డైట్ సోడా ఎక్కువగా తాగేవారికి షాకింగ్ న్యూస్

by Naga Rani Yarlagadda |

బరువు తగ్గాలని కోరుకునే వారు ఎక్కువగా డైట్ సోడాల (Diet Soda) వైపు మొగ్గు చూపుతుంటారు. తక్కువ కేలరీలున్నాయని భావించి..

డైట్ సోడా ఎక్కువగా తాగేవారికి షాకింగ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: బరువు తగ్గాలని కోరుకునే వారు ఎక్కువగా డైట్ సోడాల (Diet Soda) వైపు మొగ్గు చూపుతుంటారు. తక్కువ కేలరీలున్నాయని భావించి ఆరోగ్యానికి మంచిదని ఊహిస్తారు. కానీ తాజా అధ్యయనాలు చెబుతున్న విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. తరచూ డైట్ సోడాను తీసుకోవడం శరీరానికి వివిధ రకాల ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉన్నట్లు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

డైట్ సోడా వినియోగం పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ఆరోగ్యపరమైన సమస్యలను కలిగించే అవకాశముందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, స్ట్రోక్ అసోసియేషన్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ డ్రింక్‌ను తరచూ తీసుకునే మహిళల్లో అధిక బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

డైట్ డ్రింక్‌లలో సాధారణంగా ఉండే అస్పార్టేట్, సుక్రలోజ్ వంటి తీపి పదార్థాలు జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపవచ్చు. దీర్ఘకాలం వీటిని తీసుకోవడం మానసికంగా తినే అలవాట్లను తప్పుదారి పట్టించవచ్చు. తద్వారా ఆకలి నియంత్రణ తగ్గి బరువు పెరిగే అవకాశం ఉంది.

ఫాస్ఫరిక్ యాసిడ్ వంటి రసాయనాలు డైట్ సోడాలో ఉండటం వలన ఎముకల దృఢత్వం దెబ్బతింటుంది. వయస్సు పెరుగుతున్న వారికి ఇది ఆస్టియోపొరోసిస్‌ (ఎముకలు బలహీనపడే వ్యాధి)కు దారి తీసే అవకాశం ఉంది. డైట్ సోడా వంటి ఆమ్లత కలిగిన పానీయాలు పళ్ల మీద ఉన్న ఎనామెల్‌ను క్రమంగా తొలగిస్తాయి. ఇది దంతాల్లో నొప్పి, రంగు మారడం, సున్నితత వంటి సమస్యలకు కారణమవుతుంది.

అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రకారం.. రోజుకు నాలుగు గ్లాసులు లేదా అంతకన్నా ఎక్కువ డైట్ సోడా తీసుకునే వారికి డిప్రెషన్ వచ్చే అవకాశాలు 30% ఎక్కువగా ఉంటాయట. దీని వలన మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కొంతమందికి డైట్ సోడా తాగిన వెంటనే కడుపులో గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవచ్చు.

అస్పార్టేట్ వంటి పదార్థాలపై సున్నితంగా స్పందించే వ్యక్తులు డైట్ సోడా తీసుకున్న వెంటనే తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలను ఎదుర్కొనవచ్చు. తక్కువ కేలరీలున్నాయని నమ్మి డైట్ సోడాను తరచూ తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సహజమైన పానీయాలు, ఉదాహరణకు నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు వంటి వాటిని ఎంచుకోవడం ఆరోగ్యకరమైన మార్గం.

Next Story