కర్ణాటకను ముంచెత్తుతోన్న భారీ వర్షాలు 

46

కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 48 గంటల్లో కొడగు జిల్లాలోని బాగమందాలలో 105 సెం.మీ.ల కుంభపోత వర్షం కురిసినట్టు కేంద్ర జల సంఘం తెలిపింది. ఈ వానధాటికి వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా కావేరి, బీమా, హేమావతి నదులు ప్రవాహ ధాటి పెంచాయి. కలబుర్గి ప్రాంతంలో బీమా నదిలో నీటిమట్టం బాగా పెరిగింది. వర్షాలకు బెళగావి జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బాగముందాలలో బాగందేశ్వర ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. చిక్ మగళూరు జిల్లాలోని కొప్పా పట్టణంలో అలగేశ్వర రోడ్డుపై కొండ చరియలు విరిగిపడి ట్రాఫిక్ నిలిచిపోయింది.

కొడగు జిల్లా బ్రహ్మగిరి కొండల్లో కొండ చరియలు విరిగిపడి పూజారితో సహా ఐదుగురు గల్లంతయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో 9 జిల్లాలపై వరద ప్రభావం ఉన్నట్టు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ తెలిపారు. 375 ఇళ్ళు స్వల్పంగా, 12 ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా కోవిడ్ చికిత్స పొందుతున్న కర్ణాటక సీఎం యడ్యూరప్ప వరద పరిస్థితులపై సమీక్షించి అత్యవసర సహాయం కింద 50 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత కుటుంబాలకు 10 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..