కరోనా పేషెంట్ వివరాలు చెప్పాలి.. హైకోర్టు నోటీసులు

by  |
High Court, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పాజిటివ్ బారిన పడిన తర్వాత ఆస్పత్రిలో అందుతున్న ట్రీట్‌మెంట్ వివరాలను పేషెంట్‌తో పాటు వారి బంధువులకు తెలియజేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో పది రోజుల క్రితం చేరిన ఇద్దరి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తెలియడంలేదంటూ వారి తరఫున కిషోర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌‌ను మంగళవారం విచారించిన హైకోర్టు ఆస్పత్రి యాజమాన్యానికి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న ట్రీట్‌మెంట్ గురించి వారికి మాత్రమే కాక బంధువులకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు లోబడి, మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం తెలియజేయాలని పిటిషనర్ కోరారు.

ఆస్పత్రి వార్డులోకి వెళ్ళే అవకాశం లేదని, వారితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా లేదని, కనీసం ఆస్పత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది నుంచి అడిగి తెలుసుకుందామని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని కిషోర్ పేర్కొన్నారు. అతి కష్టం మీద ఒక్కసారి మాత్రమే ఒకరితో మాట్లాడిన తర్వాత సరైన వైద్యం అందడంలేదని, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాధానం వచ్చిందని, అందువల్లనే యాజమాన్యం నుంచి తాజా వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు బెంచ్ తక్షణం పేషెంట్ల బంధువులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, రిపోర్టులను కోర్టుకు సమర్పించాలని టిమ్స్ నిర్వాహకులను ఆదేశించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


Next Story

Most Viewed