ఇకనైనా పొదుపు చేద్దామా!

by  |
ఇకనైనా పొదుపు చేద్దామా!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందన్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వాలకే కాదు.. ప్రజలు కూడా కరోనా కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయింది. చిన్నా చితకా వ్యాపారుల నుంచి బడా బడా వ్యాపారుల వరకు తమ వ్యాపారాన్ని కొనసాగించలేక దుకాణాలు ఎత్తేశారు. మరికొంతమంది తమ వ్యాపారాలను కొనసాగించలేక సతమతమవుతున్నారు. లెక్కలేనన్ని ఉద్యోగాలు కోల్పోగా.. అనేక మంది సగం జీతాలకే పనిచేస్తున్నారు. ఇలా.. ఎవరి నోట విన్నా ‘మనీ’ వ్యథలే. ఈ నేపథ్యంలోనే జనాలు పొదుపుబాట పట్టారు. అయితే, ఇలాంటి సమయాల్లోనే కాదు.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ‘పొదుపు’ను అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం.

కూరగాయాలు కొనే దగ్గర కొసరి.. కొసరి బేరం ఆడతాం. దేవుని పటం ముందర కొట్టిన కొబ్బరిని చట్నీకి ఉపయోగించుకుంటాం. టూత్ పేస్ట్‌ ట్యూబ్‌ను నలగ్గొట్టి, కత్తిరించి.. ఏం మిగలకుండా వాడుతుంటాం. ఒకటి కొంటే మరోటి ఉచితమంటే.. క్యూలో గంటల తరబడి నిలబడి మరీ కొనుగోలు చేస్తాం. ఇలా ప్రతి నెలలో ఎంతో పొదుపు చేశామని అనుకుంటాం. కానీ, పొదుపంటే.. అది కాదు. నెల మొత్తంలో వచ్చిన డబ్బులో కనీసం పది శాతమైనా ఖర్చు పెట్టుకుండా ‘సేవింగ్’ చేయడం. ఇక్కడే ఓ చిన్న లాజిక్ కూడా ఉంది. ‘ఒక్క రూపాయి ఖర్చును ఆపితే.. రెండు రూపాయలు పొదుపు చేసినట్లే’ అని ఆర్థిక విశ్లేషకులు చెబుతుంటారు. ప్రముఖ బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్ మాటల్లో చెప్పాలంటే.. ‘ఈ రోజు అనసరమైన వస్తువులు కొనేందుకు డబ్బును వృథా చేస్తే.. రేపు అవసరమైన వాటిని కొనేందుకు డబ్బు ఉండదు’ అని. ప్రస్తుతం కొవిడ్ సంక్షోభంలో అనే కాదు.. జీవితంలో పొదుపు చాలా అవసరం.

భారతీయుల ఆశలు.. ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’ అన్నట్లు ఉంటాయి. పది వేలు సంపాదించే వ్యక్తి.. ఇరవై వేల లగ్జరీ లైఫ్‌లో బతుకుతుంటాడు. ఇలాంటి ఆశలే మన కొంపముంచుతాయి. ఆర్థిక కష్టాలకు ప్రధాన కారణం కూడా ఇదే. ఈఎమ్ఐలో కారు, ఇల్లు, బంగారు, ఫ్రిజ్, టీవీ.. ఇలా ఎన్నో కొంటుంటాం. వాటికి ఏళ్ల తరబడి వాయిదాలు కడుతూనే ఉంటాం. ఈ పద్ధతే అవసరాలకు, ఆర్థికానికి మధ్య లోటును ఏర్పరుస్తుంది. ఆదాయం లెక్కల్లో ఉంటే.. ఆశలు చుక్కల్లో ఉంటాయి. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకుంటే, పొదుపు అలవాటు చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఉదాహరణకు ఒక నెల రోజుల పాటు బయట టిఫిన్, భోజనం, టీ మానేసి.. ఇంటి ఫుడ్‌ను అలవాటు చేసుకోండి. ఆ నెల రోజులు వాటికయ్యే ఖర్చును లెక్కేయండి. మీకే తేడా తెలుస్తుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో.. అవసరాలు, అత్యవసరాలు, ఆనందాలు ఉంటాయి. చిన్నప్పుడే పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం.. కాస్త మొత్తంలో జమచేయడం అవసరాల లెక్కల్లోకి వస్తుంది. ఊహించని అనారోగ్యాలు, కొవిడ్ లాంటి సంక్షోభాలు, ప్రమాదాలు అత్యవసర విభాగంలోకి వస్తాయి. విహారయాత్రలు, ఆధ్యాత్మిక పర్యటనలు, ఇతరత్రా విషయాలు సంతోషంలో భాగమవుతాయి. ఇలా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ‘పొదుపు’ చేయడం ప్రారంభిస్తే.. జీవితంలో ఆర్థిక లోటు ఏర్పడదు. ఆర్థిక ప్రణాళిక ఉంటే.. ఆర్థికానికి లోటు కూడా ఉండదు.

అవసరం వేరు, ఆర్భాటం వేరు. హోటళ్లలో భోజనాలు, సినిమాలు, షికార్లు, పార్కులు.. ఈ ఖర్చులను మనం ఎప్పుడూ లెక్కలో వేసుకోం. ఎందుకంటే సంపాదించిన డబ్బును అనుభవించకపోతే ఎలా అన్నట్లు మాట్లాడుతుంటాం. నెలలో ఒక్కసారి ఇలా చేయడం సబబే. కానీ అదే లెక్కలేకుండా పోతేనే ప్రమాదం. వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోతాయి. ఇక ఆన్‌లైన్ ఆఫర్లు ఎప్పుడూ ఊరిస్తూ ఉంటాయి. వాటికి కూడా కాస్త ముక్కుతాడు వేస్తే మరింత పొదుపు చేయగలుగుతాం. ఏ పని చేసినా.. ఏ వస్తువు కొన్నా.. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి? అది లేకపోతే మనకేమైనా నష్టమా? అని అంతే! అది అవసరమైన ఖర్చో, అనవసరమైన ఖర్చో మనకే అర్థం అయిపోతుంది.

మనీయే జీవితం కాదు.. కానీ ప్రతి అవసరానికి, అత్యవసరానికి, ఆనందాలకు, పండగలకు, పార్టీలకు డబ్బు తప్పకుండా కావాలి. నిత్యం పెరిగే ధరలు, ఊడిపోయే ఉద్యోగాలు, అనుకోని అనారోగ్యాలు, ఊహించని పరిణామాలు.. ఇవన్నీ ఆర్థికంగా మనిషిని ఇబ్బందికి గురిచేసేవే. అందుకే ‘డబ్బు’ను ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టాలి. ప్రామిసింగ్‌గా సేవింగ్ చేయాలి. ‘పొదుపు భవిష్యత్తుకు భరోసా, పొదుపు.. జీవితానికి ఓ నిధి, పొదుపు రేపటి మన గెలుపు’. అందుకే పొదుపు చేయడం ఈ రోజు నుంచే అలవాటు చేసుకోవడం ఎంతో ఉత్తమం.


Next Story

Most Viewed