మహారాష్ట్రలో వర్షాలు.. జూరాలకు భారీగా వరదనీరు

by  |
Jurala project
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 5వ తేదీ నుండి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలలో వచ్చి చేరుతోంది. ఈ వరద నీరు బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 25 వేల 400 క్యూసెక్కుల చొప్పున వచ్చి చేరగా, సాయంత్రానికి వరద ఉధృతి కొంతమేర తగ్గి 18 వేల ఎనిమిది వందల క్యూసెక్కులకు తగ్గింది. మొత్తం 9.214 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల లో ఇప్పటివరకు 5.507 టీఎంసీల వరద నీరు వచ్చింది. వచ్చిన వరద నీరు వృధా కాకుండా జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ వీటిని ఎట్టి పోసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మక్తల్ నియోజకవర్గం లోని బీమా ఫేస్- 1 ద్వారా చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ నీటిని తరలించే ప్రక్రియకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

కోయిల్ సాగర్ రిజర్వాయర్లోకి నీటిని తరలించే ప్రక్రియకు చిన్నచింతకుంట మండలం ఉండ్యాల గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండలం గూడెం దొడ్డి వద్దా ఫేస్ వన్ పంపును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు.. వర్షాకాలం ప్రారంభం కాకముందు గాని జూరాల వరద నీటితో రిజర్వాయర్లు, చెట్లను పూర్తిస్థాయిలో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోసారి వరద నీరు వస్తే వర్షాకాలం ఆరంభంలోనే అన్ని రిజర్వాయర్లు కుంటలు చెరువులు నిండి భూగర్భ జలాల మట్టం పెరగడంతోపాటు పంటల సాగు పెద్ద మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా మీరు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ఒక యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

నీటమునిగిన మోటర్లు :

ఊహించని విధంగా కృష్ణా నదికి వరద నీరు రావడంతో పలు గ్రామాలలో మోటార్ పంపు సెట్లు వరద నీటిలో మునిగి పోయాయి. వేసవి కాలంలో తమ పొలాలకు కృష్ణానది తీరం వెంబడి బోరు మోటార్లు ఏర్పాటు చేసుకొని రైతులు వ్యవసాయం చేశారు. ఊహించని విధంగా వరద నీళ్లు రావడంతో ఎక్కడి మోటార్లు అక్కడే మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం.


Next Story

Most Viewed