- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధు టీమ్‌కు గిరిజనులు రూ.కోట్లు ఎలా ఇచ్చారు? బాధితుల్లో పోలీసులు, పొలిటికల్ లీడర్స్ సైతం!
మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్లు వసూలు చేసిన ప్రధాన నిందితుడు రమావత్ మధుని ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, అధిక వడ్డీకి ఆశపడి రమావత్ మధు టీమ్‌కు డబ్బులు చెల్లించిన గిరిజనుల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, నల్లగొండ బ్యూరో : ప్రముఖ సింగర్ మంగ్లీ చుట్టూ తిరుగుతున్న కోట్ల ఫ్రాడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్లు వసూలు చేసిన ప్రధాన నిందితుడు రమావత్ మధుని ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, అధిక వడ్డీకి ఆశపడి రమావత్ మధు టీమ్‌కు డబ్బులు చెల్లించిన గిరిజనుల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వారికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయనే అంశంపై చర్చ జరుగుతున్నది. అసలు విషయానికొస్తే.. గిరిజనులు తమ ఆస్తులను తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి కోట్ల రూపాయలు మోసగాళ్ల చేతుల్లో పెట్టారని తెలుస్తోంది. చివరకు వారికి అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు మిగిలాయి.
గిరిజన తండాలే..
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం పలుగు తండా చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల గిరిజనులకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి పుట్టంగండి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు క్రింది భాగంలో ఉన్న పడమటి తండా, పలుగు తండా, పుట్టంగండి, నక్కల పెంట, చింతల తండా, వద్దిపట్ల, గడ్డమీద తండా, నరలింగ తండా, పెద్ద గుమ్మడం, తిరుమలగిరి, వడ్డెర గూడెం ఈ గ్రామాల గిరిజన రైతులు పూర్తిగా ఆయకట్ట కింద సాగు చేసుకుంటున్నారు. ఖరీఫ్ రబీ సీజన్లో వరిని పండిస్తూ సాగు చేస్తూ ఉంటారు. దీంతో రైతుల చేతినిండా డబ్బులు ఉండేవి.. అధిక వడ్డీకి ఆశపడి మరిన్ని డబ్బులు వస్తాయనే ఆశతో డబ్బులు బయట నుంచి సైతం తెచ్చి ఇచ్చినట్లు తెలుస్తోంది.
వ్యవసాయ భూములు తాకట్టు..
అధిక వడ్డీ ఆశతో గిరిజన తండాల్లోని అమాయకులు తమ వ్యవసాయ భూములను ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును మైక్రో ఫైనాన్స్ నిర్వహిస్తున్న మధు టీం సభ్యులకు కోట్ల రూపాయలు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ఎకరం వ్యవసాయ భూమిని తాకట్టు పెడితే సుమారు రూ. రెండు లక్షలకు పైగా నగదును ప్రైవేట్ బ్యాంకులు రుణం కింద ఇస్తాయి. ప్రతి రైతు తమకున్న 20కి పైగా ఎకరాల వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి అధిక వడ్డీ కోసం మధు టీమ్‌కు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు తాము నివసిస్తున్న ఇండ్లను సైతం ఛోళ, మహేంద్ర ఫైనాన్స్, ఫైవ్ స్టార్, ఇతర ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ.20 నుంచి రూ.30 లక్షల మేర రుణాలు తీసుకుని మధు టీం సభ్యులకు ఇచ్చినట్లు సమాచారం. అంతేగాకుండా మహిళలు తమ ఒంటి మీదున్న బంగారు ఆభరణాలను సైతం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని, మరి కొంతమంది రైతులు వ్యవసాయ భూములను విక్రయించి సైతం అధిక వడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలు ఇచ్చారని సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సైతం..
ఉన్నఫలంగా పెద్ద ఎత్తున డబ్బు వస్తుందంటే ఎంతటి విద్యావంతులైన ఆశపడతారు. విద్యావంతులు,పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం అధిక వడ్డీకి ఆశపడి తమ డిపార్ట్మెంట్ లో లోన్లు తీసుకొని అక్రమార్కులకు కోట్ల రూపాయలు అప్పగించినట్లు తెలుస్తోంది. కొండమల్లేపల్లి, పీఏ పల్లి చుట్టుపక్కల ఉన్న గిరిజన ఉద్యోగులు మైక్రో ఫైనాన్స్ కోరల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లు కూడా కొంతమంది ఏజెంట్లను నియమించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు సేకరించినట్టు సమాచారం. వీళ్లతో పాటు వ్యాపారానికి కేంద్రమైన కొండమల్లేపల్లిలో చాలా మంది వ్యాపారులు మధు టీంకు కోట్ల రూపాయలు అందజేసి బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నట్లు తెలుస్తుంది. అక్రమార్కులకు కళ్లెం వేయాల్సిన పోలీసులు కూడా మధు టీం మైక్రో ఫైనాన్స్‌కు డబ్బులు ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. చివరకు దేవరకొండ నియోజకవర్గంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా మధు మాయ మాటల్లో పడి లక్షల రూపాయలు ముట్ట చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. బయటకు చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందోనని లోలోపల కుమిలిపోతూ రాజకీయ నాయకులు ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.






