హరితహారం మొక్కల్లో బతికినవి ఎన్ని..? సర్కార్ సర్వే!

by  |
Harithaharam
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడమే ధ్యేయంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే నాటిన మొక్కల్లో ఎన్ని బతికున్నాయని గుర్తించేందుకు అటవీశాఖ సమయత్తామవుతోంది. రాండమ్ సర్వే చేసేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి నేతృత్వంలో కమిటీల ఏర్పాటు చేయాలని, ఒక అటవీ అధికారి, సంబంధిత శాఖ నుంచి ఒక అధికారి చొప్పున బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో గత రెండేళ్లలో తెలంగాణలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం గతేడాది వరకూ 206 కోట్ల మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే వాటిలో 2019, 2020 సంవత్సరానికి సంబంధించి నాటిన వాటిని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ బృందాలు సర్వే చేయనున్నారు. బ్లాక్ ప్లాంటేషన్, లీనియర్ ప్లాంటేషన్, స్కాటర్డ్ ప్లాంటేషన్ లపై ఈ అధ్యయనం జరగనుంది. ఈ నేపథ్యంలో 2019లో 42.905 కోట్ల మొక్కలు నాటగా.. 2020లో 19.107 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. అయితే 62.102 కోట్ల మొక్కలు రెండేళ్లలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటారు. వీటిలో అడవిలో నాటినవి 7.557 కోట్లు, అడవిలో రీజనరేషన్ 4.727 కోట్లు, అడవి బయట 46.0085 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 2.544 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో 3.189 కోట్లు నాటినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో ఎన్ని జీవించి ఉన్నాయో లెక్క తీయనున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 7 విడతల్లో హరితహారం నిర్వహించగా తొలిసారిగా గత రెండేళ్లు నాటిన వాటిపై శాస్త్రీయంగా సర్వే చేయనున్నారు. ఈ రాండమ్ సర్వే ద్వారా ఒక్కో ప్రాంతంలో గత రెండేళ్లలో ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బతికాయి, కనీస ఎత్తు, చనిపోతే మార్చిన మొక్కల శాతం పై ప్రధానంగా ఈ అధ్యయనం జరగనుంది. ఈ శాఖలు గతంలో మొక్కలు నాటుతూ ఆయా ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి, వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేశాయి. ఈ నివేదిక ఆధారంగానే ఈ సర్వే జరుగుతుందని శాంతి కుమారి తెలిపారు.

తెలంగాణకు హరితహారం ఫలితాలను సమీక్షించుకునేందుకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ అధ్యయనం ఉపయోగకరంగా ఉంటుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన సూచనల మేరకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సరైన ఫలితాలను నివేదిక రూపంలో అందించాలని సమావేశంలో పాల్గొన్న అధికారులను కోరారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్) ఆర్.ఎం. డోబ్రియల్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ స్పెషల్ కమిషనర్ ప్రసాద్, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed