1.7 కోట్ల పీపీఈలు, 49వేల వెంటిలేటర్లు ఆర్డర్ చేశాం : హెల్త్ మినిస్ట్రీ

by  |
1.7 కోట్ల పీపీఈలు, 49వేల వెంటిలేటర్లు ఆర్డర్ చేశాం : హెల్త్ మినిస్ట్రీ
X

న్యూఢిల్లీ: పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ), ఇతర రక్షణ పరికరాల నిల్వలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. దాదాపు 1.7 కోట్ల వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ)లు సహా 49వేల వెంటిలేటర్లను ఆర్డర్ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఆర్డర్ తాలూకు పరికరాలు దేశంలోకి సరఫరా కావడమూ మొదలైందని వివరించారు. పీపీఈ స్టోరేజీ గురించి ఆయన మాట్లాడుతూ.. అవి ప్రతి ఒక్కరికి అవసరం లేదని అన్నారు. అసలు పీపీఈలు ఎన్ని ఉన్నాయన్న ప్రశ్న కన్నా.. తీవ్రతకు, అవసరానికి తగినట్టుగా వాటిని వినియోగిస్తున్నామా? లేదా? అన్నదే కీలకమని వివరించారు. అలాగే, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయడం గురించి మాట్లాడుతూ.. మనకు ఆ డ్రగ్ కొరత లేదని పునరుద్ఘాటించారు. అయితే, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను నిర్దేశిత సూచనల ప్రకారమే వినియోగిస్తామని తెలిపారు. లేదంటే హృద్రోగ సమస్యలకు దారితీయొచ్చని వివరించారు. ఎవరికైతే అవసరమున్నదో వారే ఆ మాత్రలను వేసుకోవాలని చెప్పారు.

24 గంటల్లో 549 కేసులు.. 17 మరణాలు

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 549 కేసులు నమోదు కాగా, 17 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5,865కి పెరిగాయని వివరించారు. కాగా, 477 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు.

కరోనా కట్టడి చర్యల్లో రాష్ట్రాలు జాప్యం వహిస్తున్నాయా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఫీల్డ్ వర్కర్లు సుదీర్ఘకాలంలో పనిలో ఉండటంతో వారిలో కొంత నిరుత్సాహం ఏర్పడవచ్చు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం సమంజసమేనని అభిప్రాయపడ్డారు. అయితే, మన ఎదురుగా ఉన్న సవాలును బట్టి తగిన విధంగా చర్యలకు ఉపక్రమించాలని తెలిపారు. హెల్త్ స్కీములపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రపై మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్స్ ప్యాకేజీకి… 100 శాతం కేంద్రమే నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ఈ స్కీం ద్వారా మెడికల్ వ్యవస్థను పటిష్టం చేయడం.. అత్యవసరమైన పరికరాలు, ఔషధాలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని వివరించారు. కాగా, పీపీఈలు, మాస్కులు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపారు.

ఐసొలేషన్ యూనిట్లుగా 3,250 బోగీలు:

3,250 కోచ్‌లను ఐసొలేషన్ యూనిట్లుగా రైల్వే మార్పు చేసిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం ఐదువేల బోగీలను ఇలా మార్పు చేయాల్సి ఉన్నదని తెలిపారు. భారత రైల్వే ఇప్పటి వరకు ఆరు లక్షల రీయూజబుల్ మాస్కులను తయారు చేసిందని పేర్కొన్నారు. నాలుగు వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్‌ను ఉత్పత్తి చేసిందని చెప్పారు.

కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.30లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ హెడ్ డాక్టర్ కేకే గంగఖేద్కర్ తెలిపారు. అయితే, రెండు నెలలుగా పాజిటివిటీ రేటులో పెద్దగా మార్పు లేదని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు మూడు నుంచి ఐదుగానే నమోదవుతున్న్దని వివరించారు.

Tags: ppe, ventilators, health minister, icmr, storage, hydroxychloroquine, railway, cases


Next Story

Most Viewed