పని లేదు.. మనీ లేదు !

by Shyam |

<p>&#8211; ఆకలి బాధల్లో లక్షలాది కార్మికులు &#8211; ఇండ్లల్లో పనిచేసేవారిపై యజమానుల ఆంక్షలు దిశ, న్యూస్‌బ్యూరో: కాలం కలిసి రాలేదో.. కరువే కాటేసిందో.. ఉపాధి వెతుక్కుంటూ నగరాలకొచ్చి చేతికందిన పని చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్న శ్రమజీవులెందరో ! భర్త కూలి పనికి పోతే.. తాము కూడా నాలుగైదు ఇళ్లలో పాచి పనులు చేస్తూ.. చేదోడువాదోడుగా నిలుస్తోన్న మహిళలెందరో.. అరకొర వేతనాలతో ఉన్నంతలోనే సర్దుకొని బతికే ఆ కష్టజీవులపైనా కరోనా పిడుగు పడింది. ఇల్లిల్లు తిరిగి పని [&hellip;]</p>

పని లేదు.. మనీ లేదు !
X

– ఆకలి బాధల్లో లక్షలాది కార్మికులు
– ఇండ్లల్లో పనిచేసేవారిపై యజమానుల ఆంక్షలు

దిశ, న్యూస్‌బ్యూరో: కాలం కలిసి రాలేదో.. కరువే కాటేసిందో.. ఉపాధి వెతుక్కుంటూ నగరాలకొచ్చి చేతికందిన పని చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్న శ్రమజీవులెందరో ! భర్త కూలి పనికి పోతే.. తాము కూడా నాలుగైదు ఇళ్లలో పాచి పనులు చేస్తూ.. చేదోడువాదోడుగా నిలుస్తోన్న మహిళలెందరో.. అరకొర వేతనాలతో ఉన్నంతలోనే సర్దుకొని బతికే ఆ కష్టజీవులపైనా కరోనా పిడుగు పడింది. ఇల్లిల్లు తిరిగి పని చేస్తేగాని పూటగడవని కార్మికులకు ఉపాథి కరువైంది. ఈ ఆపత్కాల పరిస్థితుల నుంచి ప్రభుత్వం గట్టేక్కిస్తే తప్ప మనుగడ సాగించలేమని కార్మికులు వేడుకుంటున్నారు.

ఇల్లిల్లు తిరిగి పాచి పనులు చేస్తూ జీవనం సాగించే కార్మికులు రాష్ట్రంలో 6 లక్షల మంది ఉన్నారు. ‘కూలీ చేస్తేనే కూడు’ అనేంత పరిస్థితుల్లో వీరు బతుకుతున్నారు. తమ శక్తిని బట్టి రోజుకు 6 నుంచి 10 ఇండ్లల్లో పాచి పనులు చేస్తే వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ పనికీ వీరు దూరమయ్యారు. కరోనా భయంతో ఇంటి యాజమాన్యాలు పనులకు రానిచ్చే పరిస్థితి లేదు. దీంతో లాక్‌డౌన్ కొనసాగుతున్న 42 రోజులుగా ఈ కార్మికుల కుటుంబాలు దుర్భర జీవనాన్ని గడుపుతున్నాయి.

ఒకే ఇంటికి పరిమితం కావాలంటున్న యాజమాన్యాలు..

ఒక్కో ఇంట్లో గంట నుంచి రెండు గంటల పాటు పనిచేస్తే నెలకు వచ్చే డబ్బులు రూ. 800 మాత్రమే. దీంతో ఇల్లుగడిచే పరిస్థితి లేక మరో ఐదారు ఇండ్లల్లో పనిచేస్తూ.. నెలకు వచ్చే రూ.8 నుంచి రూ.10 వేల ఆదాయంతోనే కుటుంబాన్ని సాకుతున్నారు. అయితే, కరోనా భయంతో ఇంటి యజమానులు ‘మరొక ఇంట్లో పనిచేస్తే.. మా ఇంట్లో పనిచేయడానికి వీల్లేదని’ కార్మికుల ముఖం మీదనే చెప్పేస్తుండటంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఒక ఇంట్లో పనిచేస్తే వచ్చే రూ.800తో నెలంతా బతికేదెట్లా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో పనిచేసిన 20 రోజుల వేతనంతో అతికష్టమీద ఏప్రిల్ నెల సర్దుకున్నారు. కానీ మే నెలలో ఎట్లా బతకాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. వీరిలో చాలా మందికి తెల్లరేషన్ కార్డులున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సహకం అందక.. ఇటు పనులు దొరక్క చేతిలో చిల్లిగవ్వ లేక నానా అవస్థలు పడుతున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

లాక్‌డౌన్ ఎత్తివేసినా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేదాక పనులు దొరికే పరిస్థితి లేదని కార్మికులు వాపోతున్నారు. ఇండ్లల్లో పనిచేసేవారి కుటుంబాలకు ఆరు నెలల పాటు నెలకు రూ.3 వేలు ఆర్థిక సాయం, తెల్లరేషన్ కార్డులు లేని కార్మికులకు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం అందించాలని, ఈ కష్టకాలం నుంచి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఆకలితో చచ్చేలా ఉన్నాం..

‘‘నా రెక్కల కష్టంతోనే నా ఇద్దరి బిడ్డలను సాకుతున్న. రోజుకు పది ఇండ్లలో పనిచేస్తే వచ్చే రూ.8 వేలతోనే నెలంతా బతకాలి. కరోనా మొదలైన కొత్త నుంచే ఇండ్లలో పనిచేయించుకునే యజమానులు పక్క ఇంట్లో పనిచేస్తే మా ఇంటికి రావద్దని మొదటి నుంచే కట్టడి చేశారు. దీంతో మార్చి నెలలోనూ ఐదారు ఇండ్లలోనే పనిచేశా. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఆ ఐదారు ఇండ్లకు కూడా వెళ్లడం లేదు. చేతిలో రూపాయి లేదు. కరోనా రోగంతో చచ్చుడేమోగానీ.. ఆకలితో చచ్చేలా ఉన్నాం. సర్కారు మా మీద దయచూపి ఆదుకుంటే తప్ప బతకలేం’’

-ఇంటి పని కార్మికురాలు కె.రేణుక, కొండాపూర్

అప్పులు పెరుగుతున్నాయి..

‘‘నా భర్త నేను పనిచేస్తే వచ్చే ఆదాయ నెల రూ.15 వేలు. ఇంటి కిరాయి, పిల్లల ఫీజులు పోను మిగిలిన రూ.7-8 వేలతోనే కుటుంబాన్ని నెట్టుకురావాలి. మార్చి నెలలోనూ పనులు సరిగ్గా లేక.. వచ్చిన సగం జీతంతో చీటీ డబ్బులు కూడా చెల్లించ లేదు. ఒక్కొకటిగా అప్పులు పేరుకుపోతున్నాయి’’

– ఇంటి పని కార్మికురాలు అరుణ, యాదిద్రి భువనగిరి జిల్లా.

Tags: Corona, Lockdown, House maid, owner restrictions

Next Story