- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యావరణానికి కొత్త ఆశ.. ఉర్థి బ్రాండ్!
ముంబైకి చెందిన సోనియా వర్మ, ఫరీన్ అలీ ఇంట్లో ప్రారంభించిన చిన్న ప్రయోగం ఇప్పుడు 200 కుటుంబాల ఇండ్లలో శుభ్రతకు సహాయపడుతోంది.

దిశ, ఫీచర్స్: ముంబైకి చెందిన సోనియా వర్మ, ఫరీన్ అలీ ఇంట్లో ప్రారంభించిన చిన్న ప్రయోగం ఇప్పుడు 200 కుటుంబాల ఇండ్లలో శుభ్రతకు సహాయపడుతోంది. జ్యూస్ షాపుల నుంచి వచ్చే నిమ్మ తొక్కలను వ్యర్థం కాకుండా సేకరించి.. సహజ శుభ్రపరిచే బయో ఎంజైమ్స్ తయారు చేస్తున్నారు. ఆ బ్రాండ్ పేరు "ఉర్థి".
టెర్రస్ నుంచి ప్రారంభం..
2019లో హోమ్‌స్కూలింగ్ కమ్యూనిటీ ద్వారా సోనియా, ఫరీన్ స్నేహితులయ్యారు. ఇద్దరూ సొంతంగా ఇంట్లో బయోఎంజైమ్స్ తయారు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అలా ఇద్దరి ఆలోచనలు, ఇద్దరి పనులు కలిసి 2022లో ఉర్థి బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. సోనియా ఒకప్పుడు కుటుంబ వ్యాపారంలో బిజీగా ఉండేది. కానీ పిల్లలు పుట్టాక ఇంటికే పరిమితం అయ్యింది. అప్పుడే పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలను తగ్గించాలనే ఆలోచన వచ్చింది. ఫరీన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ నేపథ్యం నుంచి సహజ జీవన విధానాల వైపు మొగ్గు చూపింది. ఇద్దరూ కలిసి టెర్రస్‌పై డ్రమ్ముల్లో లెమన్ తొక్కలు, బెల్లం, నీటితో మిశ్రమం సిద్ధం చేసి పులియబెట్టడం ప్రారంభించారు.
ఎలా తయారవుతుంది?
బయో ఎంజైమ్ చాలా సరళమైన ప్రక్రియ. లెమన్ తొక్కలు, బెల్లం, నీరు కలిపి గాలి చొరని డ్రమ్ముల్లో మూడు నెలలు పులియబెట్టాలి. ఆ తర్వాత వచ్చే ద్రవంలో మంచి ఈస్ట్, బ్యాక్టీరియా, ఎంజైమ్స్ ఏర్పడతాయి. ఇవి గ్రీజ్, సేంద్రీయ వ్యర్థాలను సహజంగా విచ్ఛిన్నం చేస్తాయి. సాధారణ రసాయనిక శుభ్రపరిచే మందుల మాదిరి కాకుండా ఇవి పర్యావరణానికి హాని చేయవు. నేలపైకి, డ్రైన్‌లోకి వెళ్లినా మంచి బ్యాక్టీరియాలను చంపకుండా వ్యర్థాలను కుళ్ళింపజేసి శుభ్రం చేస్తాయి. ఇప్పటికి 1500 కేజీలకు పైగా లెమన్ తొక్కలను ల్యాండ్‌ఫిల్స్‌లోకి వెళ్లకుండా కాపాడారు.
200 కుటుంబాల్లో మార్పు..
ఉర్థి ఉత్పత్తులు ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, లాండ్రీ వాష్, టాయిలెట్ క్లీనర్, ఆల్ పర్పస్ క్లీనర్.. ఇలా 15 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. పిల్లలు నేలపై ఆడుకుంటున్నప్పుడు రసాయనాల గురించి భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ ఉత్పత్తులను ఉపయోగించి పర్యావరణ స్నేహపూర్వక జీవనం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఉర్థి ఇంటి ఉపయోగం నుంచి హోటల్స్, రిసార్టులు, వాణిజ్య సంస్థల వరకు విస్తరిస్తోంది. ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువు నేలను, నీటిని, పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం ద్వారా మనం బాధ్యతాయుతంగా తయారవుతామనేది వాళ్లు చెప్పేమాట.






