ఆ ఆలయంలో అమ్మవారికి రుతుస్రావం.. మూడు రోజులు దర్శనాలు బంద్

by  |
ఆ ఆలయంలో అమ్మవారికి రుతుస్రావం.. మూడు రోజులు దర్శనాలు బంద్
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని ఒక్కో పురాతన ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఈ క్రమంలోనే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన గౌహతి పట్టణంలోని బ్రహ్మపుత్రానది ఒడ్డున ఉన్న నీలాచల పర్వత శిఖరంపై యోని రూపంలో ఉన్న కామాఖ్యా దేవి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సంతానం అనుగ్రహించే జగన్మాతగా, ముక్తిని ప్రసాదించే మోక్షదాయినిగా కొలవబడుతున్న పార్వతీ మాత, మూడు ప్రధానరూపాల్లో ఇక్కడి భక్తులకు దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసే త్రిపుర భైరవిగా.. ఆనందంగా ఉన్న సమయంలో సింహవాహినిగా.. పరమేశ్వరుడిపై ప్రేమతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది.

ప్రత్యేకత..
దేవాలయంలో అమ్మవారి యోని స్రావిత పవిత్ర జలాలను, పునీతమైన గుండంలో స్నానమాచరించి, ఆ జలాన్ని తీర్థంగా సేవిస్తే.. ఎంతటి మహాపాపమైనా నివారణ అవుతుందని భక్తుల నమ్మకం. సాధారణ స్త్రీల మాదిరిగానే కామాఖ్యా దేవీ నెలలో మూడురోజుల పాటు రుతుస్రావం తంతు ఉంటుంది. ఆ రోజుల్లో యోని శిల నుంచి ఎరుపు రంగు స్రావం వెలువడుతుందని చెప్తుంటారు. అంతేకాదు ఈ మూడు రోజులు ఆలయాన్ని మూసేసి.. నాలుగో రోజున పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుతారు. ఈ సమయంలో అర్చకులు పార్వతీ గుండంలో బట్టలు ఉతికి వాటిని వేలం వేస్తారు. ఈ పద్ధతిలో భక్తులకు వాటిని విక్రయిస్తారు. ఈ వస్త్రాలను ధరిస్తే రుతుస్రావ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక ప్రతీ ఆషాఢమాసంలో ఐదురోజుల పాటు జరిగే కామాఖ్యా కుంభమేళా గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధువులు, అఘోరాలు, తాంత్రికులు ఈ రోజుల్లో అమ్మవారిని దర్శించుకుని ఘనమైన పూజలు చేస్తుంటారు.

చరిత్ర..
పురాణాల ప్రకారం భర్త అయిన పరమేశ్వరుణ్ణి పిలవకుండా సచీదేవి తండ్రి దక్షప్రజాపతి యాగాన్ని చేయాలని అనుకుంటాడు. అంతేకాదు కూతురని కూడా చూడకుండా అవమానిస్తాడు. ఇది సహించలేని సచీదేవి యజ్ఞ గుండం వద్దనే అగ్నికి ఆహుతై పోతుంది. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు.. వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చెయ్యాలని పంపిస్తాడు. తర్వాత భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు.. పార్వతీ దేవి దేహాన్ని సుదర్శనంతో ఖండించగా.. ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అందులో అమ్మవారి యోని భాగం గౌహతిలోని నీలాచలంపై పడిందని పురాణాలు చెబుతున్నాయి. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.


Next Story