Health: విటమిన్ D లోపం.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

by Yella Dhawani Reddy |

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన పోషకాల్లో విటమిన్ 'D' కూడా ఒకటి.

Health: విటమిన్ D లోపం.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన పోషకాల్లో విటమిన్ 'D' కూడా ఒకటి. సూర్యరశ్మి ద్వారా నేరుగా శరీరంలో విటమిన్ D ఉత్పత్తి అవుతుంది. ఇక ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో, చర్మ ఆరోగ్యానికి, కండరాల పనితీరును మెరుగుపర్చటంలో, రోగనిరోధకశక్తి పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇటీవల కాలంలో చాలా మందిని విటమిన్ D లోపం వేధిస్తోంది. ఈ క్రమంలో తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది.

అపోలో ఆస్పత్రిలోని వైద్యబృందం.. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, డీఆర్‌డీఓ, హైదర్‌గూడ, జూబ్లీహిల్స్‌తోపాటు ఇతర జిల్లాల్లో తమ క్లినిక్‌లకు వచ్చిన 17,321 మందిలో విటమిన్ D పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఏకంగా 14,238 మందిలో విటమిన్ D లోపం ఉన్నట్లు గుర్తించింది. దీంతో వైద్యులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. శరీర ఆరోగ్యానికి విటమిన్ D తప్పనిసరని, ఎముకలు, కండరాల ఆరోగ్యానికి ఇది కీలకమని సూచిస్తున్నారు.

సూర్యరశ్మి ద్వారా ఈ విటమిన్‌ శరీరంలోకి చేరుతుందని, ఇళ్లు, కార్యాలయాల్లో రోజంతా ఏసీలకు పరిమితమవ్వకుండా ఉదయం పూట కాసేపు కచ్చితంగా సూర్యరశ్మిలో ఉండాలంటున్నారు. జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని సరైన పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ D లోపం వల్ల పిల్లల్లో రికెట్స్‌ అనే వ్యాధికి, పెద్దల్లో బోలు ఎముకల వ్యాధికి, మానసిక స్థితిలో మార్పులు, కుంగుబాటు, ఇతర మానసిక రుగ్మతలకూ కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక సూర్యరశ్మి కాకుండా పుట్టగొడుగులు, ఒమేగా-3 ఫ్యాట్స్‌ ఉండే చేపలు, గుడ్డు సొన, సోయాపాల్లో విటమిన్‌ D కొంతవరకు ఉంటుంది. వీటిని ఆహారంతోపాటు తరచూ తీసుకోవాలని చెబుతున్నారు.

Next Story