జూన్‌లో కరోనా ముందుస్థాయి కంటే అధికంగా నియామకాల రేటు

by  |
జూన్‌లో కరోనా ముందుస్థాయి కంటే అధికంగా నియామకాల రేటు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది జూన్‌లో నియామకల రేటు 2019 కరోనా ముందునాటి స్థాయి కంటే దాదాపు 42 శాతం ఎక్కువగా నమోదైనట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ లింక్‌డిన్ ఇండియా లేబర్ మార్కెట్ నివేదిక ప్రకారం.. భారత్‌లో సెకెండ్ వేవ్ కరోనా కారణంగా ఏప్రిల్‌లో నియామకాల ప్రక్రియ భారీగా క్షీణించింది. అయితే, జూన్‌లో నమోదైన నియాకమాల రేటు దేశీయంగా కార్యకలాపాల కోలుకుంటున్న సంకేతాలను కలిగి ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఏప్రిల్ తర్వాత నెమ్మదిగా నియామకాల ప్రక్రియ క్రమంగా కోలుకుంటోందని తెలిపింది. ఈ ఏడాది మే చివరిలో నియామక రేటు 35 శాతం ఎక్కువగా ఉండేదని, జూన్ నాటికి 42 శాతానికి పెరిగిందని వివరించింది.

గతేడాది చాలావరకు కంపెనీలు జాగ్రత్త వైఖరిని తీసుకున్న నేపథ్యంలో ఈసారి అధికంగా నియామకాల రేటు సాధ్యమైందని నివేదిక పేర్కొంది. ఇటీవల జాబ్ మార్కెట్లో ఉద్యోగులు పెరిగారని, మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన నిపుణులకు విస్తృతమైన ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని లింక్‌డిన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా హార్డ్‌వేర్, సాఫ్‌వేర్ విభాగాల్లో నైపుణ్యం ఉన్న యువతకు అధిక డిమాండ్ ఉంది. లింక్‌డిన్ డేటా ప్రకారం.. 2018, జనవరి నుంచి 2021 జూన్ మధ్య శ్రామికశక్తిలో జెడ్ జనరేషన్ ఉద్యోగుల వాటా 4.2 రెట్లు పెరిగిందని తెలిపింది. డిజిటల్ విభాగంలో నైపుణ్యం ఉన్న జెడ్ జనరేషన్ నియామకాలు 1.5 రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. జెడ్ జనరేషన్ అంటే 18-24 మధ్య వయసు గల చిన్న వయసువారు.


Next Story

Most Viewed