ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

by  |
Rain in telangana
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని వెల్లడించింది. దాని ప్రభావంతో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఇది ఏర్పడొచ్చని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని సూచించింది.

‘అల్పపీడనం కారణంగా కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. బుధవారం, గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉండగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని’ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో మూడు రోజులుపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Next Story

Most Viewed