వినూత్న పద్ధతుల్లో జేబులు కొల్లగొడుతున్న హ్యాకర్స్

by Shyam |   (  Updated:2021-09-23 23:12:18  IST  )

<p>దిశ, ఫీచర్స్ :  పాండమిక్ తర్వాత ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ సులభతరం కావడంతో, డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో మోసాల సంఖ్య కూడా పెరిగింది. మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి వినూత్న పద్ధతులను ఉపయోగిస్తున్నారు. యుటిలిటీ బిల్లుల నుంచి కిరాణా షాపింగ్ ట్రాన్సక్షన్స్ వరకు అనేక రకాల ట్రాన్సక్షన్స్ డిజిటల్ మోడ్‌లు అందుబాటులో ఉండగా ఫిషింగ్, ఈ-మెయిల్, ఎంబెడెడ్ మాల్వేర్, ఓటీపీ, కార్డ్ టెస్టింగ్, చార్జ్‌బ్యాక్, రీఫండ్ అకౌంట్ టేకోవర్ వంటి అనేక రూపాలుగా డేటా మోసం జరుగుతోంది. ఇది [&hellip;]</p>

వినూత్న పద్ధతుల్లో జేబులు కొల్లగొడుతున్న హ్యాకర్స్
X

దిశ, ఫీచర్స్ : పాండమిక్ తర్వాత ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ సులభతరం కావడంతో, డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో మోసాల సంఖ్య కూడా పెరిగింది. మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి వినూత్న పద్ధతులను ఉపయోగిస్తున్నారు. యుటిలిటీ బిల్లుల నుంచి కిరాణా షాపింగ్ ట్రాన్సక్షన్స్ వరకు అనేక రకాల ట్రాన్సక్షన్స్ డిజిటల్ మోడ్‌లు అందుబాటులో ఉండగా ఫిషింగ్, ఈ-మెయిల్, ఎంబెడెడ్ మాల్వేర్, ఓటీపీ, కార్డ్ టెస్టింగ్, చార్జ్‌బ్యాక్, రీఫండ్ అకౌంట్ టేకోవర్ వంటి అనేక రూపాలుగా డేటా మోసం జరుగుతోంది. ఇది విపరీతమైన వేగంతో అభివృద్ధి చెందుతుండగా, దీన్ని అడ్డుకోవడం సైబర్ పోలీసులకు కూడా సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్ని స్కామ్‌లను డీకోడింగ్ చేసి, మోసగాళ్ల కార్యాచరణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు టెక్ నిపుణులు.

వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ :

చాలా మంది ప్రస్తుతం ‘వర్క్ హోమ్’ ఉద్యోగాల కోసం అన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఉద్యోగావకాశాలు, అధిక జీతం, పరిమిత గంటల పని/తక్కువ గంటల పని, ఇచ్చిన సమయంలో పనులు పూర్తి చేయడం, పార్ట్‌టైమ్ మాత్రమే వంటి ప్రకటనలతో ఉద్యోగ అభ్యర్థులను అట్రాక్ట్ చేస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి లేదా ‘జాబ్ కిట్’ అందుకోవడానికి, రిజిస్ట్రేషన్ కోసం ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని అభ్యర్థిస్తారు. డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత బోర్డు తిరగేస్తారు.

పన్ను మోసాలు

ఈ రకమైన మోసం ప్రధానంగా ట్యాక్స్ సీజన్‌లో కనిపిస్తుంది. బ్యాంక్ వివరాలు, ఇతర కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని కోసం పన్ను చెల్లింపుదారులకు ‘ట్యాక్స్ తగ్గింపు’ లేదా 50శాతం ట్యాక్స్ చెల్లిస్తే చాలు/ ట్యాక్స్ కట్టకుండా ఎలా హ్యాండిల్ చేయొచ్చు వంటి సమాచారంతో ఎస్‌ఎమ్ఎస్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా సందేశాలు పంపుతారు. వాటికి రిప్లయ్ ఇవ్వమని కోరతారు. ఈ క్రమంలోనే స్కామర్స్ మోసాలకు పాల్పడతారు.

క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ మోసం

క్రెడిట్ కార్డులు దాదాపు ప్రతి బ్యాంక్ ద్వారా అందుతాయి. ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశంలో 60 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఉన్నారు. క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లు ఎలా పనిచేస్తాయో చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి, మోసగాళ్లు ఈ వ్యవస్థను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. వారు రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడంలో సహాయాన్ని అందిస్తామని, ఆఫర్ త్వరలో ముగుస్తుందని లేదా పాయింట్లు గడువు ముగియబోతున్నాయని పేర్కొనడం ద్వారా వారు సాధారణంగా ఎమర్జెన్సీ భావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది కార్డ్ హోల్డర్లు తీవ్ర భయాందోళనకు గురై, కార్డు వివరాలను మోసగాళ్లతో పంచుకుంటారు.

తెలియని/ధృవీకరించని మొబైల్ యాప్స్ :

మీరు తెలియని లేదా ధృవీకరించని మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మోసగాళ్లు మీ మొబైల్ పరికరం/ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్‌ని యాక్సెస్ చేస్తారు. ఈ అప్లికేషన్ లింక్‌లు సాధారణంగా SMS / సోషల్ మీడియా / ఇన్‌స్టంట్ మెసెంజర్, మొదలైన వాటి ద్వారా షేర్ చేయబడతాయి. లింకులు ప్రామాణికంగా/అధికారికంగా కనిపించే పేర్లలానే కనిపిస్తాయి. కానీ అవి రిమోట్ యాక్సెస్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి దారి మళ్లించవచ్చు. హానికరమైన అప్లికేషన్ డౌన్‌లోడ్ అయిన తర్వాత, మీ పరికరానికి పూర్తి యాక్సెస్ పొంది మొత్తం సమాచారాన్ని దొంగిలించవచ్చు.

అకౌంట్ టేకోవర్ :

ఇది అత్యంత తీవ్రమైన మోసం. ఇది ఒక రకమైన గుర్తింపు దొంగతనం(ఐడెంటీటి థెఫ్ట్). మోసగాళ్లు వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు దొంగిలించిన పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ కోడ్‌లు లేదా ఫిషింగ్ స్కీమ్‌లను ఉపయోగించడం ద్వారా చట్టబద్ధమైన అకౌంట్‌లకు యాక్సెస్ పొందుతారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. బ్యాంకు ఖాతాల్లోని వివరాలను బట్టి మోసాలకు పాల్పడుతారు. వారు ఖాతా సమాచారాన్ని మార్చవచ్చు, కొనుగోళ్లు చేయవచ్చు.

కార్డ్ టెస్టింగ్ మోసం

దొంగిలించిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సమాచారాన్ని ఉపయోగించి కొనుగోళ్లను పూర్తి చేయడానికి ఉపయోగించే మరొక సాధారణ పద్ధతి. సాధారణంగా, పెద్ద కొనుగోలుకు కార్డును ప్రయత్నించే ముందు చిన్న ట్రాన్సక్షన్స్‌కు వినియోగించి టెస్ట్ చేస్తారు.

చార్జ్‌బ్యాక్ :

దీన్నే ‘ఫ్రెండ్లీ ఫ్రాడ్’‌గా పరిగణిస్తారు, ఇక్కడ కస్టమర్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు/ఉత్పత్తులను డెలీవరి పొందుతాడు. కానీ ‘నాట్ రిసీవ్డ్’‌గా పేర్కొంటూ రీఫండ్ అడుగుతారు. స్కామ్ యొక్క ఉద్దేశ్యం రీఫండ్ పొందడం లేదా డబ్బు చెల్లించకుండా ఆ వస్తువును ఉచితంగా పొందడం. వ్యక్తిగత కొనుగోలుపై డబ్బు ఆదా చేయాలనుకుంటున్నందున నేరస్తుడు దీన్ని చేయవచ్చు. లేదా ఇది మరింత వ్యవస్థీకృత ఆపరేషన్‌లో భాగంగా ఉండవచ్చు, ఇక్కడ బహుళ వస్తువులను ఉచితంగా సమర్థవంతంగా కొనుగోలు చేసి, ఆపై లాభం కోసం తిరిగి విక్రయిస్తారు. ఇందుకోసం ఆన్‌లైన్ రీటయిలర్స్‌ను స్కామర్స్ టార్గెట్ చేస్తున్నారు.

రీఫండ్ :

దొంగిలించిన క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేస్తారు, ఆ తర్వాత ప్రత్యామ్నాయ క్రెడిట్ కార్డుకు రీఫండ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు. పాత క్రెడిట్ కార్డ్ ఖాతా ఇప్పుడు క్లోజ్ అయిందని, అందువల్ల రీఫండ్ తప్పనిసరిగా కొత్త కార్డ్‌లో వేయాలని పేర్కొంటూ మోసగాళ్లు తరచూ ఈ-కామర్స్ వ్యాపారిని అలాంటి రీఫండ్‌ని జారీ చేయడంలో మోసగించవచ్చు. ఇది చాలా సులభమైన, ప్రభావవంతమైన వ్యూహం.

కొవిడ్ పేరుతో :

సెకండ్ వేవ్ నుంచి మనం బయటపడ్డాం కానీ మనలో చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో తక్షణ వైద్య పరికరాలు, మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, మందులు మొదలైనవాటిని తీసుకోవడానికి అధిక మొత్తంలో చెల్లించడానికి కూడా కొంతమంది రెడీ అవుతారు. ఈ నేపథ్యాన్ని కూడా సైబర్ నేరగాళ్లు వాడుకుని బాధితుల నుంచి ముందుగానే ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్‌లో పేమెంట్స్ పొంది ఆ తర్వాత అదృశ్యమవుతున్నారు. చాలా మంది భారతీయులు ఈ మోసానికి బలైపోగా, చాలా పెద్దమొత్తంలో డబ్బును కోల్పోయారు.

చెల్లింపు గేట్‌వే/డిజిటల్ వాలెట్ ఓటీపీ ఫ్రాడ్ :

మనం తరుచుగా ఆన్‌లైన్‌లో ఆసక్తి చూపిస్తున్న ప్రొడక్ట్ వివరాలు సేకరించిన స్కామర్స్, ఇండివిడ్యువల్‌గా కాల్ చేసి తక్కువ ధరలో ఆయా ప్రొడక్ట్స్ లేదా సర్వీస్ అందిస్తామని చెబుతాడు. ఆఫర్ అయిపోతుందని, ఇది పరిమిత సభ్యులకు మాత్రమేనని చెబుతూ, సర్వీస్ పొందడానికి, నిర్దారణ కోసం కొంతమొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలని కోరతారు. అందుకోసం తమ డిజిటల్ వాలెట్‌ నెంబర్‌తో పాటు ఓటీపీ నెంబర్స్ పంపించాలంటారు. ఒక్కసారి మీ ఖాతాకు యాక్సెస్ పొందిన తర్వాత, ఖాతాలోని డబ్బులన్నీ వాష్ అవుట్ చేస్తారు.

భారత ప్రభుత్వం 2020 లో 1.16 మిలియన్ సైబర్ సెక్యూరిటీ కేసులను నమోదు చేసింది, ఇది 2019కి మూడు రెట్లు ఎక్కువ. ఈ కేసుల్లో చాలా వరకు ఈ-కామర్స్ మోసం, గుర్తింపు దొంగతనం ఉన్నాయి.

మోసపోకుండా ఉండాలంటే :

* మీ ఆర్థిక సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దు
* ఫోన్ ద్వారా OTP, PIN లేదా CVV వంటి సమాచారాన్ని ఏ సంస్థ అడగదని గుర్తుంచుకోవాలి
* మీకు తెలియని వారెవరైనా స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్/AnyDesk, TeamViewer వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోమని అడిగితే చాలా జాగ్రత్తగా ఉండండి
* ఈ-మెయిల్ లేదా SMS లో పొందుపరిచిన లింక్‌లను ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి, ముఖ్యంగా ఆర్థిక ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం ఉన్న చోట మరింతగా జాగ్రత్త పడండి. ఈ లింక్‌లను క్లిక్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ ఓటీపీలు వారికి చేరవచ్చు.
* చెల్లింపు, OTP వంటి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు, డెబిట్ చేయబడే మొత్తాన్ని, అలాగే చెల్లింపును స్వీకరించే వ్యాపారి పేరును ఒకటికి రెండుసార్లు ధృవీకరించండి. మూలం విశ్వసనీయంగా/ప్రామాణికంగా కనిపించకపోతే లేదా తేడాగా అనిపిస్తే, లావాదేవీని వెంటనే రద్దు చేయండి
* డబ్బును స్వీకరించడానికి మీరు QR కోడ్‌ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారు మిమ్మల్ని ఏదైనా స్కాన్ చేయమని అడిగితే, అది చాలావరకు స్కామ్ కావచ్చు
* అసురక్షిత లేదా పబ్లిక్ డివైజెస్, నెట్‌వర్క్‌ల నుంచి ఎటువంటి బ్యాంక్ (నెట్ బ్యాంకింగ్)/ కాన్ఫిడెన్షియల్ లావాదేవీలను నిర్వహించవద్దు
* కీలాగర్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి కీస్ట్రోక్‌లను క్యాప్చర్ చేయవచ్చు. అందువల్లే పబ్లిక్ డివైజెస్‌లో ఎల్లప్పుడూ వర్చువల్ కీబోర్డ్‌ను ఉపయోగించండి
* మీ చెక్ బుక్ కాపీలు, ఇతర KYC డాక్యుమెంట్‌లను అపరిచితులతో పంచుకోవద్దు.

Next Story