బ్యాక్టీరియాతో గుండెకు మేలు..మీకు తెలుసా?

by Harish |

<p>దిశ, వెబ్ డెస్క్: యాంటీబయాటిక్‌..అంటే బ్యాక్టీరియాను చంపే మందులు! ప్రోబయాటిక్స్‌.. అంటే బ్యాక్టీరియాను పెంచేవి. మన శరీరానికి హాని చేసే సూక్ష్మజీవులు, మేలు చేసే సూక్ష్మజీవులు రెండూ మన దేహంలో ఉంటాయి. ప్రోబయోటిక్‌కు ఉదాహరణగా పెరుగు చెప్పుకోవచ్చు. ప్రోబయాటిక్స్ పేగుల్లోకి వెళ్లి లాక్టిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి, పీహెచ్‌ను తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. ఇదంతా బతికున్న బ్యాక్టీరియాతో కూడిన ప్రోబయాటిక్స్‌ చేసే పని. కానీ, డెడ్ బ్యాక్టీరియాతో కూడిన ప్రో బయాటిక్స్‌తో కూడా ఉపయోగం ఉందని ఓ [&hellip;]</p>

బ్యాక్టీరియాతో గుండెకు మేలు..మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: యాంటీబయాటిక్‌..అంటే బ్యాక్టీరియాను చంపే మందులు! ప్రోబయాటిక్స్‌.. అంటే బ్యాక్టీరియాను పెంచేవి. మన శరీరానికి హాని చేసే సూక్ష్మజీవులు, మేలు చేసే సూక్ష్మజీవులు రెండూ మన దేహంలో ఉంటాయి. ప్రోబయోటిక్‌కు ఉదాహరణగా పెరుగు చెప్పుకోవచ్చు. ప్రోబయాటిక్స్ పేగుల్లోకి వెళ్లి లాక్టిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి, పీహెచ్‌ను తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. ఇదంతా బతికున్న బ్యాక్టీరియాతో కూడిన ప్రోబయాటిక్స్‌ చేసే పని. కానీ, డెడ్ బ్యాక్టీరియాతో కూడిన ప్రో బయాటిక్స్‌తో కూడా ఉపయోగం ఉందని ఓ అధ్యయనంలో తేలిన విషయం తెలిసిందే. పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోబయాటిక్స్‌ కీలకమనే విషయం కూడా తెలుసు.
అయితే, పేగుల్లో ఉండే ఓ బ్యాక్టీరియా గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘యూబాక్టీరియం లిమోసమ్‌’ అని పిలిచే ఈ బ్యాక్టీరియా కార్యకలాపాల వల్ల ధమనుల పనితీరును దెబ్బతీసే రసాయనం ఉత్పత్తి తగ్గిపోతున్నట్లు కొలంబస్, ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు.

మనం తినే ఆహారంపైనే మైక్రోబయోమ్‌ వ్యవస్థ (జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు) ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తింటే మేలు చేసే సూక్ష్మజీవుల శాతం పెరిగి.. మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అదే సమయంలో పలు రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇక మన శరీరంలో ఉండే సూక్ష్మజీవుల్లో దాదాపు 80 శాతం ఉండేది మన జీర్ణ వ్యవస్థలోనే. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లను శరీరానికి అందేలా చేయడం, అమినోయాసిడ్లను తయారు చేయడం పేగుల్లోని సూక్ష్మజీవులు చేసే ప్రధానమైన పనులుగా చెప్పొచ్చు. చిన్నపేగులో జీర్ణం కాగా మిగిలిన ఆహారం నుంచి జీవక్రియలకు అవసరమైన రసాయనాలను కూడా సూక్ష్మజీవులే తయారు చేస్తాయి. పేగుల గోడలు బలంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని కాపాడేందుకూ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని అంచనా. ఈ క్రమంలోనే..
కొలంబస్, ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు మానవ ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలపై తాజాగా పరిశోధన చేశారు.

పేగుల్లో తయారయ్యే రసాయనం రక్తప్రవాహంలో కలిసిపోయి లివర్‌కు చేరుతుందని, అక్కడ్నుంచిమరింత హానికరంగా తయారవుతుందని సైంటిస్టులు చెప్పారు. అలాంటి రసాయనం ఉత్పత్తి కాకుండా ఈ గట్‌ బ్యాక్టీరియా(యూబాక్టీరియం లిమోసమ్‌) నిరోధించగలుగుతుందని తేల్చారు. డిమిథలైషన్‌ ప్రక్రియ ద్వారా ఇది ధమనుల్లో అడ్డుపడే గుణమున్న ట్రైమిథైల్ ఎమైన్‌(టీఎమ్ఏ) అనే రసాయన విషప్రభావాన్ని తగ్గిస్తున్నట్లు వారు గుర్తించారు. ఇలా గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

Next Story