- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ugadi Special: ఈ ఏడాది ఏ రాశి వారికి అనుకూలంగా ఉండనుందో తెలుసా?
మార్చి 30వ తేదీ ఆదివారం ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది సూర్యుడు అధిపతిగా ఉండి పాలించబోతున్నాడు. మరి ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 30వ తేదీ ఆదివారం ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది సూర్యుడు అధిపతిగా ఉండి పాలించబోతున్నాడు. మరి ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి :
అశ్వని :1,2,3,4, పాదములు
భరణి : 1,2,3,4 పాదములు
కృత్తిక : 1 వ పాదము
ఆదాయం : 2, వ్యయం : 14
రాజపూజ్యం : 5, అవమానం : 7
మేష రాశి వారికి ఈ ఏడాది శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. ఈ ఏడాది చేయదలచిన ఏ పనికైనా ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఏదైనా పనిని ప్రారంభిస్తే అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా పూర్తి అవుతాయి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, బంధుమిత్రులతో విరోధం తలెత్తుతుంది. మనశ్శాంతి కోల్పోతారు. సినీ, టీవీ రంగాల వారి ధనాదాయం ఈ ఏడాది తగ్గుతుంది. రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. విద్యార్థులు ఏడాది ప్రారంభం నుంచి చదువు మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగి పని ఒత్తిడి పెరుగుతుంది. వారికి స్థిరత్వం ఉండదు. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పనికి తగిన గుర్తింపు ఉండదు. ప్రమోషన్లు నిలిచిపోతాయి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. చివరి నిమిషంలో నిరాశ ఎదురవుతుంది. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకంగా ఉంటుంది. రెండో పంటలో కష్టానికి తగిన ఫలితాలు కనిపించదు. గృహనిర్మాణాది కార్యక్రమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి అవివాహిత స్త్రీలకు వివాహ ఘడియలు మొదలు కానున్నాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. సంతాన సమస్యలు, కుటుంబ వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ దారులకు ఈ ఏడాది బిల్లులు రావడంలో కష్టం కలుగుతుంది. అనుకున్న దానికన్నా ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ ఏడాది తరచూ దేవాలయాలను సందర్శిస్తారు. శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం కలుగుతుంది. సంవత్సరాంతంలో కొంత పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది. ఏడాది చివరలో శుభకార్యాలు నేరవేరుతాయి. శుభవార్తలను వింటారు. పాత బకాయిలు వసూలవుతాయి. ధనాదాయం ఉంటుంది.
వృషభ రాశి :
కృత్తిక : 2, 3, 4 పాదములు
రోహిణి : 1, 2, 3, 4 పాదములు
మృగశిర : 1, 2, పాదములు
ఆదాయం : 11, వ్యయం : 5
రాజపూజ్యం : 1, అవమానం : 3
వృషభ రాశి వారికి ఈ ఏడాది మంచి ఫలితాలు కలగనున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు గడిస్తారు. ఈ రాశి వారి గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈ రాశివారికి ఈ ఏడాది ధనలాభం కలిగి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో పలుకుబడి, గౌరవం పెరుగుతుంది. పాత తగాదాలు ఏమైనా ఉన్నట్లైతే ఈ ఏడాది పరిష్కారం అవుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయాభివృద్ధి కలుగుతుంది. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు. స్థిరచరాస్తులు అభివృద్ధి చేసుకుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ ఏడాది ఈ రాశి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. అన్ని పరీక్షల్లో ముందంజలో ఉంటారు. ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశీయానం చేయాలనుకునే వారి కల సాకారం అవుతుంది. విద్యాభివృద్ది కలిగి మంచి గుర్తింపు పొందుతారు. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. కార్యాలయాల్లో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. అనుకున్న ప్రదేశానికి స్థానచలనం కలుగుతుంది. తాత్కాలిక ఉద్యోగులు పర్మినెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేనేత కార్మికులకు, చిన్న వ్యాపారాలు, చేసుకునే వారికి మంచి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారలు ప్రారంభించాలనుకునే వారికి లాభదాయక ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వ్యవసాయ దారులు పంటల్లో మంచి లాభాలను పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. పాత బకాయిలు తీర్చుకుంటారు. మంచి పంటలు పండి శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఈ రాశి అవివాహిత స్త్రీలకు ఈ ఏడాది వివాహం జరుగుతుంది. కోరుకున్న లక్షణాలు కలిగిన వరుడు దొరుకుతాడు. సంతాన సమస్యలు తొలగిపోతాయి. గృహావసర వస్తువులు సమకూర్చుకుంటారు. టీవీ, సినీ రంగాల వారు, క్రీడాకారులకు చెందిన వారు వారి రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం కలుగుతుంది. వారి ప్రతిభకు తగిన ఫలితం వస్తుంది. అవార్డులు, రివార్డులు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు పెద్ద కాంట్రాక్టులు వచ్చి బిల్లులు సకాలంలో విడుదలై లాభాల బాట పడతారు.
మిధున రాశి :
మృగశిర : 3, 4, పాదములు
ఆరుద్ర : 1,2,3,4 పాదములు
పునర్వసు : 1, 2, 3 పాదములు
ఆదాయం : 14, వ్యయం : 2
రాజపూజ్యం : 4, అవమానం : 3
ఈ రాశి వారికి ఈ ఏడాది శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కొన్ని ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలిసిరావు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. బంధుమిత్రుల వైషమ్యాలు ఏర్పడతాయి. అధికంగా ధన వ్యయం కలగటం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తిలో మార్పులు కలుగుతాయి. స్థాన చలనం, ప్రయాణ విఘ్నాలు కలుగుతాయి. పోలీసు కేసులు, కోర్టు కేసుల్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. శతృ వృద్ది కలుగును. శత్రుబాధలు, ఊహించని సంఘటనలు జరుగుతాయి. నమ్మిన వారి వలన మోసపోయే పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు కలిసి రావు. ప్రభుత్వ అధికారులతో కలహాలు కలుగుతాయి. విడిపోయిన బంధుమిత్రులు ఈ ఏడాది కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల వలన ధనవ్యయం కలుగుతుంది. ఏ పని చేసినా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. అతి కష్టం మీద చేపట్టిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల సస్పెన్షన్, అయిష్ట బదిలీలు అవుతాయి. తాత్కాలిక ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగి మనశ్శాంతి లోపిస్తుంది. పై అధికారుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా అనుకున్న ఫలితాలను సాధించలేకపోతారు. వ్యవసాయదారులు ఈ ఏడాది అనుకున్న దానికన్నా అధికంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అనవసర ధన వ్యయం కారణంగా బుణాలు తీసుకోవాల్సి వస్తుంది. కళాకారులు, సినీ, టీవీ రంగాల వారు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కానీ ఆ అవకాశాలను నిలబెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ధనార్జన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. క్రీడారంగంలో ఉన్న వారికి గత ఏడాది కన్నా ఈ ఏడాది విజయాలు సాధించడం కష్టంగా ఉంటుంది. రాజకీయరంగంలో ఉన్నవారి పట్ల ప్రజల్లో కాస్త వ్యతిరేకత మొదలవుతుంది. వ్యయప్రయాసలు ఎక్కువవుతాయి. ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల ఆదరాభిమానాలు తగ్గుతాయి. ఈ రాశి కాంట్రాక్టర్లు ప్రతి పనిలోనూ ఆటంకాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. పనులు సకాలంలో పూర్తయినా బిల్లులు సమయానికి అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి స్త్రీలు ఈ ఏడాది ఏ పనిలోనైనా ఆటంకాలు చవిచూస్తుంటారు. అవివాహిత స్త్రీలకు అనుకూలమైన సంబంధాలు వచ్చి తప్పిపోతాయి. ఉద్యోగ విషయంలోనూ, కుటుంబ విషయాల్లోనూ సమస్యలు ఏర్పడుతాయి.
కర్కాటక రాశి :
పునర్వసు : 4, పాదములు
పుష్యమి : 1,2,3,4 పాదములు
ఆశ్లేష : 1, 2, 3, 4 పాదములు
ఆదాయం : 8, వ్యయం : 2
రాజపూజ్యం : 7, అవమానం : 3
ఈ రాశివారికి ఈ ఏడాది శుభ ఫలితాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఖాళీ స్థలాలు, గృహ, స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయ, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. కొన్ని కోర్టు వ్యవహారాల వల్ల ప్రశాంతత తగ్గుతుంది. కొన్ని అకారణ కలహాలు జరుగుతాయి. ప్రయాణాలలో చోర భయం ఉంటుంది. చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. స్థానచలనం, అనుకూలమైన ప్రదేశాలకు ట్రాన్స్ ఫర్లు జరుగును. పై అధికారులు ఈ రాశి వారితో అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రమోషన్లను అందుకుంటారు. జీతభత్యాలు పెరుగుతాయి. ఈ రాశి విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తిని కనబరుస్తారు. పట్టుదల పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పై చదువులు చదివేందుకు అవకాశాలు మెండుగా లభిస్తాయి. పరీక్షల్లో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మంచి మార్కులతో ముందంజలో ఉంటారు. ఈ రాశి స్త్రీలకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగరీత్యా అనుకున్న ప్రదేశానికి స్థానచలనం కలుగుతుంది. అవివాహిత స్త్రీలకు అనుకూలమైన సంబంధం కుదురుతుంది. ఈ రాశి స్త్రీలు విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను అధికంగా గడిస్తారు. నూతన వ్యాపారాలు మంచి ఫలితాలను అందిస్తాయి. చిరు వ్యాపారులు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యవసాయ దారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పంటలు బాగా పండి అధిక లాభాన్ని అందుకుంటారు. టీవీ, సినీ, కళారంగాలలో ఉండే వారు సత్ఫలితాలను పొందుతారు. ఈ రంగాల్లో పనిచేసే వారు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవార్డులు రివార్డులు అందుకుంటారు. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తారు. అనుకున్న పనులలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి.
సింహ రాశి :
మఘ : 1, 2, 3 4, పాదములు
పుబ్బ : 1,2,3,4 పాదములు
ఉత్తర : 1 వ పాదము
ఆదాయం : 11, వ్యయం : 11
రాజపూజ్యం : 3, అవమానం : 6
ఈ రాశివారికి ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న కార్యాలు జయప్రదం అవుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెంది, ధనాదాయం బాగుంటుంది. అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణాధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సేవాభావంతో మెదులుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దైవ సంబంధమైన కార్యములను చేస్తారు. కొన్ని చెడు వార్తలను వింటారు. ధన విషయంలో చికాకులు కలుగుతాయి. కుటుంబంలోని పెద్ద వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏ పనులు మొదలు పెట్టిన లాభనష్టాలు సమానంగా ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పెండింగ్ లో ఉన్న కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. నమ్మిన వారి వలన మోసపోతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. భార్య పిల్లలతో అకారణ కలహాలు ఏర్పడుతాయి. ఈ రాశి వ్యవసాయదారులకు రెండో పంట లాభదాయకంగా ఉంటుంది. అధిక పెట్టుబడుల కారణంగా రుణబాధలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత ఒత్తిడి పెరుగుతుంది. అకస్మాత్తుగా స్థాన చలనం జరుగుతాయి. విద్యార్థులు విద్యలో ఆసక్తి కనబరచినా ఆటంకాలు ఏర్పడతాయి. పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఈ రాశి వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. అయినప్పటికీ కొంత భయాందోళనలో కాలం గడుపుతారు. వ్యాపారంలో ఖాతా బాకీలు వసూలు అవడంలో కొంత ఆలస్యం అవుతుంది. ఈ రాశి స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేసే ప్రయత్నాలలో సత్ఫలితాలు పొందుతారు. నిరుద్యోగ స్త్రీల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఈ రాశి కాంట్రాక్టర్లకు ఈ ఏడాది లాభసాటిగా ఉంటుంది. పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా సకాలంలో పూర్తవుతాయి. సినీ, టీవీ, కళారంగాల్లో ఉన్న వారికి ధన లాభం ఉంటుంది. క్రీడాకారులకు ఎంత నైపుణ్యం ఉన్నా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తారు. ఈ రాశి రాజకీయ నాయకులకు ధనలాభం కలుగుతుంది. చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో కాస్త ఆలస్యం అవుతుంది.
కన్యా రాశి :
ఉత్తర : 2, 3 4, పాదములు
హస్త : 1,2,3,4 పాదములు
చిత్త : 1, 2 పాదములు
ఆదాయం : 14, వ్యయం : 2,
రాజపూజ్యం : 6, అవమానం : 6,
ఈ రాశి వారికి ఈ ఏడాది భాగ్య దాయకంగా ఉంటుంది. అనుకున్నంతగా ధనాదాయం చేతికందుతుంది. భూములు, స్థలాలను కొనుగోలు చేస్తుంటారు. స్థిరాస్థులను అభివృద్ధి చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. ఈ రాశి వారు ఉదర సంబంధిత వ్యాధితో బాధ పడతారు. అన్య స్త్రీ పరిచయం సమస్యలు తెస్తుంది. కార్యాలయంలో పై అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో చికాకులు ఏర్పడతాయి. ఏ పని చేసినా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ప్రభుత్వ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. నమ్మిన వారి వలన మోసపోతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. భార్యాపిల్లలతో అకారణంగా కలహాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వస్తాయి. అవివాహిత స్త్రీలకు వివాహ యోగం ఉంది. వెండి, బంగారం కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ అధికంగా చేస్తారు. రాజకీయాలలో ఉన్నవారు ఉన్నత పదవులను చేపడతారు. జనాల ఆదరాభిమానాలను అందిపుచ్చుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరీక్షల్లో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తారు. పై చదువుల నిమిత్తం విదేశీయానం చేస్తారు. వ్యవసాయ దారులు పంటలలో మంచి లాభాలు గడిస్తారు. పాత బకాయిలు తీరుస్తారు. అధిక ధనాదాయం వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూల ప్రాంతాల్లో స్థానచలనం జరుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. మానసిక ఆందోళనకు గురవుతారు. క్రీడాకారులు విజయాలు సాధిస్తారు. సినీ, టీవీ, నటీనట వర్గాలలో ఉన్న వారు నూతన సంస్థలలో పని చేస్తారు. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తులా రాశి :
చిత్త : 3, 4, పాదములు
స్వాతి : 1,2,3,4 పాదములు
విశాఖ : 1, 2, 3 పాదములు
ఆదాయం : 11, వ్యయం : 5,
రాజపూజ్యం : 2, అవమానం : 2,
ఈ రాశివారు ఈ ఏడాది అన్ని రంగాల్లో రాణించగలరు. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలను రాణిస్తారు. షేర్లు, ఫైనాన్స్ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విహార యాత్రలు, దైవ దర్శనాలకు వెళతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నమ్మిన వారి కారణంగా మోసపోతారు. భార్యాభర్తల మధ్య ఎడబాటు, మనస్పర్థలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాలలో చికాకులు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపార వ్యవహారాలలో లాభాలను గడిస్తారు. స్థల మార్పులు, విదేశీ యానం చేస్తారు. ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. కొన్ని సమయాల్లో ఆదాయానికి మించిన ఖర్చులు అవుతాయి. నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులను ఉన్నత పదవులు వరిస్తాయి. ప్రయివేటు సంస్ధలలో పనిచేసేవారికి స్థిరత్వం ఏర్పడుతుంది. క్యాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాశి స్త్రీలు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. విదేశీ యానం, అప్రయత్న ధనలాభం, నూతన వస్తు వస్త్రాభరణాల ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అవివాహిత స్త్రీలకు వివాహం నిశ్చయమవుతుంది. రాజకీయాలలో ఉన్నవారు ఉన్నత పదవులను చేపడతారు. జనాల ఆదరాభిమానాలు అందిపుచ్చుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించి మంచి ర్యాంకులను తెచ్చుకుంటారు. పై చదువుల నిమిత్తం విదేశీయానం చేస్తారు. వ్యవసాయ దారులు రెండు పంటలను పండించి లబ్ది పొందుతారు. పాత బకాయిలు, ప్రభుత్వ రుణాలు తీరుస్తారు. చెరువులు, తోటలు, చేపల ఉత్పత్తి చేసే వారికి అధిక ధనాదాయం వస్తుంది. క్రీడాకారులు ఉన్నత శ్రేణి టీంలు అవార్డులను, బహుమతులను అందుకుంటారు. సినీ, టీవీ, కళారంగాలలో ఉన్న వారు రాణిస్తారు. సినీ నిర్మాతలకు ఊహించని రీతిలో ఆదాయం వస్తుంది. ఈ రాశి కాంట్రాక్టర్లకు ఈ ఏడాది అన్ని విధాలా కలిసి వస్తుంది. పెద్ద కాంట్రాక్టులు లభ్యమవుతాయి. ఎన్నడూ చూడని ఆదాయాన్ని చూస్తారు. రాజకీయ నాయకులు ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వారి పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుంది. ఉన్నత పదవులను అందుకుంటారు.
వృశ్చిక రాశి :
విశాఖ : 4 వ పాదం
అనురాధా : 1, 2, 3, 4 పాదములు
జ్యేష్ట : 1, 2, 3, 4 పాదములు
ఆదాయం : 2, వ్యయం : 14,
రాజపూజ్యం : 5, అవమానం : 2,
ఈ రాశి వారు ఈ ఏడాది తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు అందుకోలేరు. రుణబాధలు అధికమవుతాయి. నమ్మిన వ్యక్తుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు చిక్కుల్లో నెట్టేస్తాయి. భూమి, గృహాదులను అమ్ముకుంటారు. సొంత ఇంటిని విడిచి వేరొక చోటికి వెళతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఎదురై మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఈ రాశి వారి మనస్సు నిలకడగా ఉండదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. స్త్రీల మూలంగా కలహాలలో చిక్కుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభనస్టాలు సమానంగా ఉంటాయి. ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు. అశుభ వార్తలు వింటారు. కుటుంబంలోని పెద్దలు అనారోగ్యం పాలవుతారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విదేశీయానం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి ఉద్యోగస్తులు కాస్త సతమతమవుతారు. పై అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. ప్రమోషన్లకు ఆటంకాలు ఏర్పడతాయి. పని ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఈ రాశి స్త్రీలకు అన్ని రంగాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లను అందుకోలేరు. పని ఒత్తిడి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కలుగుతుంది. అవివాహిత స్త్రీలకు వివాహం నిశ్చయమవుతుంది. రాజకీయాలలో ఉన్న వారి పలుకుబడి తగ్గుతుంది. వాగ్దానాలను నెరవేర్చడంలో ఆలస్యం జరుగుతుంది. కొన్ని వాగ్దానాలను మాత్రమే అమలు చేయగలుగుతారు. ఈ రాశి విద్యార్థులకు నిలకడ ఉండదు. కష్టపడి చదివినా పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేరు. వ్యవసాయ దారులకు ఈ ఏడాది అశుభ ఫలితాలు ఏర్పడుతాయి. పెట్టుబడులు అధికమై అధికంగా రుణాలు చేస్తారు. క్రీడారంగంలో, సినీ, టీవీ, కళారంగాలలో ఉన్న వారు ఎంత కష్టపడినా గుర్తింపు రాదు. నిర్మాతలకు నష్టం కలుగుతుంది. ఈ రాశి కాంట్రాక్టర్లకు బిల్లులు వసూలు అవటం కష్టంగా మారుతుంది. పనివారితో సమస్యలు ఏర్పడతాయి. పెద్ద కాంట్రాక్టులు చేపట్టినా నష్టాలను చవిచూస్తారు. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు కలిసి రావు. అధికంగా పెట్టుబడులు పెట్టినా లాభాలను గడించలేరు. అక్టోబర్, నవంబర్ నెలలో కొంత బాగుంటుంది.
ధనస్సు రాశి :
మూల : 1, 2, 3, 4 పాదములు
పూర్వాషాఢ : 1, 2, 3, 4 పాదములు
ఉత్తరాషాఢ : 1, వ పాదము
ఆదాయం : 5, వ్యయం : 5,
రాజపూజ్యం : 1, అవమానం : 5,
ఈ రాశివారికి ఈ ఏడాది యోగదాయకంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాలలో లాభాలు వస్తాయి. గృహ నిర్మాణ పనులు పూర్తవుతాయి. అధికార వర్గంలో ఉన్న వారికి గౌవర మర్యాదలు కలుగుతాయి. ధనలాభం కలుగుతుంది. తలపెట్టిన పనులలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఏడాది మధ్యలో రుణబాధలు, అనారోగ్య సమస్యలు, శత్రుపీడ ఏర్పడతాయి. కొన్ని సమయాల్లో మనస్సు స్థిమితంగా ఉండదు. ఏ పని తలపెట్టినా కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొంతమంది నమ్మిన వ్యక్తుల కారణంగా మోసాలకు గురవుతారు. అన్యస్త్రీ పరిచయం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. అకారణంగా కలహాలు పెరుగుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కంప్యూటర్, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్ధులు మంచి ర్యాంకులను సాధిస్తారు. విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ ఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుంది. ప్రయివేటు సంస్థలు, కంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే వారికి పర్మినెంట్ అవుతుంది. వ్యవసాయదారులు రెండు పంటలు బాగా పండి లాభాలను గడిస్తారు. పండ్ల తోటలు, మెట్టపంటల వారికి విశేష లబ్ధి చేకూరుతుంది. పాత బకాయిలను తీరుస్తారు. వ్యాపారస్తులకు క్రయవిక్రయాలలో మంచి లాభాలు వస్తాయి. ఇనుము, సిమెంట్, రియల్ ఎస్టేల్ రంగాల వారికి అనుకున్న దాని కన్నా రెట్టింపు లాభాలు వస్తాయి. క్రీడాకారులు క్రీడా రంగంలో రాణించి మంచి ఫలితాలను పొందుతారు. కళాకారులు, సినీ, టీవీ పరిశ్రమలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. కాంట్రాక్ట్ దారులకు సకాలంలో బిల్లులు చేతికి అందుతాయి. పెద్ద కాంట్రాక్టులు కలిసి వస్తాయి. పని సమయంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రజాసమస్యలు తీరుస్తారు. ప్రజాదరన పొందుతారు. వీరు ఆశించిన పదవులు వస్తాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అవివాహిత స్త్రీలకు అనుకూలమైన సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నెరవేరుతాయి. సంసార సౌఖ్యం, గృహ జీవితానందం పొందుతారు.
మకర రాశి :
ఉత్తరాషాఢ : 2, 3, 4 పాదములు
శ్రవణం : 1, 2, 3, 4 పాదములు
ధనిష్ట : 1, 2 పాదములు
ఆదాయం : 8, వ్యయం : 14,
రాజపూజ్యం : 4, అవమానం : 5,
ఈ రాశివారికి ఈ ఏడాది శత్రు బాధలు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. తలపెట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఈ రాశి వారిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు. అకారణ కలహాలు సంభవిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అనుకున్నంత కలిసి రావు. అనవసర ధన వ్యయం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు తగ్గుతాయి. కుటుంబంలో తగాదాలు ఏర్పడతాయి. వ్యవహార చిక్కులు, వాహన ప్రమాదాలు సంభవిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. పిత్రార్జిత ఆస్తులు లభిస్తాయి. అన్నదమ్ములతో విరోధం పెరుగుతుంది. కుటుంబ కలహాలు, బంధుమిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. రావలసిన బాకీలు ఈ ఏడాది కూడా వసూలు కావు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలోని వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అన్య స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని అశుభవార్తలు వింటారు. ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ నుంచి రావలసిన సొమ్ము వసూలు అవుతుంది.
ఈ రాశి విద్యార్థులు అతి కష్టం మీద ఉత్తీర్ణులవుతారు. ర్యాంకులు సాధించడంలో ఎంత కష్టపడినా అనుకున్న ఫలితాలు తెచ్చుకోలేరు. ఈ రాశి ఉద్యోగస్తులు ఈ ఏడాది కూడా ప్రమోషన్లు అందుకోలేరు. అధికారుల వలన బాధలు పడాల్సి వస్తుంది. ఒక చోట స్థిరంగా పని చేయలేకపోతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ దారులకు చుట్టుపక్కల రైతుల కన్న తక్కువ దిగుబడి వస్తుంది. పెట్టుబడులు ఎక్కువ కావడం చేత అధిక మొత్తంలో బుణాలను చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి పోటీ పెరుగుతుంది. అనుకన్న లాభాలను అందుకోలేరు. క్రీడాకారులు కొన్ని సందర్భాలలో నిరుత్సాహం పడాల్సిన పరిస్థితుల ఏర్పడతాయి. టీవీ, సినీ, కళా రంగాలకు చెందిన వారు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాంట్రాక్టు దారులకు బిల్లులు సక్రమంగా వసూలు కావు. పనిస్థలంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ తగ్గుతుంది. సమస్యలలో చిక్కుకుంటారు. మంత్రి వర్గంలో ఉన్నవారికి భేదాభిప్రాయాలు వస్తాయి. అపనిందలు మోయాల్సి వస్తుంది. ఈ రాశి స్త్రీలు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగ రీత్యా కొన్ని అపవాదులను ఎదుర్కోవలసి వస్తుంది. పై అధికారుల చెప్పు చేతల్లో ఉండవలసి వస్తుంది. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది.
కుంభ రాశి :
ధనిష్ట : 3, 4 పాదములు
శతభిషం : 1, 2, 3, 4 పాదములు
పూర్వాభాద్ర : 1, 2, 3 పాదములు
ఆదాయం : 8, వ్యయం : 14,
రాజపూజ్యం : 7, అవమానం : 5,
ఈ రాశివారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది . తలపెట్టిన పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి. నూతన వ్యక్తులతో స్నేహ లాభాలు కలుగుతాయి. బంధువర్గంలో ఆధిక్యత చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలసి ప్రయాణాలు చేస్తారు. తీర్ధయాత్రలు, దైవకార్యాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. ఈ రాశి వారి ఇంట వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. స్తిరాస్థి అభివృద్ధి చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన విషయాలు మర్చిపోతుంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి వారు లలిత కలళ్లో ఆసక్తిని కనబరుస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ధనలాభం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా పోతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులు, సన్నిహితులలో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. బంధుమిత్రుల వలన ధన వ్యయం కలుగుతుంది. స్థిరాస్తి తగాదాలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ధనలాభం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి వారు ఈ ఏడాది అశుభవార్తలు వింటారు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు. పై చదువుల నిమిత్తం విదేశీయానం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆలస్యంగా ప్రమోషన్లు వస్తాయి. ట్రాన్స్ ఫర్ లు జరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వ్యవసాయ రైతులు రెండు పంటలలో మంచి లాభాలను గడిస్తారు. పెట్టుబడులకు తీసిన రుణాలను తీరుస్తారు.
వ్యాపారస్తులకు క్రయవిక్రయాలలో లాభాలు చేకూరుతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. క్రీడాకారులకు మొదల నిరుత్సాహం ఏర్పడినా తర్వాత విజయాలను సాధిస్తారు. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు కలిసి వస్తాయి. కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడి పనులు నత్తనడకన సాగుతాయి. రాజకీయ నాయకులకు ప్రజలలో ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు వస్తాయి. అవివాహితలకు మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. విలువైన వస్తువులు, బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
మీన రాశి :
పూర్వాభాద్ర : 4 వ పాదము
ఉత్తరాభాద్ర : 1, 2, 3, 4 పాదములు
రేవతి : 1, 2, 3, 4 పాదములు
ఆదాయం : 5, వ్యయం : 5,
రాజపూజ్యం : 3, అవమానం : 1,
ఈ రాశి వారు ప్రతి చిన్న పనికి, విషయానికి ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన రుణాలు చేస్తారు. స్థిరచరాస్తులను అమ్ముకుంటారు. స్థిరాస్తి తగాదాలలో చిక్కుకుంటారు. ఏ రంగంలో ఉన్న ఫలితాలు శూన్యంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అనుకున్న లాభాలు సాధించలేరు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడి సకాలంలో పూర్తి కావు. వివాహాది శుభకార్యాలలో కాలయాపన చేస్తారు. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఊహించని సంఘటనలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలతో భయాందోళనలకు గురవుతారు. ఇతరులకు హామీలు ఇచ్చి చిక్కుల్లో పడతారు. ఈ ఏడాది నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. స్నేహితులతో బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. స్థిరాస్తి తగాదాలు ఏర్పడతాయి. విద్యార్దులు ఎంత చదివినా అనుకున్న ఫలితాలను పొందలేరు. మంచి మార్కుల కొరకు ప్రయత్నించిన ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఆందోళనకు గురవుతారు. వ్యవసాయ దారులు పెట్టుబడులు అధికంగా పెట్టి బుుణబాధలను ఎదుర్కొంటారు. పంట చేతికి వచ్చే సమయానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. నూతన ఏజెన్సీలు కలిసి రావు. అధికారుల ఆకస్మిక తనిఖీలు కొంతమేరకు వ్యాపరస్తులను చిక్కుల్లో తోసేస్తాయి. క్రీడా, సినీ, టీవీ, కళా రంగాల్లో ఉండేవారికి అనుకున్నంత గుర్తింపు రాదు. కాంట్రాక్టర్లు పనులు లేబర్ కారణంగా ఆటంకాలు ఏర్పడతాయి. బిల్లులు సకాలంలో అందవు. చేస్తున్న పనుల్లో నష్టాన్ని చవిచూస్తారు. రాజకీయ నాయకులకు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆదరాభిమానాలు తగ్గుతాయి. కొత్త పదవుల కోసం ప్రయత్నించేవారికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలలో వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరక మనస్పర్థలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. సంతాన సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.






