వచ్చే మూడు రోజులూ వానలే !

by  |
వచ్చే మూడు రోజులూ వానలే !
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి వర్ష సూచన పెరుగుతూనే ఉంది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ప్రారంభములో ఇది రాగల 48గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి మూడు రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.

బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, అదే విధంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌కు కూడా బుధవారం వానగండం పొంచి ఉంది. అన్నిసర్కిళ్లలో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఘన్‌పూర్‌లో 62 మి.మీ వర్షం కురిసింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 5.5 మి.మీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో 50 మి.మీ చొప్పున వర్షం కురిసింది. రంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జనగామ, వికారాబాద్ జిల్లాలో వర్షం కురిసింది.



Next Story

Most Viewed