తెలంగాణలో HIV పరిస్థితి ఏంటో తెలుసా..?

by  |
తెలంగాణలో HIV పరిస్థితి ఏంటో తెలుసా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ప్రతీ ఏటా సగటున 12 వేల చొప్పున కొత్త హెచ్ఐసీ పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం దాదాపు పది వేలు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గతేడాది సుమారు ఎనిమిది లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 10,651 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.

హెచ్ఐవీ వైరస్ వ్యాప్తిలో 2018లో దేశం మొత్తంమీద మిజోరాం తొలి స్థానంలో ఉంటే ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉండగా, 2019లో నాల్గవ స్థానంలో ఉంది. ఈ ఏడాది మాత్రం అది ఆరవ స్థానానికి పడిపోయినట్లు సొసైటీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018లో మొత్తం 11,820 కొత్త హెచ్ఐవీ కేసులు నమోదుకాగా గత సంవత్సరం మాత్రం 10,651 నమోదయ్యాయి. ఒక్క ఏడాదిలోనే 1,169 తగ్గాయి. ఎయిడ్స్ మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది.

ప్రస్తుతం రాష్ట్రం మొత్తంమీద 80,645 మంది హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారని, వీరికి ప్రభుత్వ ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా అవసరమైన మందులు, చికిత్స అందుతున్నట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు తెలిపారు. మొత్తం కేసుల్లో అత్యధికంగా 21,796 మంది పాజిటివ్ పేషెంట్లు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో మహబూబ్‌నగర్ (ఉమ్మడి) జిల్లాలో 8,062 మంది ఉన్నారు.

లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి రేటు ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కానీ పాజిటివ్ కేసుల నమోదు ప్రకారం చూస్తే ఇప్పటికీ హైదరాబాద్ నగరం 1,944 కేసులతో మొదటి స్థానంలో ఉంది.


Next Story

Most Viewed