‘చెత్త’ పేరుతో దోచేస్తున్నారు.. సిటిజన్స్‌పై ఏటా రూ.201కోట్ల భారం

by  |
‘చెత్త’ పేరుతో దోచేస్తున్నారు.. సిటిజన్స్‌పై ఏటా రూ.201కోట్ల భారం
X

దిశ, తెలంగాణ బ్యూరో :ఒక ఉద్యోగికి నెలకు ఒకసారే జీతం ఇస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నగరవాసులు ఒక పనికి రెండు సార్లు డబ్బులు చెల్లిస్తున్నారా..? ఇంటి నుంచి చెత్తను సేకరించినందుకు ప్రతినెలా రూ.80 -100 చెల్లిస్తున్నారా..? అయితే మీరు కూడా ఈ జాబితాలో ఉన్నట్టే..

చెత్త కలెక్షన్ చేసే వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నా మీరు సహకరిస్తున్నారంటే.. ఒక పనికి మీరు రెండు సార్లు చెల్లిస్తున్నట్టే.. మీ ఇంట్లో ఉత్పన్నమయ్యే చెత్తను కలెక్షన్ చేసి డంప్ యార్డులకు చేర్చే బాధ్యత ముమ్మాటికీ జీహెచ్ఎంసీదే. ఇందుకోసం ఆస్తిపన్నులో చెత్త ట్యాక్స్‌ను కలిపే వసూలు చేస్తున్నట్టు మున్సిపల్ చట్టం చెబుతోంది.

ఇంటింటి వచ్చి చెత్తను సేకరించేవారికి నెలకు ఇంతా అని ముట్టజెప్పడం సిటీ ప్రజలకు శరామాములే.. నిజానికి ఆ మొత్తం వారికి సానుభూతితో ఇచ్చేదే కానీ రూల్ ఏంకాదు. అయినా కొన్ని చోట్ల సిబ్బంది బెదిరించడం, బలవంతంగా చెప్పినంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం లేకపోతే చెత్తను ఇండ్లల్లో పారబోసి వెళ్తడం రెగ్యులర్‌గా జరిగే తంతే.. ఈ విషయంలో బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. కొన్ని చోట్ల ఈ చెల్లింపుల కోసం కమిషనర్ పేరుతో రసీదులు సృష్టించి మరీ వసూళ్లకు పాల్పడుతుండటం విశేషం.. వీటికి ఎలాంటి అధికారిక అనుమతులు ఉండవు. అయినా సిబ్బంది మాత్రం యథేచ్ఛగా తమ వంతుగా డబ్బులు దండుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో చెత్తను సేకరించే వారికి మద్దతుగా నిలిచేందుకు సిటీజన్స్ ఎంతో కొంత ఇవ్వాలంటూ ఒకప్పుడు జీహెచ్ఎంసీ చేసిన ప్రతిపాదన నేడు వందల కోట్ల టర్నోవర్ దాటిపోయింది. స్వచ్ఛ పనులు చేసే వ్యక్తులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన సిటీజన్స్‌ను నేడు అదే భయపెట్టే స్థాయికి ఎదిగింది. అడిగినంత ఇవ్వని వారి చెత్తను సేకరించకపోగా.. ఇష్టారీతిలో సిబ్బంది వస్తుండటంతో ఇండ్లల్లో చెత్త పేరుకుపోయి నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో 20 లక్షల కుటుంబాలు, ఒక లక్ష వరకూ చిన్న వ్యాపార సముదాయాల నుంచి ప్రతీ రోజూ 6500 నుంచి 7 వేల టన్నుల వరకూ చెత్త ఉత్పత్తవుతున్నట్టు అంచనా.. ఈ చెత్తను సేకరించి శాస్త్రీయ పద్దతుల్లో డిస్పోజల్ చేసే బాధ్యత అంతా జీహెచ్ఎంసీదే.. ఇందుకోసం ఆస్తి పన్నులోనే కలిపి వసూలు చేస్తున్నట్టు మున్సిపల్ చట్టం -1955 చెబుతోంది. ఈ చట్టంలోని సెక్షన్ 199 నుంచి 201 వరకూ ఈ విషయాన్ని వివరిస్తున్నాయి.

జ‌నరల్, వాట‌ర్, డ్రైనేజ్, లైటింగ్, కన్జర్వెన్సీ అనే ఐదు రకాలన్నీ కలిపి ఆస్తిపన్నులోనే వసూలు చేస్తాయి. కన్జర్వెన్సీ ట్యాక్స్‌లో చెత్త సేక‌ర‌ణ, ట్రాన్స్ పోర్టు, డంపింగ్‌తో పాటు శాస్త్రీయంగా శుద్ధిచేయడం కూడా ఇందులో ఇమిడి ఉన్నట్టు మున్సిపల్ యాక్ట్ -1955 సెక్షన్ 201 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టాన్ని ప‌ట్టించుకోకుండా బల్దియా మరోసారి చెత్త సేకరించేందుకు ప్రజల నుంచి డబ్బులను వసూలు చేస్తుండటం గమనార్హం. 21 లక్షల ఇండ్లు ఆస్తుల నుంచి చెత్తను సేకరిస్తున్నారనుకున్నా.. కనీసం రూ.80 చొప్పున నెలకు రూ.16 కోట్ల 80 లక్షలను సిటీ ప్రజలు చెత్త సేకరించేందుకు ఇస్తున్నారు. ఇది ఏడాదికి రూ.201.60 కోట్లు దాటుతోంది. ఇది ఈ ఏడాది వసూలైన మొత్తం ఆస్తిపన్ను రూ.1,701 కోట్లలో తొమ్మిదో వంతుకు సమానం. కొన్ని ప్రాంతాల్లో రూ.100, ఆపైనా కూడా వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇవ్వని ఇండ్ల నుంచి చెత్తను కూడా సేకరించడం లేదు. డబ్బులిచ్చినా ప్రతి రోజూ చెత్తను సేకరించడం లేదని ఎల్‌బీ నగర్ గృహిణి అరుణ తెలిపారు. వారంలో రెండు, మూడు సార్లకు మించి రావడం లేదని, దీంతో అంతకుముందున్న ఓపెన్ ఏరియా డస్ట్ బిన్ వద్దే చెత్తను పడేస్తున్నామని ఆమె వివరించారు.

వసూళ్లకు దర్జాగా రసీదులు..

ఇంటింటి నుంచి వసూలు చేసే డబ్బులకు ఎలాంటి అధికారిక అనుమతులు లేవు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఏమీ లేవు. పారిశుధ్య కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని సిటీ ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ కోరింది. అయితే అదిప్పుడు రూ.100 -200 వరకూ డిమాండ్ చేసి వసూలు చేసే స్థాయికి చేరుకుంది. రెగ్యులర్‌గా చెత్తను సేకరించకపోయినా డబ్బుల వసూళ్లలో రాజీ పడటం లేదు. మరో అడుగు ముందుకేసి కొన్ని సర్కిళ్లలో రసీదు కాపీలు కూడా ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ముద్రించిన ఈ కార్డుల్లో ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని వసూలు చేసిన మొత్తాలను రాసి సంతకాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ కార్డుల్లో ఎక్కడ కూడా సంబంధిత సర్కిల్ నెంబర్, అధికారుల వివరాలను కూడా రాయడం లేదు. ఇంటి యజమానుల పేర్లు కూడా రాయకుండానే ఈ వసూళ్లను చేస్తున్నారు. సిటీజన్స్‌ నుంచి ఈ విధమైన వసూళ్లకు ఉన్న చట్టబద్దత గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పందించలేదు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ బడావత్ సంతోష్ అందుబాటులోకి రాలేదు.


Next Story

Most Viewed