సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏ రాశి వారు చూడకూడదు? ఎవరు చూడొచ్చు?

by Jakkula.Mamatha |   (  Updated:2025-09-07 13:17:20  IST  )

రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. మీరు ఆకాశంలో ఆవిష్కృతమయ్యే అద్భుతాన్ని చూడలనుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.

సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏ రాశి వారు చూడకూడదు? ఎవరు చూడొచ్చు?
X

దిశ,వెబ్‌డెస్క్: మరికొన్ని గంటల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు(ఆదివారం) రాత్రి సమయంలో అత్యంత ప్రకాశవంతమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు వర్ణంలోకి మారనున్నాడు. పురాణాల ప్రకారం.. సూర్య, చంద్ర గ్రహాలు రాహువు, కేతువులు మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడుతాయని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఇవాళ రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై రేపు తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11:01 నుంచి అర్ధరాత్రి 12:23 వరకు 1 గంట 22 నిమిషాల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 2025లో ఏర్పడే చివరి చంద్రగ్రహణంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే.. ఈ గ్రహణం సమయంలో కొంత అనిశ్చితి పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. కొన్ని రాశుల పై ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం తీవ్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని పరిహారాలు తీసుకోవడం వల్ల గ్రహణ ప్రభావం నుంచి బయట పడొచ్చని అంటున్నారు.

ఎవరు చూడకూడదు?

ఈ రోజు రాత్రి చంద్రుడు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు. దీంతో అందరూ ఈ అద్భుతాన్ని చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ.. జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఈ సారి చంద్రగ్రహణం కుంభరాశిలో శతిభిషం మరియు పూర్వబాద్ర నక్షత్రాలలో సంభవిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడొద్దని పంచంగా నిపుణులు చెబుతున్నారు.. అలాగే, చంద్రగ్రహణం అశుభకరమైనదిగా భావించే రాశుల వారు దానిని చూడకూడదు లేదా చూడకుండా ఉండాలి. ఎవరైనా పొరపాటున చూసినా, గ్రహణం యొక్క దుష్ప్రభావాలు నివారించడానికి కొన్ని పరిహారాలు చేయాలని అంటున్నారు.

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావంతో.. మేషం, వృషభ రాశి, కన్య, ధనస్సు రాశుల వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మిథున, తులా, సింహం, మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు, కర్కాటక, వృశ్చిక, మీన రాశి, కుంభ అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ గ్రహణం సంభవించినప్పుడు కొంత గందరగోళాన్ని, అస్థిరతను కలిగిస్తుంది. ఇది అసంతృప్తి పరిస్థితిని సృష్టిస్తుంది. ఈ సమయంలో ఒక కంచు పాత్రలో బియ్యాన్ని ఉంచి, వెండి, బంగారం, ఇనుము లేదా రాగితో చేసిన పామును దానం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.

చంద్రగ్రహణం రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం..

*ఈ ఏడాది చంద్ర గ్రహణం రాత్రి పూట ఏర్పడుతుంది. ఆ సమయంలో ధ్యానం, జపం వంటివి ఆచరించడం చాలా ఉత్తమం.

*ఈ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి.

*ఆహారం తినడం, చంద్రుని కాంతికి ఎక్కువగా గురికావడం చేయవద్దంటున్నారు.

*ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

*గ్రహణం సమయంలో కీలక నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలు వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిదని పండితులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు.

Next Story