్లోని ఇళ్లు ఇప్పటికీ నీళ్లల్లోనే ఉన్నాయి. ఐదు రోజులైనా బురదనీరు బైటకు వెళ్లలేదు. వారు ఏం తింటున్నారో, ఎట్ల ఉంటున్నారో బాహ్య ప్రపంచానికి తెలియదు. ప్రభుత్వం వారి కోసం తీసుకుంటున్న చర్యలేవీ లేవని మండిపడుతున్నారు. ఓట్ల సమయంలో కనిపించే నేతలు ఇప్పుడెక్కడకు పోయారని ఆగ్రహంతో ఉన్నారు.

సర్టిఫికెట్ల సంగతేంటి?

వర్షాలు, వరదలతో కార్లు, జీపులు, బైక్‌లు కొట్టకు పోయిన దశ్యాలు ఎన్నో చూశాం.. కానీ ఆధార్ సహా ఓటరు ఐడీ, సర్టిఫికెట్లు.. గుర్తింపు పత్రాలు.. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు ఇలా ఎన్నో ముఖ్యమైన డాక్యుమెంట్లు బురదలో సమాధి అయ్యాయి. అయితే ఇప్పుడు ప్రతీ దానికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు తప్పనిసరి. వీటికోసమే ఇప్పుడు ప్రజలు తిప్పలు పడుతున్నారు. వరద నీరంతా పోయిన కొన్ని కాలనీల్లోని ప్రజలు బట్టలు, సామాన్లని ఎండబెట్టుకోవడం మొదలైంది. ఆ క్రమంలో సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు కనిపించడం లేదు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే డూప్లికేట్ తీసుకోవాల్సిందేననే సమాధానం వచ్చింది. అయితే అందుకు పోలీసు ఎఫ్ఐఆర్ కాపీ కావాల్సి ఉంటుందని షరతు విధించారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కోసమే ఇప్పుడు ప్రజలు పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డూప్లికేట్ కాపీలు ఎప్పుడొస్తాయో తెలియని గందరగోళం నెలకొంది.

మరికొన్ని రోజుల్లో విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు యథావిధిగా జరగనున్నాయి. కానీ ఆన్‌లైన్ తరగతులకు అవసరమైన కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు లాంటివన్నీ వరద పాలయ్యాయి. టీవీలు కాలిపోయాయి.. కరెంటు సంగతి చూద్దామంటే ఇన్ని రోజుల్లో నీళ్లలో ఉండిపోయిన విద్యుత్ వైర్లతో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందో తెలియదు. ఇక సర్టిఫికెట్ల సంగతి సరేసరి.. ఏ పని జరగాలన్ని ఆధార్, గుర్తింపు కార్డులు అవసరం. ఇంతకాలం అవన్నీ అందుబాటులోనే ఉన్నా ఇప్పుడు వరదల కారణంగా ఏవి ఎటు పోయాయో తెలియదు. డూప్లేకేట్ కాపీలు తీసుకోవాలనుకున్నా వాటి నెంబర్లు, వివరాలు తెలియక తికమకపడుతున్నారు. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియదు. డూప్లికేట్ కాపీలను ఎలా తీసుకోవాలో తెలియదు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ప్రభుత్వం సాయం చేస్తుందన్న నమ్మకం ప్రజలకు లేకపోయినప్పటికీ ఏ చిన్న సాయం చేసినా మళ్లీ ఆధార్, గుర్తింపు కార్డుల లాంటివి లేకుంటే దొరకవనే ఆందోళన వారిని వెంటాడుతోంది.



Next Story