తెలుగు రాష్ట్రాల్లో పుట్టబోయే బిడ్డలకు ప్రమాదం.. ఇదే కారణం

by Sujitha Rachapalli |

గర్భధారణ సమయంలో వరుసగా మూడు నుంచి నాలుగు రోజులపాటు తీవ్రమైన ఎండలకు గురికావడం వల్ల శిశువు తక్కువ బరువుతో జన్మించే ప్రమాదం పెరుగుతుందని దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో పుట్టబోయే బిడ్డలకు ప్రమాదం.. ఇదే కారణం
X

దిశ, ఫీచర్స్ : గర్భధారణ సమయంలో వరుసగా మూడు నుంచి నాలుగు రోజులపాటు తీవ్రమైన ఎండలకు గురికావడం వల్ల శిశువు తక్కువ బరువుతో జన్మించే ప్రమాదం పెరుగుతుందని దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి కాలంలో తరచూ నమోదయ్యే తీవ్రమైన వేడి గర్భిణుల ఆరోగ్యంతో పాటు నవజాత శిశువుల ఆరోగ్యాన్నీ ప్రభావితం చేసే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఉష్ణ ఒత్తిడి Vs శిశువు జననం

భారతదేశంలో గర్భధారణపై తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావాన్ని జనాభా స్థాయిలో విశ్లేషించిన తొలి అధ్యయనంగా పరిశోధకులు పేర్కొన్నారు. దీర్ఘకాలం కొనసాగే ఉష్ణతరంగాలే కాకుండా.. వరుసగా మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగే తీవ్రమైన ఎండలు కూడా గర్భస్థ శిశువుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం స్పష్టం చేసింది. ‘భారతదేశంలో తీవ్రమైన ఉష్ణ ఒత్తిడి వల్ల గర్భధారణ ఫలితాలపై ప్రభావం’ అనే శీర్షికతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2015 నుంచి 2020 మధ్య నమోదైన 2,09,266 ప్రసవాల వివరాలను పరిశీలించారు. ప్రతి గర్భిణి గర్భధారణ కాలంలో నమోదైన స్థానిక ఉష్ణ పరిస్థితులను ప్రసవ వివరాలతో అనుసంధానించి విశ్లేషించారు.

సాధారణ ఉష్ణోగ్రతలను కాకుండా.. ఆయా ప్రాంతాల దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితులతో పోల్చి ఇండియా హీట్ ఇండెక్స్ 90వ శాతానికి మించిన రోజులను ‘తీవ్ర ఉక్కపోత రోజులు’ గా గుర్తించారు. అలాంటి రోజులు వరుసగా ఎన్ని రోజులపాటు నమోదయ్యాయనే ఆధారంగా పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనం అంతర్జాతీయ సమీక్ష పొందిన ‘ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్’ శాస్త్రీయ పత్రికలో ప్రచురితమైంది.

ఎక్కువ ఎండ.. తక్కువ బరువు

జనన సమయంలో 2,500 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టే శిశువులను తక్కువ బరువు శిశువులుగా పరిగణిస్తారు. గర్భధారణ సమయంలో ప్రతి అదనపు తీవ్రమైన వేడి రోజు నమోదైనప్పుడల్లా అలాంటి శిశువు జన్మించే అవకాశం సుమారు ఒక శాతం మేర పెరుగుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అలాగే గర్భధారణ తొలి మూడు నెలల్లో తీవ్రమైన వేడి ప్రభావానికి గురైన మహిళల్లో ముందస్తు ప్రసవం ప్రమాదం అధికంగా ఉండగా.. రెండో త్రైమాసికంలో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటే తక్కువ బరువుతో శిశువు జన్మించే అవకాశం పెరుగుతున్నట్లు తేలింది.

అధ్యయన రచయితలు ఏం చెప్తున్నారు?

అధ్యయన ప్రధాన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్–ఐఐటీ ఢిల్లీ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ (యూక్యూఐడీఏఆర్)కు చెందిన వినీతా విన్సెంట్ మాట్లాడుతూ.. ‘ప్రతి అదనపు తీవ్రమైన వేడి రోజు వల్ల పెరిగే ప్రమాదం శాతం పరంగా చిన్నదిగా కనిపించినప్పటికీ.. దీర్ఘకాల గర్భధారణలో అది ఎక్కువ అవుతుంది. భారతదేశంలో తీవ్రమైన వేడి రోజులు పెరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రజారోగ్య పరంగా అత్యంత కీలక అంశం’ అని తెలిపారు.

ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్, సహ రచయిత సాగ్నిక్ దే మాట్లాడుతూ.. ‘తీవ్రమైన ఎండలకు ఎక్కువగా గురయ్యే వారు సాధారణంగా పేదలు, తక్కువ చదువుకున్నవారు, పోషకాహార లోపంతో ఉన్న మహిళలే. ఈ సామాజిక అసమానతను పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించే చర్యలు అత్యంత అవసరమైన గర్భిణులకు రక్షణ కల్పించలేవు’ అని పేర్కొన్నారు. గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి ఉష్ణ తరంగాల సమయంలో తగిన రక్షణ చర్యలు చేపట్టేలా హీట్ యాక్షన్ ప్రణాళికల్లో ప్రాధాన్య వర్గంగా చేర్చాలని పరిశోధకులు సూచించారు. దేశంలో వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వేడి రోజులు పెరుగుతున్న నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు అత్యవసరమని అధ్యయనం స్పష్టం చేసింది.

Next Story