చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ

by  |
చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో మిస్సింగ్ కేసులను ఛేదించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2010 నుంచి 2019 జూన్ వరకూ 13,350 మంది మిస్సింగ్ కేసులు నమోదు కాగా, సుమారు 2,126 మిస్సింగ్ కేసులను ఛేదించకుండానే పోలీసులు క్లోజ్ చేయడంపై అడ్వకేట్ రాపోలు భాస్కర్ గతేడాది జూన్‌లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టులో పిల్ వేసి ఆరు నెలలు గడిచినా నేటి వరకూ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, మిస్సింగ్ అయిన వారిని దర్పణ్ యాప్ ద్వారా గుర్తించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తున్నట్టు ఈ సందర్భంగా హైకోర్టుకు ఏజీ సమాధానం చెప్పారు. అదృశ్యం అయిన వారి వివరాలను సాంకేతిక పరిజ్ఞానంతో ముఖ కవళికలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

అదృశ్యమైన వివరాలను మిగతా అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని సూచించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అంతేగాకుండా ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటు చేయడంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా 33 జిల్లాలలో బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణకు ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.


Next Story

Most Viewed