హెపటైటిస్ బీ అంతా డేంజరా.. 15 జిల్లాల్లో సర్వే

by  |
Hepatitis B
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హెపటైటిస్‌ బీ‌ వైరస్‌ను నిర్మూలించేందుకు హెల్త్ డిపార్ట్‌మెంట్ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్‌‌, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, నాగర్‌‌కర్నూల్‌, వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాల్‌పల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో మాస్ స్క్రీనింగ్ క్యాంపులు పెట్టాలని నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 15 జిల్లాల్లో క్యాంపులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో హెపటైటిస్‌ బీ ముప్పు ఉన్న 70 వేల మందికి టెస్టులు చేయనున్నారు. ఈ స్క్రీనింగ్‌లో రోగం ఉన్నట్లు తేలిన వాళ్లకు నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్‌‌తో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

వాస్తవానికి ఈ వైరస్ సోకినోళ్లకు పేషెంట్ కండీషన్‌ను బట్టి ఏడాది నుంచి రెండేండ్ల వరకూ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఒక్కో పేషెంట్ ట్రీట్‌మెంట్ కోసం సుమారు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ స్క్రీనింగ్ కు అవసరమైన మెడికల్ కిట్లను, నిధులను ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర అధికారులకు అందజేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండడంతో స్క్రీనింగ్ లో పాల్గొనే హెల్త్‌‌ సిబ్బందికి రెండు డోసులు యాంటీ హెపటైటిస్ వ్యాక్సిన్ ఇచినట్లు అధికారులు పేర్కొన్నారు.

కారణాలు అన్వేషణ…

హెపటైటిస్ బీ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైద్యశాఖ కారణాలను అన్వేషిస్తోంది. అంతేగాక ఈ వైరస్ కారణంతో లివర్ దెబ్బతింటున్న ప్రాంతాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఆ మేరకు రాష్ర్ట వైద్యారోగ్యశాఖ అధికారులు, జాతీయ హెల్త్ మిషన్ బృందాలు సంయుక్తంగా స్టడీ చేయనున్నాయి.

హెపటైటిస్ అంటే..?

హెపటైటిస్ వ్యాధి. హెపటైటిస్ బీ వైరస్ వల్ల కలిగే తీవ్రమైన కాలేయ వ్యాధి. కొంతమందికి, హెపటైటిస్ బీ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా మారుతుంది. అంటే సుమారు ఇది ఆరు నెలలకు పైగా ఉంటుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ బీ కలిగి ఉండటం వలన కాలేయ వైఫల్యం, కాలేయ క్యాన్సర్ లేదా సిర్రోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది కాలేయాన్ని శాశ్వతంగా మచ్చలు చేసే పరిస్థితికి తీసుకువస్తుంది. ఇది లైంగిక సంబంధాలు, సూదులు మార్పిడి, తల్లి నుంచి శిశువుకు వ్యాప్తి చెందుతుంది. కానీ తుమ్ములు, దగ్గు వలన ఎట్టి పరిస్థితుల్లో వ్యాప్తి చెందదు.

లక్షణాలు ఇవే..

పొత్తి కడుపు నొప్పి, ముదురు మూత్రం, జ్వరం, కీళ్ళ నొప్పి, ఆకలిని కోల్పోవడం, వికారం, వాంతులు, బలహీనత, అలసట కలిగి చర్మం పసుపు రంగులోకి మారుతోంది. అంతేగాక కళ్లు కూడా పసుపు పచ్చ రంగులోకి మారతాయి. అయితే ఈ లక్షణాలు తేలిన 24 గంటల్లోపు వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందినట్లయితే, నివారణ సులువని డాక్టర్లు తెలిపారు.


Next Story

Most Viewed